Share News

HD Kumaraswamy: సీఎం సిద్ధరామయ్యపై కుమారస్వామి విమర్శలు.. కర్ణాటక హామీల సంగతేంటి?

ABN , First Publish Date - 2023-11-12T19:04:51+05:30 IST

Telangana Elections: కర్ణాటకలోకి కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ సీఎం కుమారస్వామి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కర్ణాటకలో ఇచ్చిన హామీల్ని పూర్తి చేయడంలో విఫలమైన కాంగ్రెస్.. తెలంగాణలో మాత్రం పెద్దఎత్తున హామీలు ఇస్తోందంటూ ఫైర్ అయ్యారు. ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం ఆ రాష్ట్రంలో 24 గంటల విద్యుత్తు ఇస్తుంటే..

HD Kumaraswamy: సీఎం సిద్ధరామయ్యపై కుమారస్వామి విమర్శలు.. కర్ణాటక హామీల సంగతేంటి?

కర్ణాటకలోకి కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ సీఎం కుమారస్వామి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కర్ణాటకలో ఇచ్చిన హామీల్ని పూర్తి చేయడంలో విఫలమైన కాంగ్రెస్.. తెలంగాణలో మాత్రం పెద్దఎత్తున హామీలు ఇస్తోందంటూ ఫైర్ అయ్యారు. ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం ఆ రాష్ట్రంలో 24 గంటల విద్యుత్తు ఇస్తుంటే.. ఐదు గంటల కరెంట్ ఇస్తామని కాంగ్రెస్ చెప్పడం కామెడీగా ఉందంటూ వ్యంగ్యాస్త్రాలు చేశారు. తెలంగాణలో సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌‌ల ఎన్నికల ప్రచారాలపై ఆయన ఈ మేరకు నిప్పులు చెరిగారు.

సిద్ధరామయ్య తాత్కాలిక ముఖ్యమంత్రి అయితే.. డీకే శివకుమార్ డూప్లికేట్ ముఖ్యమంత్రి అని కుమారస్వామి సెటైర్లు వేశారు. తెలంగాణలో రైతులకు ఇప్పటికే 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నప్పుడు.. అక్కడికి వెళ్లి 5 గంటల కరెంటు ఇస్తామని వాగ్దానం చేయడం హాస్యాస్పదమన్నారు. కర్ణాటకలో 2.5 లక్షల పోస్టులు ఖాళీగా ఉంటే.. తెలంగాణలో రెండు లక్షల పోస్టులు భర్తీ చేస్తామని సిద్ధరామయ్య, శివకుమార్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కర్ణాటకలో భర్తీలను పూర్తి చేయని వాళ్లు.. తెలంగాణలో ఏం చేస్తామని ఎత్తిచూపారు. గతంలో 2013 నుంచి 2018 వరకు సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ.. ఈ ఖాళీలు ఉన్నాయని చెప్పుకొచ్చారు.


ఇటీవల తాను తన నియోజకవర్గంలో కర్ణాటక అభివృద్ధి కార్యక్రమం (KDP) సమావేశాన్ని నిర్వహించానని.. 28 నుండి 30 మంది వ్యవసాయ అధికారులతో పాటు సిబ్బంది అవసరమున్న ఒక తాలూకా కార్యాలయంలో కేవలం ముగ్గురు వ్యక్తులే ఉన్నారని విమర్శించారు. ఈ తాలూకా పరిస్థితిని బట్టి.. కాంగ్రెస్ ప్రభుత్వ తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. అనంతరం నాన్-ఏసీ ప్రభుత్వ బస్సుల్లో కర్ణాటక మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అందించే శక్తి పథకాన్ని ప్రస్తావిస్తూ.. బస్సులు, సిబ్బంది కొరత తనను తల దించుకునేలా చేసిందని అన్నారు. ఇదే సమయంలో.. గృహలక్ష్మి పథకం గురించి ప్రస్తావిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు.

గృహలక్ష్మి పథకం కింద కర్ణాటకలోని కుటుంబ పెద్దలకు (మహిళలు) రూ.2000 ఇస్తున్నారని, తెలంగాణలో మాత్రం రూ.4000 ఇస్తామని హామీ ఇస్తున్నారని, కర్ణాటకలో ఎందుకు ఇవ్వడం లేదని కుమారస్వామి ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఈ పథకాన్ని విస్తరింపచేస్తోందని.. కానీ సర్వర్ సమస్యి అని చెప్తూ ఇంతవరకూ అర్హత ఉన్న 10 లక్షల కుటుంబాలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆరోపించారు. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల మేర ఉచిత విద్యుత్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని.. కానీ కర్ణాటకలో తరచూ లోడ్ షెడ్డింగ్ జరుగుతోందని అన్నారు. చాలా పోలీస్ స్టేషన్లు అంధకారంలో నడుస్తున్నాయని విమర్శించారు.

Updated Date - 2023-11-12T19:04:53+05:30 IST