Vinayaka Chavithi: విశాఖలో ఘనంగా వినాయక చవితి వేడుకలు
ABN , First Publish Date - 2023-09-18T19:29:03+05:30 IST
విశాఖలో వినాయక చవితిని ఘనంగా జరుపుకుంటున్నారు. వినాయక చవితిని పురస్కరించుకుని విశాఖలో వివిధ రూపాలలో గల గణనాధులను ఏర్పాటు చేశారు.
విశాఖపట్నం: విశాఖలో వినాయక చవితిని ఘనంగా జరుపుకుంటున్నారు. వినాయక చవితిని పురస్కరించుకుని విశాఖలో వివిధ రూపాలలో గల గణనాధులను ఏర్పాటు చేశారు. గణనాధులన్నీ ఏ విగ్రహానికి ఆ విగ్రహమే అన్నట్టుగా ఉన్నాయి. ఆర్కే బీచ్ నోవోటెల్ సమీపంలో ఏర్పాటు చేసిన చాక్లెట్ వినాయకుడు అందర్ని ఆకట్టుకుంటున్నాడు. వినాయకుడిని చాక్లెట్‌తో చేయడంతో పిల్లలు విగ్రహాన్ని చూడడానికి వచ్చారు. అలాగే రెల్లి వీధిలో జనసేన ఏర్పాటు చేసి ఈవీఎం గణేష్ కూడా అందర్ని ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈవీఎం మిషన్‌లో గ్లాస్ గుర్తుకు గణనాధుడు ఓటు వేస్తున్నట్లు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అంతేకాదు మండపాన్ని కూడా జనసేన పార్టీ గుర్తు, రంగులతో నింపేశారు. ‘నాకు కులం లేదు. మతం లేదు. ప్రాంతం లేదు. నేను భారతీయుడిని’ అనే నినాదాన్ని కూడా ముద్రించారు. అలాగే నగరంలో ఏర్పాటు చేసిన పలు వినాయక విగ్రహాలు కూడా ఆకట్టుకుంటున్నాయి. విశాఖపట్నం దొండపర్తి జంక్షన్ సమీపంలో 108 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని చూడడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు.