ఉత్తరాంధ్రపై ధర్మాన ఒట్టిమాటలు

ABN , First Publish Date - 2023-01-13T00:53:10+05:30 IST

ఉత్తరాంధ్ర మరోసారి చర్చనీయాంశమైంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు రాష్ట్ర రాజధాని విశాఖకు...

ఉత్తరాంధ్రపై ధర్మాన ఒట్టిమాటలు

ఉత్తరాంధ్ర మరోసారి చర్చనీయాంశమైంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు రాష్ట్ర రాజధాని విశాఖకు రాకపోతే, విశాఖ రాజధానిగా ప్రత్యేక రాష్ట్రం ఉత్తరాంధ్ర ప్రజలు ఏర్పాటు చేసుకుంటారని తెగేసి చెప్పారు. ఆయన ఇలా చెప్పడం మొదటి సారేమీ కాదు. ఇటీవల అనేక పర్యాయాలు ఆయన ఇదే మాటను పదేపదే వల్లెవేస్తున్నారు.

ఇక్కడ మూడు సందేహాలు కలుగుతున్నాయి. పార్టీ అధిష్ఠానం సమ్మతి లేకుండా ఆయన ఇలాంటి ప్రకటనలు చేస్తారా అన్నది ఒకటైతే, రెండోది ఆయనకు నిజంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి పట్ల అంత ఆరాటం ఉందా అన్నది, ఇక మూడోది ఉత్తరాంధ్ర ప్రజలు వేరే రాష్ట్రం కోరుకుంటున్నారా అనేది.

ఆయన ప్రత్యేక రాష్ట్రం ప్రకటన ఒకసారి చేసి ఉంటే, ఏదో ఆవేశంలో అన్నారులే అనుకోవచ్చు. కానీ ఒకసారి, రెండుసార్లు కాదు, అనేక సార్లు ఈయన ఇదే ప్రకటన చేస్తూ వస్తున్నారు. వారి సహచరుల నుంచి గానీ, అధిష్ఠానం నుంచి గానీ, దీనిపై ఎలాంటి స్పందన లేదు. దీనర్థం వారి సమ్మతితోనే ఈయన ఈ ప్రకటనలు చేస్తున్నారా? లేక వారే కావాలని ఈయనతో చేయిస్తున్నారా? వీటిలో ఏదో ఒకటి అయి ఉంటుందని సాధారణంగా ఆలోచించేవారెవరికైనా అర్థమవుతుంది. అదే అయితే, రాష్ట్రంలో మరో వేర్పాటువాదాన్ని అధికార పార్టీయే ప్రోత్సహిస్తోందని భావించవలసి వస్తుంది. ఇప్పుడు ఎందుకిలా చేస్తోందనేది చర్చనీయాంశం.

తాజాగా ఆయన శ్రీకాకుళం జిల్లాలో ఒక రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ శ్రీకాకుళం చుట్టూ సముద్రం ఉంది, ఇక్కడ ఫిషింగ్‌ హార్బరు లేదు, జెట్టీ లేదు... ప్రాజెక్టులు పూర్తి కాలేదు. గ్రామాల్లో తాగు నీరు లేదు. మేమెలా ఉండాలి అని ప్రశ్నించారు. నిజంగా ఈ అంశాలు లేవనెత్తడం అభినందనీయమే. అనేక ఇతర సమస్యలతో పాటు, ఇవి కూడా శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి ఇతోధికంగా అవసరమైనవే. అయితే, అవన్నీ ఎందుకు లేవో, ఎవరు సమాధానం చెప్పాలి? ఎవరు బాధ్యత వహించాలి? అధికారంలో ఉన్నవారే కదా! అంటే వీరి ప్రభుత్వమే, అందులో మంత్రిగా ఉన్న వీరే సమాధానం చెప్పాలి. అందులోనూ ఈయన ఐదు సార్లు ఎమ్మెల్యే అవడమే కాక, ఐదు సార్లు మంత్రిగా కూడా చేశారు. తన పదవీకాలంలో ఉత్తరాంధ్రకు కాకపోయినా, కనీసం వీరి జిల్లాకైనా ఏమైనా మంచి చేశారా? సమాధానం చెప్పవలసిన వారే ప్రశ్నించడం అతి తెలివనుకోవాలా? ప్రజలు గ్రహించరనే తెలివితక్కువ తనమనుకోవాలా?

ధర్మాన చెప్పినట్లు శ్రీకాకుళం జిల్లాకు రాష్ట్రంలోనే అత్యధికంగా 193 కిలోమీటర్ల సుదూర తీర ప్రాంతముంది. అపార మత్స్యసంపద ఉత్పత్తయ్యే భావనపాడు వద్ద ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మించమని ఎప్పటినుంచో అక్కడి మత్స్యకారుల డిమాండు చేస్తున్నారు. సర్వం సిద్ధంగా ఉన్నా, మూడేళ్లు దాటినా వీరి ప్రభుత్వం ఎందుకు దీనిని పూర్తి చేయలేదు? ఎవరు అడ్డుపడ్డారు? ఇంకా విచిత్రమేమిటంటే, రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి ఇదే జిల్లాకు చెందినవారైనా ఎందుకీ స్థితి నెలకొంది? వీరికి అదే ప్రదేశంలో కార్పొరేట్‌ కంపెనీ నిర్మించబోయే పోర్టు మీద, ఆ పేరున బలవంతపు భూసేకరణ మీద ఉన్న శ్రద్ధ ఇక్కడి మత్స్యకారులపై లేకపోవడం తప్ప, దీనికి సమాధానం ఇంకేమీ దొరకదు.

ప్రాజెక్టులు పూర్తి కాలేదని, తాగు నీరు కూడా లేదని ధర్మాన చెప్పింది కూడా వాస్తవమే. అయితే దీనికి కారణమెవరు? ఉత్తరాంధ్రలో అతి పెద్ద నది అయిన వంశధారపై రెండో దశ నిర్మాణం ఎందుకు పూర్తి కాలేదు? ఈ మూడేళ్లలోనైనా చేసిందేమైనా ఉందా? మహేంద్రతనయ నదిపై నిర్మించే ఆఫ్‌ షోర్‌ ప్రాజెక్టుకు నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి 2007లోనే ఆమోదం తెలుపుతూ జీవో జారీ చేశారు. శంకుస్థాపన కూడా చేశారు. పుష్కరకాలం దాటినా ఇప్పటికీ అక్కడ ఆ పునాదిరాయి తప్ప పనులేమీ జరగ లేదు. కాకతాళీయంగా అప్పుడూ, ఇప్పుడూ కూడా ఈయనే రాష్ట్ర రెవిన్యూ మంత్రి. మరి దీన్ని పూర్తి చేయడానికి ఈయనేం చేసినట్లు? ఈయన చేస్తుంటే అడ్డుకున్నదెవరు?

వాస్తవంగా వీరు ఈ ప్రాంత అభివృద్ధికి చేసిందేమీ లేదు కానీ, పాల్పడిన వినాశమే ఎక్కువ. సముద్ర తీరాన్ని మొత్తం కాలుష్యకారక పరిశ్రమలతో కలుషితం చేసేస్తున్నారు. భూగర్భజలాలు కూడా కలుషితమై తాగడానికి నీరు లేక కొన్ని గ్రామాల్లో ప్రజలు తమను తరలించండని గోల పెడుతున్నారు. ఇది చాలదన్నట్లు దేశమంతా తిరస్కరించిన, ప్రమాదకరమైన కొవ్వాడ అణు విద్యుత్‌ ప్లాంటును ఉత్తరాంధ్ర నెత్తిన రుద్దుతున్నారు. అది కూడా ఈయన జిల్లాలోనే. ఈ ప్రాంత అభివృద్ధిపై అంత ప్రేమున్న ఈయన ఈ కాలుష్యాన్నుంచి ఉత్తరాంధ్రను కాపాడవచ్చు కదా! ఎవరు కాదన్నారు?

కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్టాన్ని అమలు చేయకుండా తీరని ద్రోహం చేస్తోంది. ప్రత్యేక హోదాకు ఎగనామం పెట్టింది. హక్కుగా రావలసిన ఉత్తరాంధ్ర, రాయలసీమలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ఇవ్వలేదు. పదేళ్లయినా ఇంకా విద్యాసంస్థల నిర్మాణం పూర్తి చేయలేదు. గిరిజన యూనివర్సిటీ నిర్మాణమే ప్రారంభం కాలేదు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ ఇవ్వలేదు సరికదా, ఉన్న రైల్వే డివిజన్‌నే ఎత్తేయాలని నిర్ణయించింది. విశాఖ మెట్రో రైల్‌ మాటే మరిచింది. వీటిపై ఎప్పుడైనా వీరి ప్రభుత్వం కానీ, వీరు కానీ కనీసం నోరు విప్పారా? తెలుగు ప్రజలు ప్రాణత్యాగాలతో నిర్మించుకున్న విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటును కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా అమ్మేయాలని నిర్ణయిస్తే, దాన్ని వ్యతిరేకించాల్సిన వీరి ప్రభుత్వం ఎందుకు గట్టిగా కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తేవడం లేదు? దీనికి మించి ఈయన నిస్సిగ్గుగా కేంద్ర నిర్ణయాన్ని సమర్ధించడం ఆ ద్రోహంలో భాగం పంచుకోవడం కాదా?

వాస్తవంగా ఉత్తరాంధ్ర ప్రజలు సౌమ్యులు. ఈయనే అదే సభలో చెప్పినట్లు, కోటి రూపాయల రోడ్డెస్తేనే మురిసిపోయేంత అల్ప సంతోషులు. అందుకే ఉత్తరాంధ్ర ప్రజలు గొంతెమ్మ కొర్కెలేమీ నేడు కోరడం లేదు. విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకం ఆపాలని కోరుతున్నారు. పెండింగు నీటి ప్రాజెక్టులన్నీ పూర్తి కావాలని కోరుకుంటున్నారు. అభివృద్ధిని కోరుకుంటున్నారు. కానీ నిస్సందేహంగా ప్రత్యేక రాష్ట్రాన్ని మాత్రం కోరుకోవడం లేదు. ఉత్తరాంధ్ర ప్రజలు ఐక్యతను కోరుకుంటున్నారు. విభేదాలను కాదు. అందుకని వీరు, వీరి ప్రభుత్వం చేతనైతే ప్రజలు కోరుకునేవి చేయాలి. లేకపోతే మానేయాలి. అంతే కానీ, ప్రాంతాలు, ప్రజల మధ్య చిచ్చు మాత్రం పెట్టకండి. వేర్పాటువాదాలకు తెరలేపకండి.

ఎ. అజ శర్మ

ప్రధాన కార్యదర్శి, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక

Updated Date - 2023-01-13T00:53:12+05:30 IST