సాదాసీదాగా వైఎస్సార్ జయంతి
ABN , First Publish Date - 2023-07-09T01:25:45+05:30 IST
అధికార పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే దివంగత ముఖ్యమంత్రి వై.ఎ్‌స.రాజశేఖర్‌రెడ్డి జయంతి వేడుకలు ఉమ్మడి జిల్లాలో సాదాసీదాగా జరిగాయి.

సగం నియోజకవర్గాల్లో గ్రూపుల గొడవ
కార్యక్రమాలకు దూరంగా కార్యకర్తలు
ఆంధ్రజ్యోతి, ఒంగోలు
అధికార పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే దివంగత ముఖ్యమంత్రి వై.ఎ్‌స.రాజశేఖర్‌రెడ్డి జయంతి వేడుకలు ఉమ్మడి జిల్లాలో సాదాసీదాగా జరిగాయి. సహజంగా ఏడాదిలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అత్యంత ఘనంగా నిర్వహిస్తారని ఆపార్టీ శ్రేణులు భావించగా అందుకు భిన్నంగా సాగాయి. సగం నియోజకవర్గాల్లో పార్టీలోని గ్రూపులవారీగా నాయకులు వేడుకలు నిర్వహించగా పట్టుమని పాతికమంది కార్యకర్తలు పాల్గొన్న కార్యక్రమాలు అతితక్కువగా ఉన్నాయి. కారణాలు ఏమైనా చాలామంది ముఖ్యనాయకులు కూడా అక్కడ కన్పించలేదు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైఎస్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్న విషయం విదితమే. అధికారికంగా రైతులకు సంబంధించిన ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొనడం, కనీసం నియోజకవర్గానికి ఒకచోటైనా రక్తదాన శిబిరం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించే వారు. కానీ శనివారం జిల్లాలో వేడుకలు నిస్సారంగానే జరిగాయి. జిల్లాకు చెందిన మంత్రి సురేష్ ఇడుపులపాయ వెళ్లినందున కార్యక్రమంలో పాల్గొనలేదు. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని అమెరికాలో ఉన్నారు. వీరితోపాటు దర్శి, సంతనూతలపాడు ఎమ్మెల్యేలు వేణుగోపాల్, సుధాకర్‌బాబులు నియోజకవర్గంలో ఎక్కడా కార్యక్రమంలో పాల్గొన లేదు. జడ్పీ చైర్‌పర్సన్ వెంకాయమ్మ కార్యక్రమంలో పాల్గొన్నా ఆమె కుమారుడు, మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డి ఎక్కడా కన్పించలేదు. డీసీఎంఎస్ చైర్మన్ పద్మావతి, ఆమె భర్త అయిన వైసీపీ పర్చూరు నియోజకవర్గ మాజీ ఇన్‌చార్జి రామనాథంబాబు కార్యక్రమంలో పాల్గొనలేదు. ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలు కూడా ఒకట్రెండు కార్యక్రమాలకే పరిమితమయ్యారు. వారు పాల్గొన్న చోట్ల రక్తదాన శిబిరాలు కాదుకదా కనీసం పేదలకు అన్నదానం చేసిన దాఖలాలు లేవు. ముఖ్యనాయకులకు సంబంధంలేకుండా ఒకట్రెండు చోట్ల కొందరు అన్నదానాలు చేశారు. అలా ఒంగోలులో జరిగిన ఒక అన్నదాన కార్యక్రమంలో ఒంగోలు ఎంపీ మాగుంట, వైసీపీ జిల్లా అధ్యక్షుడు జంకె వెంకటరెడ్డి పాల్గొన్నారు.
పలుచోట్ల వేర్వేరుగా కార్యక్రమాలు
గిద్దలూరులో జరిగిన ఒక కార్యక్రమంలో ఎమ్మెల్యే రాంబాబు పాల్గొనగా అసమ్మతి నాయకులు ఒకచోట, ఎమ్మెల్యే మద్దతుదారులు మరోచోట కార్యక్రమం ఏర్పాటు చేశారు. మార్కాపురంలో ఎమ్మెల్యే నిర్వహించిన కార్యక్రమానికి అసమ్మతి నాయకులు హాజరుకాలేదు. కనిగిరిలో ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ పాల్గొన్న కార్యక్రమాన్ని పలువురు ముఖ్యనాయకులు బహిష్కరించారు. కనిగిరి, హెచ్‌ఎంపాడు జడ్పీటీసీ సభ్యులతోపాటు ఏఎంసీ చైర్మన్, సీనియర్ నాయకులు బన్ని లాంటివారు గైర్హాజరయ్యారు. మరోవైపు పోటీగా రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి నిర్వహించిన కార్యక్రమంలో వీరిలో ఎక్కువ మంది పాల్గొన్నారు. దర్శిలో ఇటు ఎమ్మెల్యే వేణుగోపాల్ మద్దతుదారులు ఒకవైపు, అటు మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి అనుచరులు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహించారు. కొండపి ఇన్‌చార్జి అశోక్‌బాబు సింగరాయకొండలో జరిగిన కార్యక్రమంలో పాల్గొనగా, సెంట్రల్‌బ్యాంకు ఛైర్మన్ వెంకయ్య ఎం.నిడమలూరులో పాల్గొన్నారు. పర్చూరులో ఇన్‌చార్జి ఆమంచి వ్యతిరేక గ్రూపు నాయకులు ఎక్కడా కార్యక్రమంలో పాల్గొన లేదు. ఇలా అనేక నియోజకవర్గాలలో వైసీపీ నాయకులు గ్రూపులవారీ కార్యక్రమాలు నిర్వహించగా కొన్ని నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలపై అసంతృప్తితో ఉన్న నాయకులు కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. మొత్తంగా జయంతి వేడుకలు సాదాసీదాగా జరగడం, నాయకులు గ్రూపులవారీగా నిర్వహించడం అధికార పార్టీలోని డొల్లతనాన్ని తెలియజేసింది.