Italy : ఇంగ్లిష్ మాట్లాడితే రూ.89 లక్షలు జరిమానా!
ABN , First Publish Date - 2023-04-02T11:32:38+05:30 IST
ఇటలీ ప్రధాన మంత్రి గియోర్జియా మెలనీ (Italian Prime Minister Giorgia Meloni) నేతృత్వంలోని బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీ ఇటాలియన్
న్యూఢిల్లీ : ఇటలీ ప్రధాన మంత్రి గియోర్జియా మెలనీ (Italian Prime Minister Giorgia Meloni) నేతృత్వంలోని బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీ ఇటాలియన్ భాషను పరిరక్షించేందుకు కృషి చేయాలని నిర్ణయించుకుంది. ఇంగ్లిష్ (English) వంటి విదేశీ భాషలను ఉపయోగించే వ్యక్తులు, సంస్థలకు భారీ జరిమానాలు విధించేందుకు అవకాశం కల్పించే చట్టాన్ని చేయాలని ప్రతిపాదించింది. నిబంధనలను ఉల్లంఘిస్తే 1 లక్ష యూరోల వరకు జరిమానా విధించాలని ప్రతిపాదించింది. దీనికి సంబంధించిన ముసాయిదా బిల్లును సిద్ధం చేసింది.
ఇటలీలో విదేశీ భాషల వాడకం పెరుగుతుండటం వల్ల తమ సాంస్కృతిక గుర్తింపు తీవ్రంగా దెబ్బతింటోందని, దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం జరుగుతోందని ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీ ఇటాలియన్ భాషను పరిరక్షించేందుకు ఓ ముసాయిదా బిల్లును రూపొందించింది. విదేశీ భాషలను, మరీ ముఖ్యంగా ఇంగ్లిష్ భాషను అధికారిక ఉత్తర, ప్రత్యుత్తరాల్లో వినియోగించే వ్యక్తులు, సంస్థలకు 1 లక్ష యూరోలు (సుమారు రూ.89.3 లక్షలు) జరిమానా విధించేందుకు తగిన నిబంధనలను ప్రతిపాదించింది. ఇంగ్లిష్ వ్యాప్తి విపరీతంగా జరుగుతుండటం వల్ల ఇటాలియన్ భాష యొక్క ఔన్నత్యానికి విఘాతం జరుగుతోందని, అది మృత భాషగా మిగిలిపోయే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. దీనివల్ల యావత్తు సమాజానికి ప్రతికూల పర్యవసానాలు ఎదురవుతాయని తెలిపింది. ఇటాలియన్ భాషను పరిరక్షించాలని, పెంచి పోషించాలని తెలిపింది. ఇది కేవలం ఫ్యాషన్‌కు సంబంధించిన విషయం మాత్రమే కాదని, ఫ్యాషన్లు వస్తూ, పోతూ ఉంటాయని చెప్పింది. మితిమీరి ఇంగ్లిష్‌ను వాడే ఆంగ్లోమేనియా వల్ల సమాజంపై దీర్ఘకాలిక ప్రభావం ఉంటుందని చెప్పింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు తమ వస్తువులు, సేవలను ప్రమోట్ చేసుకోవడం కోసం ఇటాలియన్ భాషనే వాడాలని ప్రతిపాదించింది. ఈ బిల్లును ఇటలీ పార్లమెంటు ఆమోదించవలసి ఉంది.
ఇటలీలో కార్యకలాపాలు నిర్వహించే కంపెనీల జాబ్ టైటిల్స్ కచ్చితంగా ఇటాలియన్‌లోనే ఉండాలని ఈ బిల్లు ప్రతిపాదించింది. అనువదించడానికి వీలు కానపుడు మాత్రమే విదేశీ భాషా పదాలను వాడవచ్చునని తెలిపింది. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగినందువల్ల యూరోపు దేశాల్లో ఇంగ్లిష్‌ను విస్తృతంగా వాడటం ప్రతికూల ఫలితాలనిస్తుందని తెలిపింది.
ఇదిలావుండగా, ఈ బిల్లును కొందరు విమర్శిస్తున్నారు. విదేశీ భాషలపై నిషేధం విదించడం వల్ల అంతర్జాతీయంగా ఇటలీ పేరు, ప్రతిష్ఠలు, పోటీతత్వం దెబ్బతింటాయని చెప్తున్నారు. విదేశీ పదాలను గంపగుత్తగా నిషేధిస్తే, భాషాపరమైన ఒంటరితనానికి దారితీస్తుందని, అంతర్జాతీయ సమాజంతో సంబంధాలు పెట్టుకునే సామర్థ్యం దెబ్బతింటుందని ఆరోపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
Modi Vs Sibal : మోదీ ‘సుపారీ’ ఆరోపణలపై కపిల్ సిబల్ అనూహ్య స్పందన
Modi Surname Case : జైలుకెళ్లేందుకు రాహుల్ గాంధీ సిద్ధమేనా?.. కాంగ్రెస్ వర్గాల కీలక సంకేతాలు..