Surekha Yadav : హై స్పీడ్‌ రైలును చలాకీగా నడిపేసి...

ABN , First Publish Date - 2023-03-16T03:38:43+05:30 IST

ఆవిడ భారతదేశ మొట్టమొదటి మహిళా రైలు డ్రైవరుగా 1988లో గుర్తింపు తెచ్చుకుంది. ఆవిడే తిరిగి ఆసియాలోని మొట్టమొదటి మహిళా ..

Surekha Yadav : హై స్పీడ్‌ రైలును చలాకీగా నడిపేసి...

న్యూస్‌ మేకర్‌

ఆవిడ భారతదేశ మొట్టమొదటి మహిళా రైలు డ్రైవరుగా 1988లో గుర్తింపు తెచ్చుకుంది. ఆవిడే తిరిగి ఆసియాలోని మొట్టమొదటి మహిళా లోకో పైలట్‌గా కూడా చరిత్ర సృష్టించింది. సెమి హై స్పీడ్‌ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు సారఽధి సతారాకు చెందిన సురేఖ యాదవ్‌ ప్రస్థానం ఇది!

మహారాష్ట్రకు చెందిన సతారాలో సోనాబాయి, రామచంద్ర భోసాలెలకు పుట్టిన సురేఖ సతారాలో ప్రాథమిక విద్యను పూర్తి చేసుకుని, కరాడ్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీ నుంచి ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌లో డిప్లొమా పూర్తి చేసింది. 1980ల్లో రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ ఎగ్జామ్‌ రాసి, ఉత్తీర్ణురాలై, 1986లో సెంట్రల్‌ రైల్వేలో ట్రైనీ అసిస్టెంట్‌ డ్రైవర్‌గా శిక్షణ తీసుకుంది. 2000లో సెంట్రల్‌ రైల్లే లేడీస్‌ స్పెషల్‌ లోకల్‌ ట్రైన్‌కు సైతం ఆవిడ తొలి మహిళా లోకో పైలట్‌గా గుర్తింపు పొందింది. ఆ తర్వాత పశ్చిమ కనుమల గుండా ఎంతో క్లిష్టమైన వంపులతో కూడిన మార్గంలో సైతం పూణే డెక్కన్‌ క్వీన్‌ను నడిపి రైల్వే శాఖ మన్ననలు పొందింది. అలాగే కల్యాణ్‌లోని డ్రైవర్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో డ్రైవర్లకు శిక్షణనిచ్చే ఇన్‌స్ట్రక్టర్‌గా కూడా ఆవిడ సేవలందించడం విశేషం.

ఐదు నిమిషాలు ముందుగానే...

ప్రస్తుతం సురేఖ సోలాపూర్‌ స్టేషన్‌, ముంబయిలోని ఛత్రపతి శివాజి మహరాజ్‌ టర్మిన్‌సల మధ్య సెమి హై స్పీడ్‌ ట్రైన్‌కు పైలట్‌గా సేవలందించడం మొదలుపెట్టింది. ఈ రైలు సేవలు సోలాపూర్‌ స్టేషన్‌లో మార్చి 13 నుంచి మొదలయ్యాయి. సోలాపూర్‌ నుంచి బయల్దేరిన ఈ రైలును సురేఖ చేరుకోవలసిన సమయాని కంటే ఐదు నిమిషాలు ముందే గమ్యానికి చేర్చడం మరో విశేషం. ఈ రైలును 450 కిలోమీటర్ల సుదీర్ఘ దూరం నడిపినందుకు గాను, రైలు ఛత్రపతి శివాజి మహరాజ్‌ టర్మినల్‌ చేరుకున్న వెంటనే సురేఖను రైల్వే శాఖ సత్కరించింది. సురేఖ గురించి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌... ‘‘నారీ శక్తి, శ్రీమతి సురేఖ యాదవ్‌, వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ తొలి మహిళా లోకో పైలట్‌’’ అంటూ ట్వీట్‌ చేశారు.

train-2.jpg

నైపుణ్యం ఆమె సొంతం

సెంట్రల్‌ రైల్వే రెండు వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను సోలాపూర్‌, ఛత్రపతి శివాజి మహరాజ్‌ టర్మినల్‌ల మధ్య, ఛత్రపతి శివాజి టర్మినల్‌, సాయినగర్‌ షిర్డి రూట్ల మధ్య ప్రారంభించింది. 2023 ఫిబ్రవరి 10, ప్రధాని నరేంద్ర మోది ఈ రెండు రైళ్లకు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. కొత్త మార్గాల్లో లోకో పైలటింగ్‌ చేయడానికి ఎంతో నైపుణ్యం కలిగి ఉండాలనీ, ప్రయాణం అసాంతం ఎంతో అప్రమత్తంగా వ్యవహరించవలసిన అవసరం ఉంటుందనీ రైల్వే అధికారులు చెప్తున్నారు. ఈ రైలు నడపడానికి సంబంధించిన శిక్షణలో భాగంగా సిగ్నళ్లను గమనించడం, సరికొత్త పరికరాలను ఉపయోగించడం, ఇతర సిబ్బందితో కలిసి పని చేయడం, రైలు నడపడానికి సంబంధించిన పారామితులు పాటించడాన్ని సురేఖ నేర్చుకున్నారు. మునుపు అంతర్జాతీయ ఉమెన్స్‌ డే నాడు సెంట్రల్‌ రైల్లే ప్రతిష్ఠాత్మకమైన ముంబయి

- పూణె డెక్కన్‌ క్వీన్‌ ఎక్స్‌ప్రెస్‌, ఛత్రపతి శివాజి మహరాజ్‌ టర్మినల్‌

- కల్యాణ్‌ లేడీస్‌ స్పెషల్‌ లోకల్‌ ట్రైన్‌కు లోకో పైలట్‌గా సురేఖ సారధ్యం వహించడం విశేషం.

Updated Date - 2023-03-16T03:40:11+05:30 IST