CM Kejriwal: దేశాన్ని ప్రేమిస్తా.. దేశం కోసం ప్రాణాన్ని సైతం ఇస్తా..

ABN , First Publish Date - 2023-04-16T10:15:45+05:30 IST

ఢిల్లీ: ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆదివారం సీబీఐ ముందుకు వెళ్లనున్నారు. తొలిసారి ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కేజ్రీవాల్ సీబీఐ విచారణ ఎదుర్కోనున్నారు.

CM Kejriwal: దేశాన్ని ప్రేమిస్తా.. దేశం కోసం ప్రాణాన్ని సైతం ఇస్తా..

ఢిల్లీ: ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆదివారం సీబీఐ ముందుకు వెళ్లనున్నారు. తొలిసారి ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కేజ్రీవాల్ సీబీఐ విచారణ ఎదుర్కోనున్నారు. సీబీఐ కేంద్ర కార్యాలయంలో ఇవాళ ఉదయం 11 గంటలకు హాజరుకానున్నారు. లిక్కర్ కుంభకోణంలో సాక్షిగా వాంగ్మూలం నమోదుకే కేజ్రీవాల్‌ను సీబీఐ ప్రశ్నించనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా సీబీఐ కార్యాలయానికి వెళ్లే ముందు సీఎం కేజ్రివాల్ వీడియో రిలీజ్ చేశారు.

సీబీఐ అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తానని సీఎం కేజ్రివాల్ సష్టం చేశారు. తనను అరెస్టు చేస్తామంటూ బీజేపీ నాయకులు ప్రచారం చేస్తున్నారని, అధికార అహంకారంతో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ‘మా మాట వినాలి.. లేదంటే జైల్లో పెడతాం అనే విధంగా బీజేపీ వ్యవహరిస్తుంది.. దేశాన్ని ప్రేమిస్తా దేశం కోసం ప్రాణాన్ని సైతం ఇస్తా’ అంటూ కేజ్రివాల్ వ్యాఖ్యానించారు. రాజకీయాల్లోకి ఎన్నో ప్రశ్నల మధ్య పదేళ్ళ క్రితం అడుగులు వేశానన్నారు. ఎన్నో మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేశానని పేర్కొన్నారు. జైల్లో పెడతామని చెప్పి పదేపదే బెదిరిస్తున్నారన్నారు.

ఎనిమిదేళ్లలో ఢిల్లీని అభివృద్ధి చేసి చూపెట్టానని, 30 ఏళ్లలో గుజరాత్‌లో ఏం అభివృద్ధి చేశారని సీఎం కేజ్రివాల్ బీజేపీని ఉద్దేశిస్తూ ప్రశ్నించారు. తన జీవిత లక్ష్యం.. భారత్‌ను ప్రపంచంలో నెంబర్ వన్‌గా చేయడమేనన్నారు. తాను షుగర్ పేషెంట్‌నని, ప్రతిరోజు 50 యూనిట్ల కంటే ఎక్కువ ఇన్సులిన్ తీసుకుంటున్నట్లు చెప్పారు. అయినా అవినీతికి వ్యతిరేకంగా ఒకసారి పది రోజులు.. ఇంకోసారి 15 రోజులు నిరాహార దీక్ష చేశానని చెప్పారు. సీబీఐ 100 సార్లు పిలిచినా వెళ్తానని.. వారడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తానన్నారు. ‘దేశం కోసం పుట్టాను.. దేశం కోసం చస్తాను’ అంటూ సీఎం కేజ్రివాల్ వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-04-16T10:15:45+05:30 IST