Karnataka: వలపువలలో కన్నడ నేతలు
ABN , Publish Date - Mar 22 , 2025 | 06:00 AM
కేంద్ర కాంగ్రెస్ నాయకులు, న్యాయమూర్తులపై అశ్లీల వీడియోలు తీసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఓ సీనియర్ మంత్రే అసెంబ్లీలో బయటపెట్టడం కలకలం రేపింది.

కర్ణాటకను కుదిపేస్తున్న హనీట్రాప్
ఇద్దరు మంత్రులు సహా 48 మంది ఎమ్మెల్యేలపై అశ్లీల వీడియోలు
కొందరు జాతీయ పార్టీ నేతలు, న్యాయమూర్తులవి కూడా..
అసెంబ్లీలో వెల్లడించిన మంత్రి రాజన్న
వెనుక డీకే శివకుమార్ ఉన్నారని బీజేపీ, కాంగ్రెస్ నేతల అనుమానాలు
అసెంబ్లీలో గందరగోళం.. 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై ఆర్నెల్ల సస్పెన్షన్
ఎవ్వరినీ వదలం: కర్ణాటక సీఎం
బెంగళూరు, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): హనీట్రాప్ వ్యవహారం కర్ణాటక రాజకీయాలను కుదిపేస్తోంది. ఆ పార్టీ, ఈ పార్టీ అని కాకుండా పలువురు నేతలు ఇందులో చిక్కుకున్నారు. ఇద్దరు మంత్రులు సహా 48 మంది కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ ఎమ్మెల్యేలు, కేంద్ర కాంగ్రెస్ నాయకులు, న్యాయమూర్తులపై అశ్లీల వీడియోలు తీసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఓ సీనియర్ మంత్రే అసెంబ్లీలో బయటపెట్టడం కలకలం రేపింది.
తాను కూడా హనీట్రాప్ బాధితుడినేనని, విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అసలీ అంశం వెనుక.. సీఎం కావాలని అభిలషిస్తున్న సీనియర్ నాయకుడి హస్తం ఉందని కాంగ్రె్‌సలో చర్చ నడుస్తోంది. కొందరు ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌పై అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. దీనికి సీఎం సిద్దరామయ్య సమాధానం చెప్పాలని బీజేపీ సభ్యులు అసెంబ్లీలో పట్టుబట్టారు. జ్యుడీషియల్ విచారణ గానీ, సీబీఐ దర్యాప్తు గానీ చేపట్టాలని డిమాండ్ చేశారు. వెల్‌లోకి దూసుకెళ్లి గందరగోళం సృష్టించారు. కాగితాలు చించి స్పీకర్‌పై విసిరివేశారు. దీంతో 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలను ఆరు నెలలపాటు సస్పెండ్ చేస్తూ పాలక పక్షం సభలో తీర్మానించింది. మార్షల్స్ సాయంతో వారిని సభ బయటకు పంపింది.
మూడ్రోజుల కిందట..
హనీట్రాప్ అంశాన్ని తొలుత బుధవారం బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సునీల్‌కుమార్ ప్రస్తావించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హనీట్రాప్ ఫ్యాక్టరీ నడుపుతోందని, ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. హనీట్రాప్ వెనుక కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు ఉన్నారని.. నాయకత్వ సంక్షోభంలో రాజకీయ ప్రత్యర్థుల ప్రతిష్ఠను దెబ్బతీయడానికి ఇలా చేశారని బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ కూడా ఆరోపించారు. సీఎం పదవిపై కన్నేసిన కాంగ్రెస్ నేతలు ఇలాంటి కుయత్నాలకు దిగినట్లు ప్రచారం జరుగుతోందన్నారు. దీనిపై గురువారం సహకార మంత్రి కేఎన్ రాజన్న సభలో ప్రస్తావించారు. తాను కూడా హనీట్రాప్ బాధితుడినని చెప్పడంతో సభలో కలకలం రేగింది.
‘నేనొక్కడినే కాదు. 48 మంది ఎమ్మెల్యేలతో పాటు కేంద్ర నాయకులు, న్యాయమూర్తులు కూడా బాధితులే. వారి అశ్లీల వీడియోలు తీశారు. కొందరి వద్ద సంబంధిత పెన్‌డ్రైవ్‌లు, సీడీలు ఉన్నట్లు నాకు సమాచారం ఉంది. ఇది కర్ణాటకకే పరిమితం కాలేదు. చాలా మంది జాతీయ స్థాయి పార్టీ నేతల పెన్‌డ్రైవ్‌లు కూడా ఉన్నాయి. దీనిపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తా. లోతైన దర్యాప్తు జరగాలి. ఈ పెన్‌డ్రైవ్‌లు, సీడీల సృష్టికర్తలు ఎవరు? వీటి దర్శకులెవరు.. నటులెవరు.. అంతా బయటకు రావాలి’ అని స్పష్టం చేశారు. ఇది చాలా తీవ్రమైన అంశమని.. రాజన్న లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే సమగ్ర దర్యాప్తు జరిపిస్తానని హోం మంత్రి జి.పరమేశ్వర హామీ ఇచ్చారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న మాట్లాడుతూ.. తాను కూడా రాజకీయ వేధింపులకు బలయ్యానని అన్నారు.
అసెంబ్లీలో దుమారం..
బడ్జెట్ సమావేశాల చివరిరోజైన శుక్రవారం ఈ అంశంపై కర్ణాటక అసెంబ్లీలో తీవ్ర గందరగోళం చెలరేగింది. సభ ఉదయం ప్రారంభం కాగానే బీజేపీ, జేడీఎస్ ఎమ్మెల్యేలు వెల్‌లోకి దూసుకెళ్లారు. హనీట్రాప్ రుజువులంటూ సీడీలను ప్రదర్శించారు. బడ్జెట్‌పై చర్చకు సీఎం సిద్దరామయ్య సిద్ధం కాగా.. మొదట హనీట్రాప్ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని పట్టుబట్టారు. దీనిపై హోం మంత్రి ఇప్పటికే ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారని, ఇలాంటి కార్యకలాపాల్లో పాత్ర ఉన్న ఏ పార్టీ నేతనూ వదిలేది లేదని సీఎం సిద్దరామయ్య స్పష్టం చేశారు. ఓవైపు ఆయన వివరణ ఇస్తుండగానే బీజేపీ సభ్యులు పోడియంవైపు దూసుకెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సాయంత్రం 4.30 గంటలకు తిరిగి సభ ప్రారంభం కాగానే.. స్పీకర్ స్థానాన్ని అగౌరవపరచినందుకు 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలను 6నెలలపాటు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ఖాదర్ ప్రకటించారు. వారు బయటకు వెళ్లకపోవడంతో మార్షల్స్ వచ్చి బలవంతంగా తీసుకెళ్లారు.