Kuppam: ఊళ్లో చావు. నలుగురూ సాయం పట్టారు. పాడె పైకి లేచింది. శ్మశానం దాకా సాగింది. ఇంతలోనే..

ABN , First Publish Date - 2023-06-17T11:12:10+05:30 IST

ఊళ్లో చావు. నలుగురూ సాయం పట్టారు. పాడె పైకి లేచింది. శ్మశానం దాకా సాగింది. వేలాడుతున్న విద్యుత్తు తీగలు మృత్యుపాశాలయ్యాయి. పాడెమోసిన నలుగురిలో ముగ్గురు శవాలుగా మారి గ్రామానికి చేరారు. ఈ విషాద ఘటనతో ఊరు శోకసంద్రమైంది.

Kuppam: ఊళ్లో చావు. నలుగురూ సాయం పట్టారు. పాడె పైకి లేచింది. శ్మశానం దాకా సాగింది. ఇంతలోనే..

ముగ్గురి ప్రాణాలు తీసిన విద్యుత్తు తీగలు

శోకసంద్రమైన తంబిగానిపల్లె

ఊళ్లో చావు. నలుగురూ సాయం పట్టారు. పాడె పైకి లేచింది. శ్మశానం దాకా సాగింది. వేలాడుతున్న విద్యుత్తు తీగలు మృత్యుపాశాలయ్యాయి. పాడెమోసిన నలుగురిలో ముగ్గురు శవాలుగా మారి గ్రామానికి చేరారు. ఈ విషాద ఘటనతో ఊరు శోకసంద్రమైంది. ఆత్మీయులను కోల్పోయిన అంతులేని బాధలో శోకాలు తీస్తూనే, అలక్ష్యాన్ని చూపిన విద్యుత్తు అధికారులను శాపనార్థాలు పెడుతోంది.

కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని తంబిగానిపల్లె ఎస్సీ కాలనీ. శుక్రవారం పొద్దుగుంకే వేళ. కాలనీలో ఒక పాడె నలుగురి సాయంతో పైకి లేచింది. ఆ పాడెపై అరవై అయిదేళ్ల రాణెమ్మ శాశ్వత నిద్ర పోతోంది. కొంతదూరం రోడ్డువెంట సాగిన శవయాత్ర, శ్మశానంలోకి ప్రవేశించింది. ఇంతలో గుంపుగా వెంట వస్తున్న వారిలో కొంతమంది ఒక్కసారిగా గట్టిగా అరిచారు. అప్పటికే ఆలస్యమైంది. కిందకు వేలాడుతున్న విద్యుత్తు తీగలు, ఇనుప రేకుతో చేసిన పాడెకు తగిలాయి. విద్యుదాఘాతానికి దాన్ని మోస్తున్న వారిలో ముగ్గురు శవాలుగా మారారు. ఒకరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మృతుల్లో మునెప్ప, రవీంద్ర తంబిగానిపల్లె వాసులే. తిరుపతిరావు మాత్రం రాణెమ్మ అంత్యక్రియలకోసం గుంటూరు నుంచి పిల్లాపాపలతో వచ్చిన వ్యక్తి.

అనాథలైన కుటుంబాలు

మృతులు ముగ్గురివీ కూలి బతుకులే. రెక్కాడితేకానీ, డొక్కాడని సంసారాలే. మునియప్ప కూలిపని చేస్తాడు. భార్య, అయిదేళ్ల కుమార్తెతో గుట్టుగా సంసారం సాగిస్తున్నాడు. రవీంద్ర ప్లంబర్‌ పనిచేసుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నాడు. భార్య, ఒక కూతురు, ఒక కొడుకు. ఇద్దరూ చిన్నపిల్లలే. ఇక గుంటూరునుంచి అంత్యక్రియలకు హాజరైన తిరుపతిరావు కూడా అక్కడే వాచ్‌మెన్‌గా బతుకు పోరు జరుపుతున్నాడు. ఆయనకు భార్య, ఒక పాప. ముగ్గురికి ముగ్గురివీ పేద కుటుంబాలు. వీళ్లే జీవనాధారం ఆ కుటుంబాలకు. ఇప్పుడు ఉన్నట్టుండి లేకుండా పోయారు. చావుకోసం వచ్చి, తామే శవాలుగా మారారు. ఒక్కసారిగా అనాథలుగా మారిన ఆ కుటుంబ సభ్యుల వ్యథ చూడనలవి కాకుండా ఉంది. శత్రువులకు కూడా ఇటువంటి బాధ రాకూడదురా భగవంతుడా అంటూ తంబిగానిపల్లె గ్రామం శోకసంద్రమై కుములుతోంది.

కాగా, సంఘటన జరిగిన వెంటనే శ్మశానంలోనే పాడెపై మృతదేహాన్ని వదిలేసి అందరూ ఆస్పత్రికి పరుగు తీశారు. విషాదంలో మునిగిపోయారు. ముగ్గురు మృతి చెందిన విషాదాన్ని దిగమింగుకుని.. ఆ తర్వాత శ్మశానానికి చేరుకుని రాణెమ్మకు అంత్యక్రియలు పూర్తి చేశారు.

అధికారుల నిర్లక్ష్యమే కారణం

తంబిగానిపల్లె శ్మశానం చాలా చిన్నది. ఇందులో విద్యుత్తు స్తంభాలు, విద్యుత్తు తీగలు సాలెగూళ్లను తలపిస్తుంటాయి. వ్యవసాయ విద్యుత్తు లైన్లతోపాటు, పట్టణ విద్యుత్తు లైన్లు కూడా అల్లిబిల్లిగా అల్లుకుని కనిపిస్తాయి. చేయి కొంచెం పైకెత్తితే అందేటంతగా వేలాడుతుంటాయి. పైగా పాడెను ఇనుప రేకుతో చేసి, అటూఇటూ బురుజులు లాగా ఎత్తుగా ఉండేలా కట్టడం ఇక్కడివారి సంప్రదాయం. దుఃఖంలో ఉన్న బంధుజనం పాడెను శ్మశానంలో మోసుకెళ్లే సమయంలో విద్యుత్తు తీగలు తాకడం గమనించలేదు. అవి శక్తిమంతమైన 11 కేవీ వ్యవసాయ విద్యుత్తు లైన్లు. అంతే.. ఘోరం జరిగిపోయింది. రెస్కో అధికారుల నిర్లక్ష్యం మూడు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. ఇప్పుడా కుటుంబాలు దిక్కులేనివయ్యాయి. ఈ మరణాలు కేవలం రెస్కో అధికారుల అలక్ష్యంతోనే జరిగాయని గ్రామస్థులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదకరంగా ఉన్న విద్యుత్తు లైన్లను తొలగించాలని, అస్తవ్యస్తంగా ఉన్న స్తంభాలను ఒక క్రమ పద్ధతిలో ఏర్పాటు చేయాలని పలుమార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదని వాపోతున్నారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించి, వారిని ఆదుకోవాలని డిమాండు చేస్తున్నారు.

Updated Date - 2023-06-17T11:12:13+05:30 IST