దమ్మారో.. దమ్!
ABN , First Publish Date - 2023-03-26T23:57:21+05:30 IST
జిల్లాలో గంజాయి గుప్పుమంటోంది. రవాణా విక్రయాలు, జోరుగా సాగుతున్నాయి. ఒకవైపు ఎస్‌ఈబీ అధికారులు, మరోవైపు పోలీసులు నిఘా పెంచామని చెప్తున్నప్పటికీ గంజాయి స్మగ్లర్లకు మాత్రం కళ్లెం పడటం లేదు. పల్లె, పట్టణం అన్న తేడాలేకుండా అన్ని చోట్లా గంజాయి దొరుకుతోంది. ఒక్కో ప్యాకెట్‌ను రూ.50, రూ.100, రూ.200కు అమ్ముతున్నారు. విద్యార్థులు, యువత ఎక్కువగా గంజాయిని బానిసవుతోంది. కొన్నిచోట్ల ఆన్‌లైన్ పేమెంట్లు చేసి మరీ కొనుగోలు చేస్తున్నారు. ఇటీవల పోలీసులు, ఎస్‌ఈబీ అధికారులకు పట్టుబడిన వారిని విచారించగా ఈ విషయం వెల్లడైంది.

గుప్పుమంటున్న గంజాయి
ఒంగోలు, టంగుటూరు కేంద్రాలుగా
ఇతర ప్రాంతాలకు సరఫరా
జోరుగా విక్రయాలు
బానిసలవుతున్న
విద్యార్థులు, యువత
పల్లెల్లోనూ ప్యాకెట్లు
ఆన్‌లైన్‌లో నగదు
చెల్లించి కొనుగోళ్లు
జిల్లాను గంజాయి ముంచెత్తుతోంది. విశాఖ ఏజెన్సీ నుంచి విచ్చలవిడిగా ఇక్కడికి రవాణా అవుతోంది. కొందరు వ్యక్తులు ముఠాలుగా ఏర్పడి ఈ వ్యవహారాన్ని సాగిస్తున్నారు. రైళ్లు, ఇతర రవాణా మార్గాల్లో గంజాయిని ఇక్కడికి తెస్తున్నారు. జిల్లాలోని కొన్ని ప్రాంతాలను అడ్డాగా చేసుకొని పట్టణాలు, మండల కేంద్రాలకు సరఫరా చేస్తున్నారు. అక్కడ ప్యాకెట్లలో నింపి విక్రయిస్తున్నాయి. దీంతో పల్లెల్లోనూ గంజాయి గుప్పుగుప్పుమంటోంది. తక్కువ మొత్తానికి ఎక్కువ కిక్ ఇస్తుండటంతో యువత, విద్యార్థులు, కార్మికులు ఆకర్షితులవుతున్నారు. మైకంలో తేలిపోతున్నారు. వాటిని కాల్చి, పీల్చి అనారోగ్యం బారినపడుతున్నారు. పాతికేళ్లకే భవిష్యత్‌ను బలి చేసుకుంటున్నారు. ఆన్‌లైన్‌లో నగదు చెల్లించి మరీ గంజాయి కొనుగోలు చేస్తుండటం విస్తుగొలుపుతోంది.
ఒంగోలు (క్రైం), మార్చి 26 : జిల్లాలో గంజాయి గుప్పుమంటోంది. రవాణా విక్రయాలు, జోరుగా సాగుతున్నాయి. ఒకవైపు ఎస్‌ఈబీ అధికారులు, మరోవైపు పోలీసులు నిఘా పెంచామని చెప్తున్నప్పటికీ గంజాయి స్మగ్లర్లకు మాత్రం కళ్లెం పడటం లేదు. పల్లె, పట్టణం అన్న తేడాలేకుండా అన్ని చోట్లా గంజాయి దొరుకుతోంది. ఒక్కో ప్యాకెట్‌ను రూ.50, రూ.100, రూ.200కు అమ్ముతున్నారు. విద్యార్థులు, యువత ఎక్కువగా గంజాయిని బానిసవుతోంది. కొన్నిచోట్ల ఆన్‌లైన్ పేమెంట్లు చేసి మరీ కొనుగోలు చేస్తున్నారు. ఇటీవల పోలీసులు, ఎస్‌ఈబీ అధికారులకు పట్టుబడిన వారిని విచారించగా ఈ విషయం వెల్లడైంది.
మూడేళ్లుగా విచ్చలవిడిగా రవాణా
కరోనా కాలం గంజాయి స్మగ్లర్‌లకు కలిసి వచ్చింది. గత మూడేళ్లుగా జోరుగా ఈ వ్యాపారం చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. యువత, విద్యార్థులు, కూలీలను బానిసలుగా మారుస్తున్నారు. కొందరిని వ్యాపారంలోకి దించుతున్నారు. ఒక్కసారి గంజాయి దమ్ము లాగిన వారు వాటిని వదల్లేకపోతున్నారు. గంజాయిని రైళ్లు బస్సులు, లారీలతోపాటు కార్లు, ఆటోల్లో తరలిస్తున్నారు. విశాఖ ఏజెన్సీలో కిలో మూడు వేలకు కొనుగోలు చేసి ఇక్కడ ఆరువేలకు విక్రయిస్తున్నారు ఆదాయం బాగా ఉండటంతో అనేక మంది దీనివైపు దృష్టి సారిస్తున్నారు. తక్కువ డబ్బుతో ఎక్కువ మత్తు ఇస్తుండటంతో యువత గంజాయి వైపు మొగ్గుచూపుతోంది. ఇటీవల గంజాయిని తరలిస్తూ ఒంగోలు, టంగుటూరు, సింగరాయకొండ ప్రాంతాల్లో ఎస్‌ఈబీ అధికారులు, పోలీసులు అధికారులకు పట్టుబడిన వారు వెల్లడించిన వివరాలను పరిశీలిస్తే నిత్యం గంజాయి జిల్లాకు పెద్దమొత్తంలో అవగతమవుతుంది. ఒంగోలు, టంగుటూరు, సింగరాయకొండ, నెల్లూరు జిల్లా ఉలవపాడు తదితర ప్రాంతాలను కేంద్రాలుగా చేసుకొని గంజాయి వ్యాపారం జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది.
గంజాయి రవాణా ఇలా...
ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో రెండు కిలోల చొప్పున గంజాయిని త్రెషింగ్ చేసి ప్యాకెట్లుగా చేస్తారు. దానికి దళసరి కాగితం చుట్టి గంజాయి వాసన రాకుండా చేస్తారు. ఈ ప్యాకెట్లు బ్యాగ్‌లో పెట్టి రైళ్లు,, బస్సులలో రవాణా చేస్తున్నారు. కొంతమంది కార్లు, ఆటోలు, మినీ లారీలలో సైతం ఇక్కడికి తెస్తున్నారు. ఎక్కడా పట్టుబడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకోసం వాహనాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కార్లు, మినీ ఆటోల్లో సీట్ల కింద ప్రత్యేక ర్యాక్‌లు అమర్చుతున్నారు. లారీల్లో క్యాబిన్‌ల వెనుక వైపే ర్యాక్‌లను ఏర్పాటు చేస్తున్నారు. వాటిలో గంజాయి ప్యాకెట్లను ఉంచుతున్నారు. పోలీసులు, ఎస్‌ఈబీ అధికారులు తనిఖీల సమయంలో వీటిని గుర్తించలేకపోతున్నారు. పాల వాహనాల్లో ట్రేలు, ఇతర అత్యవసర రవాణా కింద కూడా గంజాయిని తెస్తున్నారు. దాన్ని చిన్నచిన్న ప్యాకెట్లుగా చేసి ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. అయితే చిన్నవ్యాపారుల వద్ద ముందుగానే డబ్బు తీసుకొని గంజాయి ఆర్డర్ ప్రకారం సరఫరా చేస్తుంటారు.
మత్తుకు బానిసలవుతున్న విద్యార్థులు
గంజాయికి ఎక్కువగా విద్యార్థులు బానిసలవుతున్నట్లు ఇటీవల సెబ్ అధికారుల విచారణలో వెల్లడైంది. పేర్నమిట్టకు చెందిన మహిళను అదుపులోకి తీసుకొని విచారించగా వల్లు గగుర్పొడిచే నిజాలు వెలుగు చూశాయి. విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా ముందుగానే నగదు చెల్లించి గంజాయిని కొనుగోలు చేస్తున్నట్లు తేలింది. దీంతో అధికారులు సైతం విస్తుపోయారు. ఆ మహిళ వద్ద లభించిన ఆధారాల ప్రకారం గంజాయి కొనుగోలు చేస్తున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అదనపు ఎస్పీ పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. వీరితోపాటు కూలీలు, డ్రైవర్లు, మెకానిక్‌లు సైతం గంజాయికి బానిసలుగా మారినట్లు తెలుస్తోంది. ఒక్కసారి గంజాయి దమ్ము లాగిన వారు వాటిని వదల్లేకపోతున్నారు. ముత్తులో లోయలో పడి బయటకు రాలేకపోతున్నారు. గంజాయికి బానిసైన కొందరు చదువును మధ్యలోనే మానేస్తుండగా, మరికొందరు అనారోగ్యం బారిన పడుతున్నారు. కొందరు మత్తుకు బానిసలు కావడంతోపాటు స్మగ్లర్లుగా, గంజాయి వ్యాపారులుగా మారుతున్నారు. ఇంకొందరు నేరాలకు పాల్పడుతున్నారు.
గంజాయి నిర్మూలనకు సంకల్పం
గంజాయిని సమూలంగా నిర్మూలించాలని ఎస్పీ మలికగర్గ్ నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. అదేసమయంలో గంజాయి రవాణా, విక్రయాలపై నిఘా పెంచారు. మూలాల్లోకి వెళ్లి దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లాను గంజాయిరహితంగా చేయాలన్న లక్ష్యంతో ఆమె ఉన్నారు. అయినప్పటికీ స్మగ్లర్లు ఎప్పటికప్పుడు సరికొత్త ఎత్తుగడలతో ముందుకు సాగుతున్నారు.
మూడు నెలల్లో పట్టుబడిన గంజాయి వివరాలు ఇవీ..
ఏజెన్సీ నుంచి ఒంగోలుకు ఆటోలో గంజాయి తెచ్చి విక్రయిస్తున్న ముగ్గురిని కొద్దినెలల క్రితం ఎస్‌ఈబీ అధికారులు పట్టుకున్నారు. వారి వద్ద 40 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీరు తాళ్లూరు, పొదిలి, కొండపి, నెల్లూరు, కావలికి సరఫరా చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. మూడేళ్లుగా ఈ వ్యాపారం చేస్తున్నట్లు తేలింది.
నర్సీపట్నం (జిల్లా) దొండపాడు నుంచి గంజాయి తెచ్చి విక్రయిస్తున్న ముగ్గురిని ఎస్‌ఈబీ అధికారులు పట్టుకున్నారు. వారి వద్ద 50 కిలోల సరుకును స్వాధీనం చేసుకున్నారు. వీరు ఒంగోలు నుంచి ఉలవపాడు, మన్నేటికోట, పొదిలి, తాళ్లూరు, చీమకుర్తి, సంతనూతలపాడు ప్రాంతాలతోపాటు ఒంగోలులోని చిన్నిచిన్న వ్యాపారులకు గంజాయి విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.
టంగుటురు టోల్‌ప్లాజా వద్ద గత నెల 28న మినీ లారీలో పాల ప్యాకెట్ల మధ్య గంజాయి ఉంచి రవాణా చేస్తుండగా పోలీసులు పట్టుకొన్నారు. 97 కిలోల గంజాయిను స్వాధీనం చేసుకొన్నారు. ఏడుగురుని అదుపులోకి తీసుకున్నారు.
సింగరాయికొండలో గంజాయి విక్రయిస్తున్న నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలానికి ఒక మహిళను పోలీసులు ఈనెల 23న అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద 20 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆ మహిళ కావలి, కందుకూరు ప్రాంతాలకు కూడా గంజాయి సరఫరా చేసినట్లు గుర్తించారు. ఈ కేసులో మొత్తం నలుగురుని అరెస్టు చేసి 50 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇవి పోలీసులు, ఎస్‌ఈబీ అధికారుల తనిఖీల్లో గుర్తించని మాత్రమే. గుట్టుచప్పుడు కాకుండా పెద్దమొత్తంలో జిల్లాకు వస్తున్న గంజాయి వివిధ మార్గాల్లో అన్ని ప్రాంతాలకు సరఫరా అవుతోంది. దీన్ని ఎస్‌ఈబీ అధికారులు, పోలీసులు పూర్తిస్థాయిలో అడ్డుకోలేకపోతున్నారు.