Madhya Pradesh congress: కమల్‌నాథ్ ఔట్.. జీతూ పట్వారి ఇన్
ABN , Publish Date - Dec 16 , 2023 | 09:22 PM
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమిని చవిచూడటంతో ఆ పార్టీ రాష్ట్ర యూనిట్‌ను అధిష్ఠానం పునర్వవస్థీకరించింది. పార్టీ సీనియర్ నేత కమల్‌నాథ్‌ను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలిగించింది. ఆయన స్థానంలో రావూ ఎమ్మెల్యే జీతూ పట్వారిని పార్టీ రాష్ట్ర శాఖ కొత్త అధ్యక్షుడిగా ప్రకటించింది.
భోపాల్: మధ్యప్రదేశ్ (Madhya Pradesh)అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress)పార్టీ ఓటమిని చవిచూడటంతో ఆ పార్టీ రాష్ట్ర యూనిట్‌ను అధిష్ఠానం పునర్వవస్థీకరించింది. పార్టీ సీనియర్ నేత కమల్‌నాథ్(Kamal Nath)ను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలిగించింది. ఆయన స్థానంలో రావూ(Rau) ఎమ్మెల్యే జీతూ పట్వారి (Jitu Patwari)ని పార్టీ రాష్ట్ర శాఖ కొత్త అధ్యక్షుడిగా ప్రకటించింది. గిరిజన నేత ఉమాంగ్ సింఘార్‌ను రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకునిగా, ఎమ్మెల్యే హేమంత్ కటారేను విపక్ష పార్టీ డిప్యూటీ లీడర్‌గా ఎంపిక చేసింది.
సీఎం అభ్యర్థిగా కమల్‌నాథ్‌ను ప్రకటించినప్పటికీ..
2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందుగానే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కమల్‌నాథ్‌ను ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఆయన నాయకత్వంలోనే ఎన్నికలకు వెళ్లింది. అయితే 230 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 66 సీట్లకు మాత్రమే కాంగ్రెస్ పరిమితమైంది. బీజేపీ 163 సీట్లతో ఘనవిజయం సాధించింది. కమల్‌నాథ్ మాత్రం చింద్వారా నియోజకవర్గం నుంచి 36,594 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 1980 నుంచి ఇదే నియోజకవర్గం నుంచి కమల్‌నాథ్ రికార్డు స్థాయిలో తొమ్మిది సార్లు లోక్‌సభ ఎంపీగా గెలిచారు.
జీతూ పట్వారి ఎవరు?
బిజల్‌పూర్‌లో 1973లో జన్మించిన జీతూ పట్వారి రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా పనిచేశారు. ఉన్నత విద్య, యువజన, క్రీడల శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. అయితే 2020 మధ్యప్రదేశ్‌లో తలెత్తన రాజకీయ సంక్షోభంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. రావూ నియోజకవర్గం నుంచి ఆయన తొలిసారి 2013లో ఎమ్మెల్యే అయ్యారు.