Kanniyakumari: కన్నియాకుమారిలో పెరిగిన పర్యాటకుల రద్దీ
ABN , First Publish Date - 2023-11-26T09:24:01+05:30 IST
ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం కన్నియాకుమారి(Kanniyakumari)లో శనివారం పర్యాటకుల రద్దీ అధికమైంది. అక్కడి టీటీడీ శ్రీవారి ఆలయం,

చెన్నై, (ఆంధ్రజ్యోతి): ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం కన్నియాకుమారి(Kanniyakumari)లో శనివారం పర్యాటకుల రద్దీ అధికమైంది. అక్కడి టీటీడీ శ్రీవారి ఆలయం, భగవతి అమ్మవారి ఆలయానికి వేల సంఖ్యలో భక్తులు పోటెత్తారు. శబరిమలై సీజన్ ఈనెల 17న ప్రారంభమైంది. అప్పటి నుంచి అయ్యప్పభక్తులు ఇక్కడి త్రివేణి సంగమ ప్రాంతంలో పుణ్య స్నానమాచరించేందుకు పోటెత్తుతున్నారు. గత ఐదు రోజులుగా వివిధ రాష్ట్రాల నుండి వచ్చే అయ్యప్పస్వామి భక్తులు, పర్యాటకులతో కన్నియాకుమారిలోని పర్యాటక ప్రాంతాలన్ని కిటకిటలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో వారంతపు సెలవుదినమైన శనివారం కూడా కన్నియాకుమారిలో పర్యాటకుల రద్దీ విపరీతంగా పెరిగింది. గత మూడు రోజులుగా వర్షం కారణంగా పర్యాటకులు త్రివేణి సంగమ ప్రాంతం వద్ద సూర్యోదయాన్ని వీక్షించలేకపోయారు. శనివారం ఉదయం ఆకాశం నిర్మలంగా ఉండడంతో సూర్యోదయ దృశ్యాన్ని తిలకించేందుకు పర్యాటకులు గుమికూడారు. ఇదే విధంగా వివేకానంద స్మారక మండపం, తిరువళ్లువర్ విగ్రహం ప్రాంతాన్ని సందర్శించేందుకు ఉదయం 8 గంటలకల్లా పర్యాటకులు తరలివెళ్లారు. గాంధీ స్మారక మండపం, కామరాజర్ మణిమండపం, సునామీ స్మారక స్తూప ప్రాంతం, ప్రభుత్వ మ్యూజియం, రామాయణ దర్శన చిత్రపటాల ప్రదర్శన ప్రాంతం తదితర ప్రాంతాల వద్ద పర్యాటకుల రద్దీ అధికమైంది.