అమ్మగా... అన్నీ తానుగా..

ABN , First Publish Date - 2023-09-03T23:45:37+05:30 IST

నా బాల్యమంతా ఢిల్లీ మహానగరంలో గడిచింది. అయిదు తరాల తరువాత మా ఇంట్లో నేనే ఆడపిల్లను. అందరూ ఎంతో గారాబం చేసేవారు. చక్కటి కుటుంబం, మంచి స్నేహితులు... ఎన్నో విషయాల్లో నేను చాలా అదృష్టవంతురాలిని.

అమ్మగా...   అన్నీ తానుగా..

‘‘బేటీ బచావో... బేటీ పఢావో- ఇది ఉత్త నినాదంలా మిగిలిపోకూడదు. ఆడపిల్లలకు భద్రత, విద్య ఉన్నప్పుడే దేశ పురోగతి సాధ్యం. ఆ బాధ్యతను సమాజంలో అందరూ తీసుకోవాలి’’ అంటారు సోనియా జాలీ. తన వంతు బాధ్యతగా 130 మంది పిల్లలకు ‘అమ్మ’లా అన్ని అవసరాలు ఆమె తీరుస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని సాత్నాకు చెందిన ఆమెను ‘సాత్నా మదర్‌ థెరీసా’ అని స్థానికులు ఆప్యాయంగా పిలుచుకుంటారు. తన గురించీ, తన ఉపకార్‌ సొసైటీ లక్ష్యాల గురించి యాభై ఏడేళ్ళ సోనియా ఏం చెబుతున్నారంటే...

‘‘నా బాల్యమంతా ఢిల్లీ మహానగరంలో గడిచింది. అయిదు తరాల తరువాత మా ఇంట్లో నేనే ఆడపిల్లను. అందరూ ఎంతో గారాబం చేసేవారు. చక్కటి కుటుంబం, మంచి స్నేహితులు... ఎన్నో విషయాల్లో నేను చాలా అదృష్టవంతురాలిని. కానీ నాలాంటి అదృష్టం మన దేశంలో చాలా తక్కువమంది ఆడపిల్లలకు ఉంటుందని కాస్త పెద్దయ్యాక అర్థమయింది. గర్భంలోనే ఆడపిల్లలను చంపెయ్యడం, పురిటికందుల్ని చెత్త కుప్పల మీద పారెయ్యడం, రోజూ ఏదో మూల ఆడపిల్లల మీద అత్యాచారాలు, లైంగిక వేధింపులు, పేదరికం వల్ల ఆడపిల్లలను అమ్ముకోవడం ... ఇలాంటి వార్తలు చదువుతున్నప్పుడు మనసంతా కల్లోలమైపోయేది. సామాజికమైన మార్పే దీనికి పరిష్కారమనీ, ఆ మార్పుకు దోహదపడాలనీ అనుకొనేదాన్ని. ఇరవై ఒక్క ఏళ్ళ వయసునుంచీ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేదాన్ని. పెళ్లి తరువాత నా భర్త స్వస్థలమైన మధ్యప్రదేశ్‌లోని సాత్నాలో స్థిరపడ్డాం. స్థానికంగా పేదల కోసం పలు కార్యక్రమాలను నా భర్త సహకారంతో చేస్తూ వచ్చాను. ప్రధానంగా నిత్యావసర వస్తువులు, వైద్యసాయం అందించేవాళ్ళం. మరోవైపు పేద కుటుంబాలకు చెందిన ఆడపిల్లల కోసం ఏదైనా చెయ్యాలనే నా కోరిక నానాటికీ బలపడుతూ వచ్చింది. నాకు ఇద్దరు అబ్బాయిలు. వాళ్ళు కాస్త పెద్దయిన తరువాత... 2014లో ‘ఉపకార్‌ హమ్‌ హై సొసైటీ’ని ప్రారంభించాను. ఇది పూర్తిగా మురికివాడలకు చెందిన ఆడపిల్లల సంరక్షణ, విద్య కోసం ఉద్దేశించినది.

రోజూ ఒక కొత్త సవాలు...

‘ఉపకార్‌ సొసైటీ’కి నా కుటుంబం నుంచి ప్రోత్సాహం లభించింది కానీ... పరిచయస్తులు చాలామంది రకరకాలుగా మాట్లాడారు. ‘‘ఆ పిల్లల కుటుంబాలకు ఎంతో కొంత డబ్బు ఇస్తే సరిపోతుంది కదా... లేనిపోని బరువంతా ఎందుకు నెత్తిమీద వేసుకోవడం?’’ అని మందలించారు. డబ్బు ఇవ్వడం సమస్య కాదు. పిల్లల్ని చదివించాలని డబ్బు ఇచ్చామనుకోండి... వాళ్ళకి వేరే అవసరం మీద పడితే... చేతిలో ఉన్న డబ్బు ఖర్చుపెట్టేస్తారు. దేనికోసమైతే ఇస్తున్నామో ఆ ప్రయోజనం నెరవేరదు. అలాకాకుండా పూర్తి జవాబుదారీగా నేనే ఉండాలనుకున్నాను. ఇది అంత సులువైన విషయం కాదని నాకు తెలుసు. మంచి బడిలో చేర్పించడం, ట్యూషన్‌ చెప్పించడం, ఫీజులు, స్కూల్‌ డ్రెస్‌లు, పౌష్టికాహారం... ఇలా అనేక అంశాలను చూసుకోవాలి. ప్రతి రోజూ ఒక కొత్త సవాలుతో మొదలవుతుంది. కానీ సాయంత్రానికల్లా వాటికి పరిష్కారాలు వెతకడం అలవాటయిపోయింది. పొద్దున్నే ఆరు గంటలకు మా సొసైటీ భవనానికి పిల్లలు చేరుకుంటారు. నేను, మరికొందరు వాలంటీర్లు పాఠాలు చెబుతాం. బ్రేక్‌ఫాస్ట్‌ తరువాత పిల్లలు పాఠశాలలకు, కళాశాలలకు వెళ్తారు. బడి ఈడు ఇంకా రాని పిల్లలు ఆ తరువాత వస్తారు. మధ్యాహ్నం వరకూ వారికి చిన్న చిన్న యాక్టివిటీస్‌ ద్వారా బోధన ఉంటుంది. స్కూళ్ళు, కాలేజీల నుంచి వచ్చిన పిల్లలకు సాయంత్రం పునశ్చరణ ఉంటుంది. ఆంగ్ల సంభాషణ, కంప్యూటర్‌ తరగతులతో పాటు టైలరింగ్‌, ఎంబ్రాయిడరీ, బ్యూటీషియన్‌ లాంటి అంశాల్లో శిక్షణ ఇస్తున్నాం. రాత్రి పిల్లలను వారి ఇంటికి దిగబెట్టడంతో ఆ రోజు కార్యక్రమాలు పూర్తవుతాయి. వాళ్ళు తల్లితండ్రులతో నివసిస్తారు తప్పితే... మిగిలిన ఖర్చులన్నీ సొసైటీయే భరిస్తుంది.

ఆ హామీ తీసుకుంటున్నా...

2014లో ఆరుగురు అమ్మాయిలతో ప్రారంభమైన మా సొసైటీ సంరక్షణలో ప్రస్తుతం 130 మంది అమ్మాయిలు ఉన్నారు. వీరి వయసు రెండున్నర ఏళ్ళ నుంచి పంతొమ్మిదేళ్ళ మధ్య ఉంటుంది. వీరి సంఖ్య ఏటేటా పెరుగుతోంది. అందరూ నన్ను ‘అమ్మా’ అని పిలుస్తారు. వాళ్ళందరినీ నా కూతుర్లుగానే భావిస్తాను. వారికి పంచుతున్న ప్రేమనే వారి నుంచి పొందుతున్నాను. జీవితాల్లో స్థిరపడిన తరువాత... కనీసం ఒక ఆడపిల్లనైనా దత్తత తీసుకొంటామని వారి నుంచి హామీ తీసుకుంటున్నాను. ఇప్పుడు దాదాపు నలభై మంది వాలంటీర్లు ‘ఉపకార్‌ సొసైటీ’ ద్వారా సేవలు అందిస్తున్నారు. నేను ప్రభుత్వం నుంచి కానీ, ఇతర సంస్థల నుంచి కానీ ఎలాంటి సహాయం ఆశించలేదు. మా సొసైటీలో 65 మంది సభ్యులున్నారు. ప్రతి ఒక్కరూ నెలకు రూ. 500 చొప్పున విరాళంగా ఇస్తారు. అదనంగా అవసరమయ్యే మొత్తం నేను సమకూరుస్తున్నాను. ఒక స్టేషనరీ దుకాణం యజమాని ఏడాదికి సరిపోయే నోట్‌ బుక్స్‌, స్కూల్‌ బ్యాగ్స్‌ లాంటివన్నీ ఉచితంగా అందజేస్తున్నారు. ఆయన సాయం ఎంతగానో ఉపయోగపడుతోంది. ప్రస్తుతం నా ఇద్దరు పిల్లలూ సొసైటీ కార్యక్రమాల్లో చురుగ్గా పాలుపంచుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల నుంచి ఎన్నో పురస్కారాలు, గౌరవాలు నాకు, మా సొసైటీకీ లభించాయి. అవకాశం దొరికిన ప్రతి చోటా నేను చెప్పేది ఒక్కటే... ‘‘పేదలను, ఆర్థిక స్థోమతలేని పిల్లలను మనం ఆదుకోవాలి. నిరుపేద ఆడపిల్లల చదువుకోసం సమాజంలో అందరూ వీలైనంత సాయం చెయ్యాలి. వివక్షలు, వేధింపులు, అత్యాచారాలు సమసిపోవాలన్నా అదొక్కటే మార్గం. పేదరికం వల్ల, వివక్ష వల్ల చదువుకు దూరం అవుతున్న ఒక్కరినైనా ఆదుకోండి. సమాజంలో మీరు ఊహించని మార్పు మీ కళ్ళ ఎదుటే కనిపిస్తుంది’’ అని. నా ఆశయాన్ని మా అమ్మాయిలు మరింత ముందుకు తీసుకువెళ్తారనే నమ్మకం ఉంది.’’

ABN ఛానల్ ఫాలో అవ్వండి

Updated Date - 2023-09-03T23:45:37+05:30 IST

News Hub