Budget 2023 : బడ్జెట్ సమయంలో అందరూ ఈ రైతును గుర్తు చేసుకోవాల్సిందే!
ABN , First Publish Date - 2023-01-31T16:20:27+05:30 IST
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Nirmala Sitharaman) బుధవారం పార్లమెంటుకు బడ్జెట్‌ను సమర్పించబోతున్నారు.
న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Nirmala Sitharaman) బుధవారం పార్లమెంటుకు బడ్జెట్‌ను సమర్పించబోతున్నారు. పన్ను చెల్లింపుదారులు, సామాన్యులు తమకు అనుకూలంగా ఏం ఉంటుంది? తమపై భారాన్ని పెంచే వార్తలు ఏం రాబోతున్నాయి? అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చివరి పూర్తి స్థాయి బడ్జెట్ ఇదే కావడంతో అందరికీ తాయిలాలు అందుతాయని చాలా మంది ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ రైతు గురించి తప్పకుండా తెలుసుకోవాలి.
2019-20లో ప్రభుత్వం పార్లమెంటుకు తెలిపిన వివరాల ప్రకారం, మన దేశంలో 136 కోట్ల మంది ఉన్నారు. వీరిలో కేవలం 8 కోట్ల మంది (సుమారుగా) మాత్రమే (వ్యక్తులు, కంపెనీలు) పన్ను చెల్లిస్తున్నారు. పన్ను పరిధిలోకి మిగిలినవారిని తీసుకొచ్చేందుకు అనేక చర్యలు చేపడుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
పన్నులు చెల్లించాలని భారతీయులను ప్రోత్సహించేందుకు స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి సీడీ దేశ్‌ముఖ్ (CD Deshmukh) ఓ రైతు గురించి తెలిపారు. పన్ను చెల్లించవలసిన అవసరం లేని ఓ రైతు తనకు ఓ లేఖ రాశారని చెప్పారు. తాను దేశానికి సాయం చేయాలనుకుంటున్నానని చెప్తూ, రూ.5 పంపించారని తెలిపారు. తాను ప్రతి సంవత్సరం ఇదే విధంగా రూ.5 చెల్లిస్తానని ఆయన చెప్పారన్నారు. సామాన్యుల నుంచి స్ఫూర్తిని పొందితే దేశం భవిష్యత్తులో ఎంతటి సంక్లిష్ట పరిస్థితినైనా సునాయాసంగా, ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొనగలుగుతుందని తెలిపారు.
దేశ్‌ముఖ్ మొదట్లో ఇండియన్ సివిల్ సర్వెంట్‌గా పని చేశారు. ఆ తర్వాత బ్రిటిష్ పాలకులు 1943లో ఆయనను భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నర్‌గా నియమించారు. ఈ పదవిని నిర్వహించిన తొలి భారతీయుడు ఆయనే కావడం విశేషం. 1950లో ఏర్పాటైన ప్రణాళికా సంఘంలో ఐదుగురు సభ్యుల్లో ఆయన ఒకరు. ప్రస్తుతం దీనినే నీతీ ఆయోగ్‌గా మార్చారు. ఆయన 1950 నుంచి 1956 వరకు కేంద్ర ఆర్థిక మంత్రిగా పని చేశారు.