Share News

వైసీపీకి షాక్‌

ABN , Publish Date - Dec 28 , 2023 | 01:32 AM

నగరానికి చెందిన వైసీపీ నేత, ఎమ్మెల్సీ వంశీకృష్ణశ్రీనివాస్‌ బుధవారం పవన్‌కల్యాణ్‌ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఈ పరిణామం అధికార పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. త్వరలో మరికొందరు నేతలు పార్టీని వీడి టీడీపీ, జనసేనల్లో చేరనున్నట్టు జరుగుతున్న ప్రచారం వైసీపీ నేతలను మరింత ఆందోళనకు గురిచేస్తోంది.

వైసీపీకి షాక్‌

జనసేనలో చేరిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్‌

కనీసం పది మంది కార్పొరేటర్లను

జనసేనలోకి తీసుకువెళతారని జోరుగా ప్రచారం

పార్టీని వీడే ఆలోచనలో మరికొందరు నేతలు?

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నగరానికి చెందిన వైసీపీ నేత, ఎమ్మెల్సీ వంశీకృష్ణశ్రీనివాస్‌ బుధవారం పవన్‌కల్యాణ్‌ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఈ పరిణామం అధికార పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. త్వరలో మరికొందరు నేతలు పార్టీని వీడి టీడీపీ, జనసేనల్లో చేరనున్నట్టు జరుగుతున్న ప్రచారం వైసీపీ నేతలను మరింత ఆందోళనకు గురిచేస్తోంది.

వంశీకృష్ణ శ్రీనివాస్‌ 2009లో ప్రజారాజ్యం పార్టీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 2009 ఎన్నికల్లో పీఆర్‌పీ తరపున తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి వెలగపూడి రామకృష్ణబాబు చేతిలో ఓడిపోయారు. కాంగ్రెస్‌లో పీఆర్‌పీ విలీనం, తదితర పరిణామాల నేపథ్యంలో ఆయన వైసీపీలో చేరారు. పార్టీ నగర అధ్యక్షుడిగా చాలాకాలం పనిచేశారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి మళ్లీ టీడీపీ అభ్యర్థి వెలగపూడి రామకృష్ణబాబు చేతిలో ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో టికెట్‌ దక్కుతుందని ఆశించారు. కానీ చివరి నిమిషంలో అధిష్ఠానం ఆయన్ను పక్కనబెట్టి అక్కరమాని విజయనిర్మలకు సీటు ఇచ్చింది. ఆ సమయంలో తన అసంతృప్తిని వంశీకృష్ణ వ్యక్తం చేసినప్పటికీ పార్టీ అధిష్ఠానం బుజ్జగించింది. అనంతరం మేయర్‌ పదవి దక్కుతుందనే నమ్మకంతో 2021లో జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో 21వ వార్డు నుంచి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. అయితే వంశీకృష్ణకు కాకుండా 11వ వార్డు కార్పొరేటర్‌గా గెలిచిన గొలగాని హరివెంకటకుమారికి వైసీపీ మేయర్‌ పదవి ఇచ్చింది. ఈ పరిణామం వంశీకృష్ణశ్రీనివాస్‌ను మరింత అసంతృప్తికి గురిచేసింది. మేయర్‌ ఎన్నిక కోసం నిర్వహించిన కౌన్సిల్‌ సమావేశంలోనే వంశీకృష్ణ తనకు పార్టీ అన్యాయం చేసిందంటూ కన్నీటిపర్యంతమయ్యారు. తనను బాధపెట్టిన వారికి తన ఉసురు తగులుతుందని అప్పుడే శాపనార్థాలు పెట్టారు. అప్పటి నుంచి తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయనకు రెండేళ్ల కిందట ఎమ్మెల్సీ పదవి లభించింది. అయినప్పటికీ తూర్పు నియోజకవర్గం నుంచి 2024 ఎన్నికల్లో పోటీ చేయాలనే కోరికను తరచూ అధిష్ఠానం వద్ద వ్యక్తంచేసేవారు. అటువైపు నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాకపోవడంతోనే ఆయన హఠాత్తుగా పార్టీని వీడి జనసేనలో చేరిపోయారు. వైసీపీకి చెందిన కనీసం పది మంది కార్పొరేటర్లను జనసేనలో చేర్చేందుకు వంశీకృష్ణ శ్రీనివాస్‌ ప్రణాళిక సిద్ధం చేసినట్టు అధికార పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి. అదే జరిగితే కౌన్సిల్‌లో వైసీపీ బలం తగ్గిపోయి, మైనారిటీలో పడుతుంది. ఇది రానున్న రోజుల్లో పెనుమార్పులకు దారితీసే అవకాశం ఉంటుందని జీవీఎంసీ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇదిలావుండగా తూర్పు నియోజకవర్గం సమన్వయకర్తగా, వీఎంఆర్‌డీఏ చైర్‌పర్సన్‌గా కొద్దికాలం కిందటివరకూ పనిచేసిన అక్కరమాని విజయనిర్మల కూడా అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. పార్టీ కార్యక్రమాలకు కూడా హాజరు కావడం లేదు. వారు కూడా పార్టీ మారిపోతారనే ప్రచారం కొంతకాలంగా ఉంది.

వాసుపల్లికి కూడా టికెట్‌ డౌటేనా?

ఇదిలావుండగా దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌కు వచ్చే ఎన్నికల్లో టికెట్‌ ఇవ్వడంపై అనుమానాలు మొదలయ్యాయి. 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచిన వాసుపల్లి తర్వాత వైసీపీ పంచన చేరారు. అయితే ఆయనతో అప్పటికే వైసీపీలో ఉన్న నాయకులు విభేదిస్తూ వస్తున్నారు. అధిష్ఠానం పలుమార్లు నియోజకవర్గంలోని నేతలతో సమావేశం ఏర్పాటుచేసి వాసుపల్లి నాయకత్వంలో పనిచేయాల్సిందేనని స్పష్టంచేసింది. వచ్చే ఎన్నికల్లో వాసుపల్లికి టికెట్‌ దాదాపు ఖాయమని సంకేతాలు కూడా ఇచ్చింది. దీంతో వాసుపల్లితో పొసగని వారంతా పార్టీని వీడిపోయేందుకు సిద్ధమవుతున్నారు. కొద్దిరోజులుగా కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, మత్సకార సంఘాల నేతలు మీడియా సమావేశాలు పెట్టి వాసుపల్లికి టిక్కెట్టు ఇస్తే తాము పార్టీలో ఉండమని తె గేసి చెప్పడంతో పార్టీ అధిష్టానం ఆలోచనలో పడినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో వాసుపల్లిని బుధవారం తాడేపల్లి పిలిచి మాట్లాడినట్టు సమాచారం. నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో వాసుపల్లికి టిక్కెట్టు ఇస్తే ఓడిపోవడం తథ్యమని అధిష్టానం గుర్తించిందని, ఆయన్ను మార్చడమే మంచిదనే భావనతోనే తాడేపల్లి పిలిచి మాట్లాడి ఉంటారని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికలకు ఇంకా మూడు నెలలు గడువుండగానే ఇలాంటి పరిస్థితి ఉంటే... సమీపిస్తే పరిస్థితి ఎలావుంటుందోనని ఆందోళన చెందుతున్నారు.

Updated Date - Dec 28 , 2023 | 01:32 AM