ఏపీలో ఏం జరుగుతోంది?
ABN , First Publish Date - 2023-12-07T04:16:51+05:30 IST
రాష్ట్రవ్యాప్తంగా ముసాయిదా ఓటర్ల జాబితాలో అవకతవకలు, అక్రమాలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది.

ఓటర్ల జాబితాలో అక్రమాలపై సీఈసీ సీరియస్
21న రాష్ట్రానికి కేంద్ర ఎన్నికల బృందం రాక
రెండు రోజులపాటు జిల్లాల్లో ఆకస్మిక తనిఖీలు
గంపగుత్తగా ఫాం-7 దరఖాస్తులపై విచారణ
దొంగ ఓట్లు, అర్హుల ఓట్ల తొలగింపు పరిశీలన
(అమరావతి/న్యూఢిల్లీ-ఆంధ్రజ్యోతి)
రాష్ట్రవ్యాప్తంగా ముసాయిదా ఓటర్ల జాబితాలో అవకతవకలు, అక్రమాలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. అర్హుల పేర్లు జాబితా నుంచి తొలగించడంతో పాటు పెద్దసంఖ్యలో అనర్హులను చేర్చారంటూ విపక్షాలు చేసిన ఫిర్యాదులపై సీరియ్‌సగా దృష్టి సారించింది. ఈ మొత్తం వ్యవహారంపై పరిశీలన నిమిత్తం 21న ఢిల్లీ నుంచి కేంద్ర ఎన్నికల అధికారుల బృందం రాష్ట్రానికి రానుంది. ఇద్దరు సీనియర్ డిప్యూటీ కమిషనర్లు, ఇద్దరు డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారులు ఈ బృందంలో ఉంటారు. 21న విజయవాడలో వీరికి బస ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించినట్లు తెలిసింది. ఈ పర్యటన సందర్భంగా తుది ఓటర్ల జాబితా-2024, ఎన్నికల ఏర్పాట్లపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వారు సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయి. తమకు వచ్చిన ఫిర్యాదులపై జిల్లాల్లో ఆకస్మిక తనిఖీలు కూడా చేపట్టే అవకాశం ఉందని సమాచారం. ఎన్నికల ప్రక్రియతో సంబంధం ఉన్న వివిధ శాఖల ఉన్నతాధికారులతోనూ భేటీ అవుతారని చెబుతున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఫిర్యాదుల స్వీకరణతో పాటు వివిధ రాజకీయ పక్షాలతోనూ అధికారులు భేటీ కానున్నారు. 23వ తేదీ సాయంత్రం ఈ బృందం ఢిల్లీకి తిరిగి వెళ్లనున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా, రాష్ట్రానికి వచ్చిన తర్వాత కేంద్ర పరిశీలకులు ఎక్కడికి వెళతారో రాష్ట్ర ఎన్నికల అధికారులకు కూడా సమాచారం ఇవ్వలేదని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఏయే జిల్లాలకు విమాన సర్వీసులు ఉన్నాయో వివరాలు సేకరించినట్లు సమాచారం. తమకోసం మంచి కండిషన్‌లో ఉన్న వాహనాలు సిద్ధం చేయాలని, లైజనింగ్ అధికారులను అందుబాటులో ఉంచాలని ఆదేశించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. జనవరి 5న తుది ఓటర్ల జాబితా-2024 విడుదల చేయాల్సి ఉండటంతో ముసాయిదా జాబితాలోని తప్పులు ఏ విధంగా సరిచేశారు, తుది జాబితాల్లో తప్పులు లేకుండా ఎలాంటి చర్యలు తీసుకుని చేర్పులు, తొలగింపులు చేశారనే అంశాలపై పరిశీలన చేసే అవకాశం ఉంది. జాబితాల్లో అక్రమాలకు కారకులైన అధికారులపై తీసుకున్న చర్యల గురించి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖే్‌షకుమార్ మీనాను కేంద్ర బృందం అడిగి తెలుసుకోనుంది. రాష్ట్ర పర్యటన సమయంలో సీఈసీ అధికారులు జిల్లాల్లో ఆకస్మిక తనిఖీలకు వెళ్లే అవకాశం ఉంది. ఓటర్ల జాబితాల్లో చోటు చేసుకున్న అవకతవకలను పరిశీలించి చర్యలకు సిఫారసు చేయనున్నారు. ఈ అంశంపై 8మంది కలెక్టర్లు, సుమారు 30 మంది ఈఆర్‌వోలపైనా కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ ఆధారాలతో సహా ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుల ఆధారంగానే ఓటరు జాబితాలను పరిశీలిస్తారో లేక ఆకస్మికంగా జిల్లాల్లో పర్యటిస్తారో స్పష్టత లేదు. పరిశీలనకు వచ్చిన అధికారులు అవకతవకలపై పరిశీలన జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఈసీకి టీడీపీ పదేపదే ఫిర్యాదులు
ఓటర్ల జాబితాలో అర్హుల తొలగింపు, భారీగా అనర్హుల చేర్పుల విషయంలో వైసీపీ అక్రమాలపై ప్రతిపక్ష టీడీపీ చేసిన పోరాటం కొంత మేర ఫలించింది. ముసాయిదా ఓటర్ల జాబితాల్లో చోటు చేసుకున్న అక్రమాలు, వలంటీర్లను వినియోగించి టీడీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపు, గంపగుత్తగా ఫాం-7 దరఖాస్తులతో ఓట్లను తొలగించడంపై సీఈవో, ఢిల్లీలోని ఎన్నికల అధికారులకు టీడీపీ ఆధారాలతో సహా పలు ఫిర్యాదులు చేసింది. గతంలో రాష్ట్రంలో పర్యటించినప్పుడు ఓటర్ల జాబితాల్లో అవకతవకలపై కేంద్ర అధికారులు తీవ్ర హెచ్చరికలు చేశారు. అయినా పలువురు కింది స్థాయి అధికారులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తుండటంతో గతంలో ఉన్న తప్పులే జాబితాల్లో కొనసాగుతున్నాయి. దీన్ని ఎన్నికల సంఘం సీరియ్‌సగా తీసుకున్నట్లు తెలిసింది. ఫాం-7 దుర్వినియోగం, మృతుల ఓట్లు జాబితాల్లో ఉండటం, ప్రతిపక్ష పార్టీల సానుభూతిపరులకు అధికసంఖ్యలో నోటీసులు పంపడం తదితరాలపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓటర్ల జాబితాల్లో అక్రమాలపై టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఢిల్లీ వెళ్లి ఫిర్యాదు చేయనున్నారు. కాగా, కేంద్ర ఎన్నికల బృందం రాష్ట్రానికి రానుండటంతో అధికార వైసీపీతో పాటు నిబంధనలకు విరుద్ధంగా అధికార పార్టీకి కొమ్ముకాసి ఓటర్ల జాబితాల్లో అవకతవకలకు, అక్రమాలకు పాల్పడిన అధికారుల్లో గుబులు మొదలైంది. అధికారాన్ని అడ్డంపెట్టుకుని, కింది స్థాయిలో అధికారులతో చేయించిన అక్రమాలు, అర్హుల ఓట్ల తొలగింపునకు బల్క్‌గా ఫాం-7 దరఖాస్తులు పెట్టించడం వంటివి వెలుగులోకి వస్తాయేమోనని వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు.