కమిషనర్ బంగ్లా.. డీఆర్‌ఆర్ స్టేడియం.. దండోరా
ABN , Publish Date - Mar 29 , 2025 | 12:56 AM
నడిరోడ్డుపై విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరువు మంటగలిసింది. ఓ కాంట్రాక్టు సంస్థకు డబ్బును ఎగ్గొట్టినందుకు బందరు రోడ్డు వెంబడి మునిసిపల్ కమిషనర్ బంగ్లా, డీఆర్‌ఆర్ ఇండోర్ స్టేడియాన్ని విజయవాడ కమర్షియల్ కోర్టు శుక్రవారం తమ ఆధీనంలోకి తీసుకుంది. అంతేకాదు.. గేట్లకు నోటీసులు అంటించడంతో పాటు దండోరా కూడా వేయించింది.

నడిరోడ్డుపై మంటగలిసిన కార్పొరేషన్ పరువు
కమిషనర్ బంగ్లా, డీఆర్‌ఆర్ స్టేడియాల అటాచ్
నోటీసులు అంటించిన కమర్షియల్ కోర్టు సిబ్బంది
ప్రజలందరికీ తెలిసేలా దండోరా వేయించిన అధికారులు
నాటి బీఆర్‌టీఎస్ రోడ్డు పనుల్లో కాంగ్రెస్ నిర్వాకం
13 ఏళ్లుగా కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించని వైనం
కమర్షియల్ కోర్టును ఆశ్రయించిన కాంట్రాక్టు సంస్థ
బిల్లులు చెల్లించాలని నెల కిందట కార్పొరేషన్‌కు ఆదేశాలు
అధికారులు పట్టించుకోకపోవడంతో చర్యలు.. అటాచ్
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉండగా, 2012లో నాటి యూపీఏ ప్రభుత్వం జవహర్‌లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రె న్యువల్ మిషన్ (జేఎన్‌ఎన్యూఆర్‌ఎం) పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంలో భాగంగా అప్పట్లో రూ.2 వేల కోట్ల వరకు వివిధ పథకాలకు నిధులు కేటాయించింది. ఇందులో బస్ ర్యాపిడ్ ట్రాన్సిస్ట్ సిస్టమ్ (బీఆర్‌టీఎస్) ఒకటి. రూ.154 కోట్ల ఈ ప్రాజెక్టుకు అప్పట్లో యూపీఏ ప్రభుత్వం నిధులు కేటాయించింది. రైల్వేశాఖతో మాట్లాడి సత్యనారాయణపురంలోని పాత రైల్వేలైన్ స్థలాన్ని కార్పొరేషన్ అధికారులు తీసుకున్నారు. ప్రతిగా వేరేచోట కార్పొరేషన్ తన భూమిని రైల్వేకు కేటాయించింది. సత్యనారాయణపురం పాత రైల్వేలైన్ స్థానంలో బీఆర్‌టీఎస్ రోడ్డును అభివృద్ధి పరచాలని నిర్ణయించింది. అప్పటి కౌన్సిల్ పాలకపక్షంగా ఉన్న కాంగ్రెస్.. బీఆర్‌టీఎస్ పథకాన్ని సత్వర రవాణా వ్యవస్థ కోసం కాకుండా రోడ్లను నిర్మించుకునేందుకు ఉపయోగించుకోవాలని భావించింది. సీతన్నపేట మీసాల రాజారావు బ్రిడ్జి దగ్గర నుంచి ఏలూరు రోడ్డుకు సమాంతరంగా పడవలరేవు వరకు 6.50 కిలోమీటర్ల మేర ఆరు వరసల బీఆర్‌టీఎస్ రోడ్డును అభివృద్ధి పరచాలని నిర్ణయించింది. మధ్యలో రెండు వరసల డెడికేటెడ్ కారిడార్, రెండువైపులా రెండేసి లైన్లలో సాధారణ రోడ్డుతో ఈ కారిడార్‌కు రూపకల్పన చేసింది. ఈ రోడ్డు పనులను కాంటెక్స్ సిండికేట్ అనే నిర్మాణ సంస్థ దక్కించుకుంది. శరవేగంగా రోడ్డు పనులను చేపట్టింది.
డీపీఆర్ మారడంతో..
కేంద్ర ప్రాయోజిత పథకం కాబట్టి డీపీఆర్‌కు భిన్నంగా పనులు చేపట్టకూడదు. అప్పటి పాలకపక్షం, కార్పొరేషన్ ఉన్నతాధికారులు కేంద్రానికి ఇచ్చిన డీపీఆర్ ప్రకారం కాకుండా ఇష్టానుసారంగా కాంట్రాక్టు సంస్థతో పనులు చేయించారు. వంతెనలు, కల్వర్టులు వంటివి అదనంగా ప్రతిపాదించారు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తీసుకోకుండా వీటిని చేపట్టకూడదు. కేంద్రంలో తమ ప్రభుత్వమే ఉందని.. అప్పటి కాంగ్రెస్ పాలకపక్షం కాంట్రాక్టు సంస్థ మెడపై కత్తి పెట్టి పనులు చేయించింది. దీంతో కాంట్రాక్టు సంస్థ తప్పక.. కార్పొరేషన్ అధికారులు చెప్పిన ప్రకారం పనులు చేసింది. ఆ తర్వాత డీపీఆర్ ప్రకారం పనులు జరగలేదని కేంద్ర ప్రభుత్వం కొంతమేర నిధులను నిలిపివేసింది. దీంతో కాంట్రాక్టు సంస్థ ఇబ్బందుల్లో చిక్కుకుంది. అప్పటి మున్సిపల్ కమిషనర్ పీఎస్ ప్రద్యుమ్న ఈ సమస్యను పరిష్కరించటానికి ఎంతో కృషి చేశారు. కాంట్రాక్టు సంస్థకు జాతీయ స్థాయిలో ఉన్న పరిచయాల దృష్ట్యా ఈ తప్పును సరిచేసుకునేందుకు వీలుగా కార్పొరేషన్ అధికారులతోనే డీపీఆర్‌ను సవరించి, దానిని అప్పటి కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి జరిగిన పరిస్థితిని వివరించింది. సవరింపులకు ఆమోదం పడేలా తన వంతు కృషి చేసింది. ఆ రివైజ్డ్ డీపీఆర్ ప్రకారం ఆ తర్వాత కార్పొరేషన్‌కు డబ్బులొచ్చాయి.
ఆ నిధులు ఇతర అవసరాలకు..
కార్పొరేషన్‌కు అనేకమంది కమిషనర్లు మారారు. ప్రద్యుమ్న తర్వాత వచ్చిన కమిషనర్లు ఎవరూ కూడా కాంట్రాక్టు సంస్థకు చెల్లించాల్సిన బిల్లుపై దృష్టి సారించలేదు. పైగా ఆ డబ్బును వేరే అవసరాలకు వినియోగించారు. దీంతో 2012 నుంచి ఇప్పటి వరకు దాదాపు 13 ఏళ్ల పాటు కాంట్రాక్టు సంస్థకు డబ్బు చెల్లించలేదు. కాంట్రాక్టు సంస్థకు వడ్డీతో కలిపి రూ.35 కోట్ల మేర కార్పొరేషన్ చెల్లించాల్సి ఉంది. దీంతో కాంట్రాక్టు సంస్థ తనకు జరిగిన అన్యాయంపై విజయవాడలోని కమర్షియల్ కోర్టులో కేసు వేసింది. వాయిదాలు నడుస్తూ ఉన్నాయి. కార్పొరేషన్ దగ్గర డబ్బు లేకపోతే కమిషనర్ బంగ్లా, డీఆర్‌ఆర్ స్టేడియం అమ్మి అయినా తమకు డబ్బు చెల్లించాల్సిందిగా కాంట్రాక్టు సంస్థ క మర్షియల్ కోర్టుకు నివేదించింది. దీంతో నెల కిందట కమర్షియల్ కోర్టు కార్పొరేషన్‌ను గట్టిగా హెచ్చరించింది. కాంట్రాక్టు సంస్థ సూచించిన విధంగా ఆస్తులమ్మి డబ్బు చెల్లించాలని ఆదేశించింది. దాదాపు నెల రోజులు గడిచినా కార్పొరేషన్ అధికారులు ఆ పని చేయలేదు. దీంతో శుక్రవారం కమర్షియల్ కోర్టు సిబ్బంది వచ్చి కమిషనర్ బంగ్లా, డీఆర్‌ఆర్ స్టేడియాలను తమ ఆదీనంలోకి తీసుకున్నట్టుగా నోటీసులు అంటించటంతో పాటు ప్రజలకు తెలిసేలా దండోరా వేయించారు. ఈ పరిణామాలతో కంగుతిన్న కార్పొరేషన్ అధికారులు హైకోర్టును ఆశ్రయించటం గమనార్హం.