Live-in Relationships : యువతీ, యువకుల సహజీవనంపై హైకోర్టు మండిపాటు

ABN , First Publish Date - 2023-09-02T12:48:34+05:30 IST

భారత దేశంలో వివాహ వ్యవస్థను నాశనం చేయడానికి పద్ధతి ప్రకారం కుట్ర జరుగుతోందని అలహాబాద్ హైకోర్టు మండిపడింది. వివాహ వ్యవస్థ యువతీ, యువకులకు భద్రత, సామాజిక ఆమోదం, స్థిరత్వాలను ఇస్తుందని, వీటిని సహజీవనం ఇవ్వదని చెప్పింది.

Live-in Relationships : యువతీ, యువకుల సహజీవనంపై హైకోర్టు మండిపాటు

అలహాబాద్ : భారత దేశంలో వివాహ వ్యవస్థను నాశనం చేయడానికి పద్ధతి ప్రకారం కుట్ర జరుగుతోందని అలహాబాద్ హైకోర్టు మండిపడింది. వివాహ వ్యవస్థ యువతీ, యువకులకు భద్రత, సామాజిక ఆమోదం, స్థిరత్వాలను ఇస్తుందని, వీటిని సహజీవనం ఇవ్వదని చెప్పింది. సహజీవనం చేసిన యువతిపై అత్యాచారం కేసులో యువకునికి బెయిలు మంజూరు చేస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది.

జస్టిస్ సిద్ధార్థ్ నేతృత్వంలోని అలహాబాద్ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇటీవల అద్నాన్ అనే యువకునికి బెయిలు మంజూరు చేసింది. అద్నాన్‌తో సహజీవనం చేసిన యువతి (19) ఉత్తర ప్రదేశ్‌లోని సహరాన్ పూర్‌లో కేసు దాఖలు చేశారు. తామిద్దరమూ ఓ ఏడాది నుంచి సహజీవనం చేస్తున్నామని, తాను గర్భవతినయ్యానని ఆ యువతి చెప్పారు. అయితే తనను పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి, తనతో సెక్స్ చేశాడని, తాను గర్భవతినయిన తర్వాత మోసం చేశాడని, తనను పెళ్లి చేసుకోలేదని ఆరోపించారు. అద్నాన్‌ను ఈ ఏడాది ఏప్రిల్‌‌లో అరెస్ట్ చేశారు. ఈ కేసుపై విచారణ జరిపిన ధర్మాసనం సహజీవనం విధానాన్ని తీవ్రంగా దుయ్యబట్టింది.


జస్టిస్ సిద్ధార్థ్ తీర్పు చెప్తూ, వివాహ వ్యవస్థ వల్ల భద్రత, సాంఘిక, సామాజిక ఆమోదం, స్థిరత్వం లభిస్తాయని, వీటిని సహజీవనం ఇవ్వదని చెప్పారు. ప్రతి సీజన్‌లోనూ సహజీవన భాగస్వామిని మార్చే కిరాతక విధానాన్ని సుస్థిరమైన, ఆరోగ్యవంతమైన సమాజానికి హాల్‌మార్క్‌గా పరిగణించలేమని తెలిపారు. మన దేశంలో మధ్య తరగతి ప్రజల నైతికతను పట్టించుకోకుండా ఉండలేమన్నారు. అభివృద్ధి చెందిన దేశాలని చెప్పుకుంటున్న దేశాల్లో వివాహ వ్యవస్థను కాపాడుకోవడం పెద్ద సమస్యగా మారిందని, అదే విధంగా మన దేశంలో కూడా వివాహ వ్యవస్థ పాతబడినపుడు, వాడుకలో లేనపుడు మాత్రమే సహజీవనం సాధారణమేనని పరిగణించవచ్చునని తెలిపారు. ఇటువంటి ధోరణితో మనం భవిష్యత్తులో మనకోసం తీవ్రమైన సమస్యను సృష్టించుకుంటున్నామన్నారు.

వివాహ బంధంలో నమ్మకద్రోహం, దాంపత్యద్రోహం, యథేచ్ఛగా సహజీవనం చేయడం వంటివాటిని అభ్యుదయ సమాజానికి గుర్తులుగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వీటి వల్ల కలిగే దీర్ఘకాలిక పర్యవసానాల గురించి తెలియకపోవడం వల్ల యువత ఇటువంటి సిద్ధాంతాల పట్ల ఆకర్షితులవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో నిందితునికి బెయిలు మంజూరు చేశారు.


ఇవి కూడా చదవండి :

Supreme Court : తల్లిదండుల పెళ్లి చెల్లకపోయినా పిల్లలకు వారసత్వ హక్కు ఉంటుంది : సుప్రీంకోర్టు

RSS : మన దేశాన్ని ‘భారత్’ అని పిలవాలి : మోహన్ భగవత్

Updated Date - 2023-09-02T12:48:34+05:30 IST