పేరుకే పెద్దాసుపత్రి !

ABN , First Publish Date - 2023-10-03T00:12:35+05:30 IST

తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రధాన విభాగాల్లో వైద్యుల కొరత వెంటాడుతుంది. రోగులకు సక్రమంగా సేవలందక ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవానికి జిల్లా ఆసుపత్రిగా అప్‌గ్రేడ్‌ అయ్యాక మరింత ఎక్కువ సేవలు అందుతాయని అంతా భావించారు. కానీ ఉన్న సేవలు కూడా సక్రమంగా అందక పోవడంతో వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు.

పేరుకే  పెద్దాసుపత్రి !

ప్రధాన విభాగాల్లో వైద్యులు ఖాళీ..

రోగులకు అందని సేవలు

తణుకు, అక్టోబరు 2 : తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రధాన విభాగాల్లో వైద్యుల కొరత వెంటాడుతుంది. రోగులకు సక్రమంగా సేవలందక ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవానికి జిల్లా ఆసుపత్రిగా అప్‌గ్రేడ్‌ అయ్యాక మరింత ఎక్కువ సేవలు అందుతాయని అంతా భావించారు. కానీ ఉన్న సేవలు కూడా సక్రమంగా అందక పోవడంతో వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా జనరల్‌ మెడిసిన్‌ విభాగానికి రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. చాలాకాలంగా ఖాళీగా ఉండటంతో ఆసుపత్రికి వివిధ కారణాలతో వచ్చే వారికి వైద్యులు లేకపోవడంతో ఇతర వైద్యులు వద్దకు వెళ్లి చూపించుకుంటున్నారు. జనరల్‌ సర్జన్‌లు ఇద్దరు ఉండాల్సి ఉండగా ఒకరు మాత్రమే ఉన్నారు. మరొకటి ఖాళీగా ఉంది. అలాగే ఆర్థ్టోపెడిక్‌లో రెండు పోస్టులకు ఒకరు మాత్రమే ఉన్నారు. మరొకరు సెలవులో ఉన్నారు.ఇంకా పలు విభాగాల్లో వైద్యులు లేక ఆసుపత్రిలో రోగులకు సక్రమంగా సేవలు అందడం లేదు. ఆసుపత్రిలో పదమూడు రకాల స్పెషలిస్టులతో వైద్యసేవలు అందించాల్సి ఉంది. గైనిక్‌, జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జన్‌, అనస్తీసియా, పిడియాట్రిక్‌, పెథాలజీ, మైక్రోబయాలజీ, ఆర్థోపెడిక్‌, రేడియాలజీ, ఈఎన్‌టీ, ఆఫ్త మాలజీ, డెర్మటాలజీ తదితర విభాగాల్లో వైద్యసేవలు అందించాల్సి ఉంది.

ఇద్దరికి ఒక్కరే సేవలు..

జనరల్‌ మెడిసిన్‌కు సంబందించి ఇద్దరు వైద్యులు ఉండాల్సి ఉండగా ఇద్దరు కూడా చాలాకాలంగా సెలవుపై ఉన్నారు. జనరల్‌ సర్జన్‌లు ఇద్దరికి ఒకరు మాత్రమే ఉన్నారు. పిడియాట్రిక్‌లో ఇద్దరుకు ఒకరు మాత్రమే ఉన్నారు. ఆర్థోపెడిక్‌ విభాగంలో కూడా ఇద్దరుకు ఒకరే ఉన్నారు. ఇంకా ఫోరెన్సిక్‌, రేడియాలజీ, ఈఎన్‌టీ ఆఫ్తాలమాలజీలకు సంబందించి ఖాళీగా ఉన్నాయి. సాధారణ స్కానింగ్‌లు మాత్రమే ఆసు పత్రిలో తీస్తున్నారు. గర్భిణుకులు బయటకు స్కానింగ్‌ సెంటర్ల వద్ద తీయించుకుంటున్నారు. కార్యాలయంలో పనిచేసే అడ్మినిస్ర్టేటివ్‌ అధికారి, జూనియర్‌ అసిస్టెంట్‌, సూపరింటెండెంట్‌ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి.

రోజూ 500 వందల వరకు ఓపీ

ఆసుపత్రికి రోగులు తాకిడి ఎక్కువుగానే ఉంటుంది. గతం నుంచి కూడా తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి పొరుగు జిల్లాల నుంచి కూడా వచ్చి వైద్యం చేయించుకుంటారు. ప్రస్తుతం జిల్లా ఆసుపత్రి కావడంతో మరింత ఎక్కువ మంది వచ్చే అవకాశాలు ఉంటాయి. రోజూ 500 వందల మంది వరకు రోగులు వైద్యం కోసం ఆసుపత్రికి వస్తున్నట్టు అంచనా. రెండు వందలు వరకు ఇన్‌పేషెంట్లు ఉంటారు.

దీనిపై ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ అరుణను వివరణ కోరగా ఖాళీగా ఉన్న పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. ఒకటి రెండు రోజుల్లో ఆసుపత్రిలో చేరతారు. ఇప్పటికే ప్రభుత్వం నియామక ఉత్తర్వులు జారీ చేసింది. ఆసుపత్రిలో రోగులకు ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

Updated Date - 2023-10-03T00:12:35+05:30 IST