Indian origin: న్యూయార్క్ పోలీస్ విభాగంలో చరిత్ర సృష్టించిన భారత సంతతి మహిళా అధికారి.. నిజంగా చాలా గ్రేట్!
ABN , First Publish Date - 2023-05-19T12:58:14+05:30 IST
భారత సంతతికి చెందిన మహిళా పోలీస్ అధికారి (Indian origin police officer) కెప్టెన్ ప్రతిమ భుల్లార్ మాల్డోనాడో(Pratima Bhullar Maldonado) చరిత్ర సృష్టించింది.
న్యూయార్క్: భారత సంతతికి చెందిన మహిళా పోలీస్ అధికారి (Indian origin police officer) కెప్టెన్ ప్రతిమ భుల్లార్ మాల్డోనాడో(Pratima Bhullar Maldonado) చరిత్ర సృష్టించింది. న్యూయార్క్ పోలీస్ విభాగంలో (New York Police Department) అత్యున్నత ర్యాంక్ పొందిన దక్షిణాసియా మహిళగా ఆమె రికార్డుల్లోకెక్కింది. క్వీన్స్‌లోని రిచ్‌మండ్ హిల్‌లోని 102వ పోలీస్ స్టేషన్‌కు ఆమె ఇన్‌ఛార్జ్. ఈ క్రమంలో ఆమెకు ఈ ఏడాది ఏప్రిల్‌లో కెప్టెన్‌గా ప్రమోషన్ లభించింది. నలుగురు పిల్లల తల్లి అయిన ప్రతిమ భారత్‌లోని పంజాబ్‌లో జన్మించారు. తన 9వ యేటానే ఆమె పేరెంట్స్‌తో కలిసి యూఎస్ వెళ్లారు. అక్కడ న్యూయార్క్‌లోని క్వీన్స్‌లో సెటిల్ అయ్యారు. కాగా, ప్రతిమ ఉంటున్న సౌత్ రిచ్‌మండ్ హిల్ (South Richmond Hill) అగ్రరాజ్యంలోని అతిపెద్ద సిక్కు సమాజాలలో ఒకటి.
ఇక తనకు దక్కిన అరుదైన గౌరవం పట్ల ప్రతిమ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఇక్కడ భాషాపరమైన అవరోధాలు ఉన్నాయని చెప్పిన ఆమె.. ఇలా ఇబ్బందులు పడుతున్న వారిని తాను ప్రత్యక్షంగా చూశానని తెలిపారు. న్యూయార్క్ నగరం ఆసియన్ అమెరికన్ అండ్ పసిఫిక్ ఐలాండర్ హెరిటేజ్ మాసాన్ని (Asian American and Pacific Islander Heritage Month) జరుపుకుంటున్న నేపథ్యంలో ఆమె తన తండ్రిని గుర్తుచేసుకున్నారు. కాగా, న్యూయార్క్ పోలీస్ శాఖలోని 33,787 మంది సిబ్బందిలో ఏకంగా 10.5 శాతం మంది ఆసియా మూలాలున్న వారు ఉన్నట్లు ప్రతిమ తెలిపారు. ఇక గత నెలలో మన్మీత్ కౌర్ అనే భారత సంతతి మహిళ అమెరికా పోలీస్ శాఖలో అసిస్టెంట్ పోలీస్ చీఫ్‌గా బాధ్యతలు అందుకున్న విషయం తెలిసిందే.