Chandrababu: చిరుత దాడిలో పాప మృతి అత్యంత విషాదకరం
ABN , First Publish Date - 2023-08-12T12:22:25+05:30 IST
తిరుమలలో చిరుత దాడిలో చిన్నారి మృతి చెందిన ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.
అమరావతి: తిరుమలలో చిరుత దాడిలో చిన్నారి మృతి చెందిన ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) ఆవేదన వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ...‘‘కుటుంబసభ్యులతో కలిసి అలిపిరి మార్గంలో తిరుమల కొండకు కాలినడకన వెళ్తున్న ఆరేళ్ళ చిన్నారి లక్షిత చిరుత దాడిలో మృతి చెందడం అత్యంత విషాదకరం. కళ్ళముందే క్రూర జంతువు కూతురిని లాక్కెళ్లిపోతే ఆ బాధ వర్ణనాతీతం. పాప తల్లిదండ్రులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. కొద్దిరోజుల క్రితం చిరుత దాడిలో బాలుడు గాయపడ్డ ఘటన జరిగింది. ఈ కారణంగా అయినా టీటీడీ మరిన్ని రక్షణ చర్యలు చేపట్టి ఉంటే ఈ ఘోరం తప్పేది. అధికారులు సమర్థవంతమైన ప్రణాళికతో వ్యవహరించి, తగు రక్షణతో భక్తుల భయాన్ని తొలగించాలి’’ అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.
కాగా.. అలిపిరి నడకదారిలో లక్షిత అనే ఆరేళ్ల చిన్నారి తప్పిపోయిన ఘటన తీవ్ర కలకలం రేపింది. నెల్లూరు జిల్లా కొవ్వూరుకు చెందిన లక్షిత కుటుంబం రాత్రి నడక మార్గంలో తిరుమల కొండపైకి బయలు దేరింది. కాలినడకన తిరుమలకు వస్తున్న క్రమంలో రాత్రి 7:30 గంటల సమయంలో లక్షిత తప్పిపోయింది. 10 గంటల వరకూ పాప కోసం వెదికిన కుటుంబ సభ్యులు ఆ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. చిన్నారి కోసం పోలీసులు గాలించగా.. ఉదయం నరసింహ స్వామి ఆలయం వద్ద చెట్ల పొదల్లో చిన్నారి మృతదేహం లభించింది. వెంటనే పాప మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే చిన్నారి లక్షితను చిరుత చంపేసిందని ఒకసారి.. కాదు ఎలుగబంటి చంపేసిందని మరోసారి వార్తలు వచ్చాయి. అయితే పాపపై దాడి చేసింది చిరుత పులేనని పోస్టుమార్టంలో స్పష్టమైంది. ఎస్వీ మెడికల్ కాలేజీ ఫోరెన్సిక్ విభాగం లక్షితను చంపేసింది చిరుతేనని తేల్చింది. రాత్రి చంపి శరీరంలోని భాగాలను చిరుత తిని వెళ్లిపోయిందని పోస్టుమార్టంలో తేలింది. ఆ తర్వాత రాత్రంతా ఉన్న శవాన్ని మరేదైనా జంతువు తిని ఉండొచ్చని ఫోరెన్సిక్ నిపుణులు భావిస్తున్నారు. పాప ప్రాణం పోవడానికి మాత్రం చిరుతే కారణమని స్పష్టం చేశారు. పోస్ట్ మార్టం పూర్తి కావడంతో పాపను తల్లిదండ్రులు స్వగ్రామం తీసుకెళ్లిపోయారు.