South Korea Marriages: వివాహాలు, జననాల రేటు పెంచేందుకు సౌత్ కొరియా కొత్త ప్రయోగం.. ఇదేదో బాగుందే!

ABN , First Publish Date - 2023-09-02T20:59:58+05:30 IST

ప్రస్తుత పోటీ ప్రపంచంలో యువత పెళ్లిళ్లపై పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఒంటరిగా ఉండటానికి లేదా పిల్లలు కనకుండా సహజీనవం చేయడానికి మాత్రమే ఆసక్తి చూపిస్తున్నారు. అంతే తప్ప..

South Korea Marriages: వివాహాలు, జననాల రేటు పెంచేందుకు సౌత్ కొరియా కొత్త ప్రయోగం.. ఇదేదో బాగుందే!

ప్రస్తుత పోటీ ప్రపంచంలో యువత పెళ్లిళ్లపై పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఒంటరిగా ఉండటానికి లేదా పిల్లలు కనకుండా సహజీనవం చేయడానికి మాత్రమే ఆసక్తి చూపిస్తున్నారు. అంతే తప్ప.. పెళ్లిళ్లంటే మాత్రం ఆమడ దూరం పరిగెడుతున్నారు. ఆర్థిక సమస్యలు, గృహభారం వంటి కారణాల వల్ల.. పెళ్లిళ్లకు ససేమిరా అనేస్తున్నారు. తద్వారా.. వివాహాలతో పాటు జననాల రేటు కూడా గణనీయంగా పడిపోతోంది. ముఖ్యంగా.. విదేశాల్లో ఈ సమస్య అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే.. స్థానిక ప్రభుత్వాలు యువతకు పెళ్లిపై ఆసక్తి కలిగించేలా రకరకాల పథకాలను ప్రవేశపెడుతున్నాయి. ఇప్పుడు సౌత్ కొరియా కూడా అదే బాట పట్టింది.

కొన్ని సంవత్సరాల నుంచి సౌత్ కొరియాలో వివాహాలు, శిశు జననాల రేటు భారీగా పడిపోగా.. వృద్ధ జనాభా విపరీతంగా పెరిగిపోతోంది. ఇందుకు గల కారణాలేంటనే విషయంపై అక్కడి ప్రభుత్వం ఇటీవల ఒక సర్వే నిర్వహించింది. 19 నుంచి 34 ఏళ్లలోపు ఉన్నవారిపై సర్వే నిర్వహించగా.. కేవలం 36.4 శాతం మంది మాత్రమే వివాహం పట్ల సానుకూల దృక్పథం కలిగి ఉన్నట్లు తేలింది. మిగతా వాళ్లు మాత్రం పెళ్లికి విరుద్ధంగా అభిప్రాయాల్ని వ్యక్తపరిచారు. ఆర్థిక ఇబ్బందులు, ఇంటి పనుల ఒత్తిడి, చిన్నారుల సంరక్షణ వంటి సమస్యల్ని వాళ్లు ఉటంకించినట్లు వెల్లడైంది. కొందరేమో.. వివాహంపై ఆసక్తి చూపారు కానీ, పిల్లల్ని కనాల్సిన అవసరం లేదని కుండబద్దలు కొట్టారు. ఈ క్రమంలోనే.. సమస్యకు పరిష్కారంగా ఒక పైలట్ ప్రాజెక్ట్‌ని కొరియా ప్రభుత్వం ప్రకటించింది.


పిల్లల సంరక్షణతో పాటు ఇంటిపనుల ఒత్తిడి తగ్గించడం, వారికి చేదోడు వాదోడుగా ఉండటం కోసం.. విదేశీ సహాయకులను అనుమతించాలని సౌత్ కొరియా ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత సౌత్ కొరియా రాజధాని సియోల్‌లోని ఇళ్లలో పనిచేసేందుకు 100 మందిని అనుమతించింది. ఈ పనితీరుని బట్టి.. డిసెంబర్ నుంచి ఈ ప్రాజెక్ట్‌ని పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. ఇద్దరు సంపాదిస్తున్న జంటలు, సింగిల్ పేరెంట్, ఎక్కువమంది పిల్లలు ఉన్న కుటుంబాలకే ప్రాధాన్యం ఇవ్వనుంది. ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే.. కొరియా ప్రజలు ఫ్యామిలీ ప్లానింగ్‌పై దృష్టి పెడితే, ఇంటి పనులతో పాటు పిల్లల సంరక్షణను విదేశీ సహాయకులు (హౌస్‌కీపర్స్) చూసుకుంటారు. ఈ ప్రాజెక్ట్‌ని సంస్థలకు కూడా విస్తరించాలని వారి ప్లాన్.

అయితే.. ఈ హౌస్‌కీపర్ల విషయంలోనూ సౌత్ కొరియా ప్రభుత్వం కొన్ని కండీషన్స్ పెట్టింది. వీళ్లకు కనీస వయసు 24 సంవత్సరాలు ఉండాలి. నేర చరిత్ర గానీ, మాదక ద్రవ్యాల అలవాటు గానీ ఉండకూడదు. వీళ్లు కొరియా భాష నేర్చుకోవాల్సి ఉంటుంది. కేవలం పని మీద దృష్టి పెట్టాలి. మొదట ఈ ప్రాజెక్ట్‌ని ఆరు నెలల పాటు పర్యవేక్షించనున్నారు. మరి.. ఈ ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చిన తర్వాతైనా అక్కడి యువత పెళ్లిపై ఆసక్తి చూపుతుందా? జననాల రేటు పెరుగుతుందా? ఇందుకు కాలమే సమాధానం చెప్పాలి.

Updated Date - 2023-09-02T20:59:58+05:30 IST