Reliance Jio: జియో నుంచి చౌక ధరకే ల్యాప్‌టాప్.. కేవలం రూ.15 వేలు ఉంటే చాలు..
ABN , First Publish Date - 2023-11-21T08:38:54+05:30 IST
వినియోగదారుల కోసం చౌక ధరకే రిలయన్స్ జియో మరో కొత్త ల్యాప్‌టాప్‌ను తీసుకురాబోతుంది. కేవలం రూ.15 వేలతో జియో క్లౌడ్ పేరుతో ల్యాప్‌టాప్ మార్కెట్‌లోకి రానుంది. ప్రస్తుతం ఈ ల్యాప్‌టాప్‌నకు సంబంధించిన ట్రయల్స్ ముమ్మరంగా జరుగుతున్నాయి.
వినియోగదారుల కోసం చౌక ధరకే రిలయన్స్ జియో మరో కొత్త ల్యాప్‌టాప్‌ను తీసుకురాబోతుంది. కేవలం రూ.15 వేలతో జియో క్లౌడ్ పేరుతో ల్యాప్‌టాప్ మార్కెట్‌లోకి రానుంది. ప్రస్తుతం ఈ ల్యాప్‌టాప్‌నకు సంబంధించిన ట్రయల్స్ ముమ్మరంగా జరుగుతున్నాయి. జియో నుంచి రాబోతున్న రెండో ల్యాప్‌టాప్ ఇది. గత జూలైలోనే జియోబుక్ పేరుతో కేవలం రూ.16,400 ధరతో ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం రాబోతున్న జియో క్లౌడ్ ల్యాప్‌టాప్ ధర అంతకన్నా తక్కువ కావడం గమనార్హం. సాధారణంగా ఒక ల్యాప్‌టాప్ ధరను అందులోని స్టోరేజ్, ప్రాసెసర్, చిప్‌సెట్, బ్యాటరీతోపాటు ఇతర హార్డ్‌వర్ భాగాల ఆధారంగా నిర్ణయిస్తారని కంపెనీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. వాటి ధర పెరిగితే ల్యాప్‌టాప్ ధర కూడా పెరుగుతుందని, అందుకే ఈ ఖర్చును తగ్గించేందుకు జియో క్లౌడ్ పీసీని తీసుకొస్తున్నట్టు తెలిపారు. జియో క్లౌడ్ పీసీలో సిస్టమ్ ప్రాసెసింగ్ మొత్తం అందులోనే జరుగుతుందని, దీంతో వినియోగదారులకు తక్కువ ధరకే ల్యాప్‌టాప్ లభిస్తుందని అని సదరు అధికారి చెప్పుకొచ్చారు.
కాగా ల్యాప్‌టాప్‌ను తక్కువ ధరకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రస్తుతం జియో యాజమాన్యం దేశంలోని ప్రముఖ ల్యాప్‌టాప్ కంపెనీలైన ఏసర్(Acer), హెచ్‌పీ(HP), లెనోవో (Lenovo) తో చర్చలు జరుపుతోంది. ఈ ల్యాప్‌టాప్ మరి కొద్ది నెలల్లోనే మార్కెట్‌లోకి రానుందని తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్‌లో మంచి ల్యాప్‌టాప్‌ల కోసం దాదాపు రూ.50,000కు ఖర్చు చేయాల్సి ఉంటుందని జియో కంపెనీ ఉన్నతాధికారి ఒకరు అన్నారు. ప్రస్తుతం జియో క్లౌడ్ ల్యాప్‌టాప్‌నకు సంబంధించిన ట్రయల్స్ హెచ్‌పీ క్రోమ్ బుక్ ద్వారా చేస్తున్నారు. మరోవైపు జియో క్లౌడ్ పీసీ కోసం కంపెనీ నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లను సిద్ధం చేస్తోంది. వినియోగదారులు అదనంగా ల్యాప్‌టాప్ వద్దనుకుంటే, జియో క్లౌడ్ పీసీ సాఫ్ట్‌వేర్‌ను తమ కంప్యూటర్, స్మార్ట్‌టీవీల్లో ఇన్‌స్టాల్ చేసుకుని కంప్యూటింగ్ సర్వీస్‌ను వినియోగించుకోవచ్చు. ఈ సబ్‌స్క్రిప్షన్‌లో భాగంగానే అదనంగా కంపెనీ మరిన్ని ఫీచర్లను తీసుకురానుంది. అయితే వాటిని మరింత అదనపు ధరకు కొనుగోలు చేయాల్సి ఉంటుంది.