Cow Hug Day: సోషల్ మీడియా దెబ్బ.. ‘కౌ హగ్ డే’పై కేంద్రం షాకింగ్ నిర్ణయం
ABN , First Publish Date - 2023-02-10T20:00:46+05:30 IST
ఇంగ్లిష్ క్యాలెండర్‌లోని ప్రతి రోజూ ఏదో ఒక ప్రత్యేకత ఉంది. ఈ నెలలో
న్యూఢిల్లీ: ఇంగ్లిష్ క్యాలెండర్‌లోని ప్రతి రోజూ ఏదో ఒక ప్రత్యేకత ఉంది. ఈ నెలలో వచ్చే 14వ తేదీ గురించి అయితే ఇక చెప్పక్కర్లేదు. మిగతా తేదీల సంగతేమో కానీ, ఫిబ్రవరి 14 గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. కారణం అది ‘వాలెంటైన్స్ డే’ (Valentine's Day) కావడమే. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే (ప్రేమికుల దినోత్సవం) జరుపుకునే విషయంలో కొన్ని భేదాభ్రిప్రాయాలు ఉన్నాయి. సంప్రదాయవాదులు దీనిని నిరసిస్తారు. కొన్ని సంస్థలు ఫిబ్రవరి 14ను బహిష్కరించాలంటూ కొన్ని నెలల ముందు నుంచే ప్రచారం ప్రారంభించాయి. ఇంకొన్ని సంస్థలు ఫిబ్రవరి 14న పసుపు తాడు పట్టుకుని పార్కుల చుట్టూ పహారా కాస్తాయి. ఏ ఇద్దరు కనిపించినా అక్కడికక్కడే పెళ్లి జరిపించేస్తున్నాయి. దీంతో భయపడిన కొందరు ప్రేమికులు ఆ రోజున ఎవరి కంటా పడకుండా ప్రేమను పంచుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు.
పరిస్థితిలా ఉంటే మరోవైపు అదే రోజున ‘కౌ హగ్ డే’(Cow Hug Day) జరుపుకోవాలంటూ జంతు సంరక్షణ బోర్డు (Animal Welfare Board of India) ప్రకటించింది. ప్రభుత్వ ప్రకటన చూసి నెటిజన్లు(Netizens) ముఖ్యంగా ప్రేమికులకు చిర్రెత్తుకొచ్చింది. ప్రేమను పంచుకోవాల్సిన రోజును ఆవును కౌగిలించుకోవడం ఏంటంటూ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. చూస్తుంటే వాలెంటైన్స్ డే(Valentine's Day) నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రభుత్వ ఆడుతున్న నాటకంలా ఉందంటూ మీమ్స్‌తో సోషల్ మీడియాను హోరెత్తించారు. కామెడీతో కేకపుట్టించారు. కామెడీ కార్డూన్లతో హోరెత్తించారు. ప్రజల నుంచి ఇంత వ్యతిరేకత వస్తుందని ఊహించని ప్రభుత్వం ఇక లాభం లేదని ‘కౌ హగ్ డే’ను రద్దు చేస్తున్నట్టు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
‘కౌ హగ్ డే’(Cow Hug Day) ప్రకటనపై ప్రతిపక్షాలు కూడా భగ్గుమన్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Narendra Modi)పై శివసేన (ఉద్దవ్ థాకరే) తీవ్ర ఆరోపణలు చేసింది. ప్రధానికి గౌతం అదానీ ‘పవిత్ర గోవు’లా మారారని ఎద్దేవా చేసింది. టీఎంసీ(TMC) రాజ్యసభ సభ్యుడు శంతను సేన్ కూడా కౌ హగ్ డేపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సూడో హిందూయిజం, నకిలీ హిందూయిజం, నకిలీ దేశభక్తితో దేశ ప్రజలను ముఖ్యమైన అంశాల నుంచి పక్కకు మళ్లిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇది దేశానికే సిగ్గుచేటని సీపీఎం నేత ఎలమరన్ కరీం ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాను రైతు కుటుంబం నుంచే వచ్చానని, ఒక్క రోజు కాదని, తాను ప్రతి రోజూ ఆవును ఆలింగనం చేసుకుంటానని కాంగ్రెస్ నేత రజ్ని పాటిల్ అన్నారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి అంశాల నుంచి దేశ ప్రజల దృష్టిని మరల్చే కుట్ర తప్ప మరోటి కాదని దుమ్మెత్తి పోశారు. శివసేన (ఉద్ధవ్) నేత సంజయ్ రౌత్(Sanjay Raut) కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు.