UAE: రూ.55లక్షలు విలువైన వాచీని సముద్రంలో పారేసుకున్న విజిటర్.. ఆ తర్వాత యూఏఈ పోలీసుల చాకచక్యంతో..
ABN , First Publish Date - 2023-07-02T07:32:12+05:30 IST
ఎంతో ఇష్టపడి కొనుకున్న ఏదైనా చిన్న వస్తువు పొగొట్టుకుంటేనే మనం ఎంతో బాధపడిపోతాం.
అబుదాబి: ఎంతో ఇష్టపడి కొనుకున్న ఏదైనా చిన్న వస్తువు పొగొట్టుకుంటేనే మనం ఎంతో బాధపడిపోతాం. అలాంటిది లక్షలు విలువ చేసే వస్తువు పొగుట్టుకుంటే. ఆ బాధ మాటల్లో చెప్పలేం. ఇదిగో ఇలాంటి అనుభవమే దుబాయి (Dubai) లో ఓ పర్యాటకుడికి ఎదురైంది. విహార యాత్రకు వచ్చిన అతడి.. లక్షలు విలువ చేసే చేతి గడియారం అనుకోకుండా సముద్రంలో పడిపోయింది. ఇక ఎప్పటికీ వాచీ తిరిగి తన చేతికి రాదని ఆశలు వదులుకున్నాడు. కానీ, యూఏఈ పోలీసులు అద్భుతమే చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) పౌరుడు హమీద్ ఫహద్ అలమేరి (Hamid Fahad Alameri), కొంతమంది తన మిత్రులతో కలిసి దుబాయిలోని పామ్ జుమేరా (Palm Jumeirah) నుంచి ఒక యాచ్‌లో విహారయాత్రకు వెళ్లారు. సముద్ర యానాన్ని ఆస్వాదిస్తున్నప్పుడు వారిలో యూకే నుంచి వచ్చిన అలమేరి మిత్రుడు తన విలువైన రోలెక్స్ (Rolex) చేతి వాచీని సముద్రం పారేసుకున్నాడు. దాని ఖరీదు 2.50లక్షల దిర్హమ్స్. మన కరెన్సీలో అక్షరాల రూ.55.87లక్షలు అన్నమాట. ఇక వాచ్‌లో నీటిలో పడగానే అలమేరి నీటిలోకి దూకి కొద్దిసేపు ఈత కొట్టి వెతికి చూశాడు. కానీ, నీటి లోతు ఎక్కువగా ఉండడంతో బయటకు వచ్చేశాడు. నీళ్ల లోతును పరిశీలిస్తే.. గడియారాన్ని తిరిగి పొందడం దాదాపు అసాధ్యం అనిపించింది.
కానీ, అలమేరి తనవంతు ప్రయత్నంగా వెంటనే దుబాయి పోలీసులకు కాల్ చేసి విషయం చెప్పాడు. దాంతో పోలీసులు నిమిషాల వ్యవధిలో డైవర్ల బృందంతో అక్కడి చేరుకున్నారు. ఆ తర్వాత ఆ డైవర్ల బృందం అద్భుతమే చేసింది. కేవలం అర్ధ గంట వ్యవధిలోనే గడియారాన్ని వెతికి పెట్టింది. సముద్రం అడుగు భాగంలో వాచ్‌ను గుర్తించిన డైవర్లు దాన్ని బయటకు తీసి అలమేరికి అందజేశారు. దాంతో అతడి ఆనందానికి అవధుల్లేవు. పోయిన విలువైన గడియారాన్ని తెచ్చి ఇచ్చినా దుబాయి పోలీసులకు అలమేరి, అతని మిత్రులు ధన్యవాదాలు తెలియజేశారు. "అత్యుత్తమ పోలీసు సర్వీస్. మేము వారికి ఎప్పుడూ కృతజ్ఞతలు తెలుపుతూనే ఉంటాము!" అని అలమేరి తెలిపాడు.