MCD Mayor Election: మేయర్ పీఠం ఆప్‌కే.. డాక్టర్ షెల్లీ ఒబెరాయ్ గెలుపు
ABN , First Publish Date - 2023-02-22T14:42:23+05:30 IST
ఎంసీడీ మేయర్ (MCD mayor)గా ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి డాక్టర్ షెల్లీ ఒబెరాయ్ గెలుపొందారు. షెల్లీ ఒబెరాయ్..
న్యూఢిల్లీ: ఎంసీడీ మేయర్ (MCD mayor)గా ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి డాక్టర్ షెల్లీ ఒబెరాయ్ (Dr.Shelly Oberoi) గెలుపొందారు. షెల్లీ ఒబెరాయ్ తన సమీప బీజేపీ అభ్యర్థి రేఖా గుప్తాపై 34 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. మొత్తం 266 ఓట్లు పోల్ కాగా, షెల్లీ ఒబెరాయ్‌కు 150, రేఖా గుప్తాకు 116 ఓట్లు వచ్చాయి. బుధవారం మధ్యాహ్నం 11.30 గంటలకు ఎంసీడీ సమావేశమైంది. మేయర్, డిప్యూటీ మేయర్, ఆరుగురు స్టాండింగ్ కమిటీ సభ్యులకు ఎన్నిక జరగాల్సి ఉండగా, సభా కార్యక్రమాలకు మూడు సార్లు అవాంతరాలు తలెత్తాయి. అనంతరం కీలకమైన మేయర్ పదవికి ఓటింగ్ జరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎంసీడీ ఎన్నికల పోలింగ్ బుధవారం జరిగింది.
దీనికి ముందు, ఎంసీడీ మేయర్, డిప్యూటీ మేయర్, ఎంసీడీ స్టాడింగ్ కమిటీలోని 18 మంది సభ్యులలో ఆరుగురిని ఎన్నుకునేందుకు ఎంసీడీ ఇటీవల మూడుసార్లు సమావేశమైనప్పటికీ ఎన్నికల ప్రక్రియ చేపట్టకుండానే వాయిదా పడ్డాయి. నామినేట్ సభ్యులను ఓటింగ్‌కు ఎల్జీ అనుమతించాన్ని ఆప్ వ్యతిరేకిస్తూ నిరసనలకు దిగడం, ఆప్-బీజేపీ మధ్య ఘర్షణ వాతావారణం తలెత్తడంతో ఈ పరిస్థితి తలెత్తింది. దీంతో మేయర్ ఎన్నికలకు ఫిబ్రవరి 16వ తేదీని ఎల్జీ ప్రకటించారు. అయితే సుప్రీంకోర్టు ఆదేశంతో ఆ తేదీ కూడా వాయిదా పడింది. నామినేటెడ్ సభ్యులకు ఓటింగ్ హక్కును కల్పించే ఎల్జీ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో ఆప్ సవాలు చేసింది. ఈ నేపథ్యంలో నామినేట్ సభ్యులకు ఓటు హక్కు నిరాకరిస్తూ సుప్రీంకోర్టు గత శుక్రవారంనాడు సంచలన తీర్పునిచ్చింది. దీంతో ఎంసీడీ మేయర్ ఎన్నికకు మార్గం సుగమమైంది.
50 స్థానాలున్న ఢిల్లీ మున్సిపాలిటీకి గత డిసెంబర్ 4న ఎన్నికలు జరుగగా, డిసెంబర్ 7న ఫలితాలు వెలువడ్డాయి. ఆప్ 134 సీట్లు గెలుచుకుని, మేయర్ స్థానాన్ని దక్కించుకునేందుకు అవసరమైన సీట్లు గెలుచుకుంది. బీజేపీ 104 వార్డులు గెలుచుకుని రెండో స్థానంలో నిలిచింది. కాంగ్రెస్ 9 సీట్లు గెలుచుకుంది. కాగా, ఆప్ తరఫున ఢిల్లీ మేయర్ అభ్యర్థిగా షెల్లీ ఒబెరాయ్ పోటీ పడగా, బీజేపీ తరఫున రేఖా గుప్తా పోటీ పడ్డారు. డిప్యూటీ మేయర్ పదవికి ఆప్ తరఫున అలెయ్ మొహమ్మద్ ఇక్బాల్, బీజేపీ నుంచి కమల్ బాగ్రి పోటీలో ఉన్నారు. మేయర్, డిప్యూటీ మేయర్‌తో పాటు ఎంసీడీ స్టాడింగ్ కమిటీకి 18 మంది సభ్యులలో ఆరుగురు సభ్యులను నేరుగా ఎన్నుకోవాల్సి ఉంది. మిగిలిన 12 మందిని జోనల్ ఎలక్షన్స్ ద్వారా ఎన్నుకుంటారు. కాగా, సంఖ్యాబలం ఆధారంగా కీలకమైన ఆరుగురు సభ్యుల ఎన్నికలో మూడు సీట్లు ఆప్ గెలుచుకోనుండగా, బీజేపీ రెండు సీట్లు దక్కించుకోనుంది. కీలకమైన ఆరో సీటు ఆప్-బీజేపీకి ప్రతిష్ఠాత్మకంగా మారింది. నామినేట్ సభ్యులను ఓటింగ్‌కు అనుమతిస్తే బీజేపీకి ఆ సీటు దక్కే అవకాశం ఉందని ఆప్ ఆందోళన చెందగా, ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో ఆ సీటు కూడా ఆప్‌కు దక్కే అవకాశాలున్నాయి.