Vundavalli Sridevi: ఎమ్మెల్యే శ్రీదేవి ఆఫీస్‌పై దాడిచేసిన వైసీపీ శ్రేణులు
ABN , First Publish Date - 2023-03-24T18:43:33+05:30 IST
వైసీపీ కార్యకర్తలు బరి తెగించారు. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి (MLA Sridevi) ఆఫీస్‌పై దాడికి తెగబడ్డారు. ఆఫీస్ ముందు ఉన్న ఫ్లెక్సీలు, బ్యానర్లు చించివేశారు.
గుంటూరు: వైసీపీ కార్యకర్తలు బరి తెగించారు. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి (MLA Sridevi) ఆఫీస్‌పై దాడికి తెగబడ్డారు. ఆఫీస్ ముందు ఉన్న ఫ్లెక్సీలు, బ్యానర్లు చించివేశారు. దీంతో శ్రీదేవి ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి (Anam Ramanarayana Reddy), కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌తో పాటు తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారని వైసీపీ నేతలు ఆరోపించారు. ఈ ఆరోపణలు బలపర్చుతూ ఈ నలుగురిపై వైసీపీ అధిష్టానం సస్పెన్షన్ వేటు వేసింది. నలుగురు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్టు గుర్తించామని, క్రాస్ ఓటింగ్‌పై అంతర్గతంగా దర్యాప్తు చేశామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) తెలిపారు. సజ్జల ప్రకటన వెలువడిన వెంటనే శ్రీదేవి కార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడికి దిగడం గమనార్హం.
నేను క్రాస్ ఓటింగ్ చేయలేదు
‘నేను క్రాస్ ఓటింగ్ (Cross Voting) చేయలేదు. క్రాస్ ఓటింగ్ చేయాల్సిన అవసరమే నాకు లేదు. నాపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవమే. పార్టీ ఇచ్చిన కోడ్ ప్రకారమే నేను ఓటు వేశాను. ఉదయమే నా కుమార్తెతో పాటు సీఎం జగన్ గారిని కలిశాను. సొంత అన్నలా చూసుకుంటానని నాతో జగన్ చెప్పారు. జగన్ నుంచి నాకు స్పష్టమైన హామీ వచ్చింది. క్రాస్ ఓటింగ్ చేసిందెరో రెండ్రోజుల్లో నిజా నిజాలు బయటికొస్తాయి. మాకు కొన్ని విలువలు ఉన్నాయి. విలువలతో కూడిన రాజకీయాలకు కట్టుబడి ఉన్నాం. దళిత మహిళపై దుష్ప్రచారం చేయొద్దు. దళిత మహిళను కాబట్టే ఇలా చులకనగా చూస్తున్నారు. నేను అధిష్ఠానంపై అసంతృప్తిగా ఉంటే నియోజకవర్గానికి ఇంచార్జ్‌ని పెట్టినప్పుడే రాజీనామా చేయాలి. నేను సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చాను. ఆ 22 మందిని స్క్రూటిని చేసి నిజాన్ని తేల్చండి. మళ్లీ చెబుతున్నాను.. నాకు క్రాస్ ఓటింగ్ చేయాల్సిన అవసరమే లేదు. ఇందులో నా పేరును దయచేసి లాగొద్దు’ అని శ్రీదేవి చెప్పుకొచ్చారు.
ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై వైసీపీ ఎప్పుడో ఆశలు వదులుకుంది. మిగిలిన ఓట్లన్నీ పడతాయనే అంచనాతోనే ఏడు స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. కానీ వారిలో మరో ఇద్దరు ‘క్రాస్’ ఓటింగ్ చేసేశారు. నికరంగా తమకు మిగిలిన 19 మందితోపాటు వైసీపీలోని అసంతృప్త ఎమ్మెల్యేలు ఇద్దరు తమకే ఓటేస్తారని టీడీపీ భావించింది. 21 ఓట్లు గ్యారెంటీగా పడే అవకాశముందని పోటీకి దిగింది. వైసీపీలోని అసంతృప్త ఎమ్మెల్యేల్లో మరొక్కరు ఓటు వేస్తే గెలుపు ఖాయమని అంచనా వేసింది. కానీ అనూహ్యంగా రెండు అదనపు ఓట్లు పడ్డాయి. దీంతో ‘ఆ ఇద్దరు ఎవరు?’ అనే దిశగా సర్వత్రా చర్చ జరుగుతోంది. కొంతకాలంగా వైసీపీ అధిష్ఠానంపై గుర్రుగా ఉన్న ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డితోపాటు తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పేరునూ వైసీపీ నేతలు ప్రచారంలోకి తెచ్చారు. ఇప్పుడు నలుగురు స్వంత పార్టీ ఎమ్మెల్యేలపై సస్సెషన్ వేటు వేశారు.