CM Revanth Reddy: ఉగాది పచ్చడిలా తెలంగాణ బడ్జెట్ షడ్రుచుల సమ్మిళితం: సీఎం రేవంత్ రెడ్డి..
ABN , Publish Date - Mar 30 , 2025 | 01:27 PM
ఉగాది సందర్భంగా గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పండగ శుభాకాంక్షలు తెలిపారు. మంత్రివర్గ విస్తరణ ప్రచారం నేపథ్యంలో గవర్నర్‌తో రేవంత్ భేటీ ఆసక్తి రెకెత్తిస్తోంది.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి "ఉగాది పండగ" శుభాకాంక్షలు తెలిపారు. విశ్వావసు నామ సంవత్సరం అందరి జీవితాల్లో సంతోషాలు, వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ఈ ఏడాది ప్రతి ఒక్కరికీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. తెలంగాణ భాషా సాంస్కృతిక, దేవాదాయ ధర్మాదాయ శాఖల ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్రభారతిలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితోపాటు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్, శంకరయ్య, మల్ రెడ్డి రంగారెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. "తెలంగాణలో సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో నడుస్తోంది. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉగాది పచ్చడిలా షడ్రుచుల సమ్మిళితం. వ్యవసాయం అభివృద్ధి, పేద పిల్లలకు విద్య అందిచేందుకు బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యత ఇచ్చాం. విద్య, వైద్య, ఉద్యోగ, ఉపాధి, సంక్షేమం అన్నిటికీ నిధులు కేటాయించాం. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తున్నాం. దేశంలో తెలంగాణ ఓ వెలుగు వెలగాలి.. దేశానికే ఆదర్శంగా నిలవాలి. దేశంలో కొత్త నగరాల నిర్మాణం జరగాలి. అందులో భాగంగానే ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి తెలంగాణ శ్రీకారం చుట్టింది. ఫ్యూచర్ సిటీ పెట్టుబడుల నగరంగా అభివృద్ధి చెందుతుంది.
దేశంలో ఫుడ్ సెక్యూరిటీ యాక్టును తీసుకొచ్చి పేదల ఆకలి దూరం చేసేందుకు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పుడు పేదలకు సన్న బియ్యం అందించే పథకానికి ఉగాది రోజున శ్రీకారం చుడుతున్నాం. దేశంలోనే అత్యధికంగా వరి ఉత్పత్తి చేసిన రాష్ట్రాల్లో తెలంగాణ ముందు వరసలో నిలిచింది. రైతులు పండించిన సన్న ధాన్యాన్ని పేదలకు అందించబోతున్నాం. అలాగే పేదల ఆదాయం పెంచాలనేది మా ప్రభుత్వ విధానం. ఇది రాజకీయాలు చేసే సందర్భం కాదు.. అభివృద్ధి చేసే సందర్భం. మా ఆలోచనలు, సంకల్పంలో స్పష్టత ఉంది. తెలంగాణ రైజింగ్-2050 ప్రణాళికతో దేశానికే తెలంగాణను ఆదర్శంగా నిలబెడతామని" చెప్పారు.
ఈ కార్యక్రమం అనంతరం రాజ్ భవన్‌కు సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. ఉగాది సందర్భంగా గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను మర్యాదపూర్వకంగా కలిసి పండగ శుభాకాంక్షలు తెలిపారు. మంత్రివర్గ విస్తరణ ప్రచారం నేపథ్యంలో గవర్నర్‌తో రేవంత్ భేటీ ఆసక్తి రెకెత్తిస్తోంది. మరోవైపు నేడు సన్న బియ్యం పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం ఉమ్మడి నల్గొండ జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గానికి చేరుకుని, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి జిల్లాకు చెందిన మంత్రి కోమటిరెడ్టి వెంకట్ రెడ్డితోపాటు ఇన్‌ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Indonesia Earthquake: మరో భారీ భూకంపం.. ఇళ్ల నుంచి పరుగులు పెట్టిన ప్రజలు..
Ugadi 2025: సంవత్సరాలకు పేర్లు ఎలా వచ్చాయో తెలుసా.. పురాణాలు ఏం చెబుతున్నాయంటే..
Ugadi Wishes 2025: ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్..