Share News

ఉమ్మడి ప్రిపరేషన్‌ బెస్ట్‌

ABN , Publish Date - Mar 24 , 2025 | 04:44 AM

ఇంటర్‌ పరీక్షలు పూర్తయ్యాయి. పోటీ పరీక్షలు మళ్లీ మొదలయ్యాయి. ఎంపీసీ విద్యార్థులు ఏప్రిల్‌ మొదటి వారంలో జేఈఈ మెయిన్‌ రెండో సెషన్‌కి హాజరు కావాల్సి ఉంది. తరవాత మేలో ఎంసెట్‌ పరీక్ష రాయాలి. జేఈఈకి దాదాపుగా...

ఉమ్మడి ప్రిపరేషన్‌ బెస్ట్‌

జేఈఈ ప్లస్‌ ఎంసెట్‌

ఇంటర్‌ పరీక్షలు పూర్తయ్యాయి. పోటీ పరీక్షలు మళ్లీ మొదలయ్యాయి. ఎంపీసీ విద్యార్థులు ఏప్రిల్‌ మొదటి వారంలో జేఈఈ మెయిన్‌ రెండో సెషన్‌కి హాజరు కావాల్సి ఉంది. తరవాత మేలో ఎంసెట్‌ పరీక్ష రాయాలి. జేఈఈకి దాదాపుగా 13.5 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా జనవరి సెషన్‌కి దాదాపుగా 11 లక్షల మంది హాజరయ్యారు. వీటి ఫలితాలు కూడా వెల్లడయ్యాయి. అదే సమయంలో రెండో సెషన్‌ రిజిస్ట్రేషన్‌ కూడా పూర్తయింది.

ఇంటర్‌ పరీక్షల తరవాత జేఈఈ రాసే విద్యార్థులకు సరిగ్గా రెండువారాల సమయం కూడా లేదు. అలాగే ఎంసెట్‌ పరీక్ష తెలంగాణలో మే 2 నుంచి 5 తేదీ వరకు జరగనుంది. ఆంధ్రప్రదేశ్‌లో అయితే మే 21 నుంచి 27 వరకు నిర్వహిస్తున్నారు. జేఈఈ, ఎంసెట్‌ రెండు ఎంట్రెన్స్‌లను దృష్టిలో పెట్టుకుని ఎలా సన్నద్ధం కావాలో చూద్దాం. సమయం తక్కువగా ఉంది కాబట్టి జేఈఈ విద్యార్థులు వెయిటేజీకి అనుగుణంగా చాప్టర్ల వారీగా రివిజన్‌ను ప్లాన్‌ చేయాలి.


  • ఎన్‌సీఆర్‌టీ పుస్తకాల నుంచి ముఖ్యమైన డెఫినేషన్స్‌, ఫార్ములాలు అండర్‌లైన్‌ చేసుకోవాలి. పైన పేర్కొన్న చాప్టర్ల ఆధారంగా ఈ కాన్సెప్టులను రోజూ పునశ్ఛరణ చేయాలి.

  • రోజుకు రెండు చాప్టర్ల చొప్పున మాక్‌టెస్టులు రాయాలి. ఇవి గత జేఈఈ టెస్టుల నుంచి అయితే ఇంకా మంచిది. ప్రతీ పరీక్షలో మెరుగుదల ఉండాలంటే నెగెటీవ్‌ మార్కులు తగ్గుతూ ఉండాలి. గెస్‌ వర్క్‌ను పూర్తిగా మానేయాలి.

  • పరీక్షలో ప్రతీ సబ్జెక్టుకు గంట మాత్రమే సమయం కేటాయించాలి. మేథ్స్‌లో ప్రశ్నలు చాలా లెంథీగా ఉంటున్నాయి. అక్కడే సమయ పాలన చాలా అవసరం.

  • టైమ్‌ మేనేజ్‌మెంట్‌ కోసం ప్రతీ ప్రశ్నకు నిర్దుష్టంగా రెండు నుంచి మూడు నిమిషాలు మాత్రమే కేటాయించుకోవాలి. కాలిక్యులేషన్స్‌లో ఎక్కువ సమయం వృథా చేయకూడదు.

  • మీకు కాన్ఫిడెన్స్‌ ఉన్న చాప్టర్లపై ఎక్కువ శ్రద్ధ పెట్టండి. ప్రస్తుతం ఉన్న సమయం దృష్ట్యా మీరు వీక్‌గా ఉన్న చాప్టర్లను వాటి వెయిటేజీ ఆధారంగా వదిలిపెట్టడమే మంచిది.

  • చాప్టర్ల వారీగా ఎంసెట్‌ ప్రణాళిక


తెలంగాణలో ఎంసెట్‌కు ఇప్పుడు సరిగ్గా 40 రోజుల సమయం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపుగా రెండు నెలల సమయం ఉంది. కేవలం ఎంసెట్‌ మాత్రమే రాయాలనుకునే విద్యార్థులు అందుకు అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. మొదటి రోజు నుంచి వెయిటేజీ ఆధారంగా చదవడం చేయాలి. జేఈఈ తరవాత ఎంసెట్‌ రాయాలనుకునే విద్యార్థులకు టీఎస్‌లో కేవలం 30 రోజులు, ఏపీలో 50 రోజుల సమయం మాత్రమే ఉంటుంది. వీరు రాపిడ్‌ షెడ్యూల్‌ సిద్ధం చేసుకోవాలి.

  • జేఈఈ మెయిన్‌తో పోలిస్తే ఎంసెట్‌లో 25 నుంచి 30 శాతం ఎక్కువ సిలబస్‌ ఉంటుంది. ఈ చాప్టర్లను పూర్తిగా పునఃశ్ఛరణ చేయాల్సిందే.

  • జేఈఈ మెయిన్‌, ఎంసెట్‌ పరీక్ష ఏదైనా కాన్సెప్టులను ఎన్‌సీఈఆర్‌టీ చాప్టర్ల నుంచే రివైజ్‌ చేయాలి.

  • వెయిటేజీ ఆధారంగా ముఖ్యమైన చాప్టర్లను చదవండి.

  • జేఈఈతో పోలిస్తే ఎంసెట్‌లో ఒక్కో ప్రశ్నకు కేటాయించిన సమయం తక్కువ. ఒక నిమిషం లో ఒక ప్రశ్నను పూరించాల్సి ఉంటుంది. కాబట్టి కాలిక్యులేషన్స్‌తో సమయం వృథా చేయవద్దు.

  • ఎంసెట్‌లో నెగెటివ్‌ మార్కులు లేనందున, ఆప్షన్‌కు అనుగుణంగా గెస్‌ వర్క్‌ చేయవచ్చు.

  • గత ముప్పై సంవత్సరాల నుంచి వచ్చిన ప్రశ్నపత్రాలను తప్పనిసరిగా రివైజ్‌ చేయండి. ఎంసెట్‌లో రిపీటెడ్‌గా ప్రశ్నలు వచ్చే అవకాశం ఎక్కువ.

  • ప్రతీ రోజు మాక్‌టెస్ట్‌ రాయండి. జేఈఈతో పోలిస్తే ప్రశ్నలు ఎంసెట్‌లో సులువుగా ఉంటాయి. ఎక్కువ ప్రాక్టీసు చేస్తే నిర్ణీత సమయంలోనే నిర్దుష్ట సమయంలో పేపర్‌ను పూర్తి చేయవచ్చు.

  • ఒక వేళ నిమిషంలో ఆ ప్రశ్న పూర్తి కావడం లేదు అనుకుంటే ఈ ప్రశ్నను వదిలేయండి. చివర్లో సమయం మిగిలితే వీటికి ఉపయోగించవచ్చు.

  • అన్నింటికన్నా ముఖ్యం ఈ కొద్దికాలం సోషల్‌ మీడియాతో పాటు చదువు నుంచి దృష్టి మళ్లించే ఇతర విషయాలకు దూరంగా ఉండడం అవసరం.

  • చదువుతోపాటు ఆరోగ్యంపై కూడా దృష్టిపెట్టాలి. పోషక ఆహారం, వ్యాయామం, సరైన అవసరం. అప్పుడే మెదడు చురుకుగా పనిచేస్తుంది.


  • మేథ్స్‌ :

కాలిక్యులస్‌ 35 శాతం,

ఆల్జీబ్రా 25 శాతం,

కోఆర్డినేట్‌ జామెట్రీ 20 శాతం,

వెక్టార్స్‌ 3డి 15 శాతం

ప్రాబబిలిటీ 5శాతం

ఫిజిక్స్‌ :

మెకానిక్స్‌ 30 శాతం

ఎలకో్ట్రడైనమిక్స్‌ 25 శాతం

ఆప్టిక్స్‌ అండ్‌ మోడ్రన్‌ ఫిజిక్స్‌ 20 శాతం

థర్మోడైనమిక్స్‌ 15 శాతం

వేవ్స్‌ అండ్‌ ఆస్లేషన్స్‌ 10 శాతం

కెమిస్ట్రీ :

ఫిజికల్‌ కెమిస్ట్రీ 35 శాతం

ఇన్‌ఆర్గానిక్‌ కెమిస్ట్రీ 30 శాతం

ఆర్గానిక్‌ కెమిస్ట్రీ(బయోమాలిక్యుల్స్‌) 35 శాతం

డా.పవన్‌ కుమార్‌ కాసు

సంజీవనీ ఐఐటీ అకాడమి

For Andhrapradesh News And Telugu News

Updated Date - Mar 24 , 2025 | 04:45 AM