TANA: 'తానా' కార్యవర్గంలో వీరవల్లి యువకుడు రాజా కసుకుర్తి
ABN , First Publish Date - 2023-07-14T12:52:35+05:30 IST
అమెరికాలో అతి పెద్ద తెలుగు సంఘమైన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (Telugu Association of North America) ట్రెజరర్‌గా కృష్ణాజిల్లాకు చెందిన రాజా కసుకుర్తి ఎన్నికయ్యారు.
'తానా' ట్రెజరర్‌గా ఎన్నిక
TANA: అమెరికాలో అతి పెద్ద తెలుగు సంఘమైన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (Telugu Association of North America) ట్రెజరర్‌గా కృష్ణాజిల్లాకు చెందిన రాజా కసుకుర్తి ఎన్నికయ్యారు. 2023-25 సంవత్సరానికి గాను ఏర్పాటు చేసిన కార్యవర్గంలో ఆయనను ట్రెజరర్ పదవికి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గతంలో ఆయన తానాలో వివిధ పదవులను నిర్వహించారు. తానా కమ్యూనిటీ సర్వీసెస్ కో ఆర్డినేటర్, రీజినల్ కో ఆర్డినేటర్ వంటి పదవులను ఆయన చేపట్టారు. కృష్ణాజిల్లా బావులపాడు మండలం వీరవల్లిలో జన్మించిన రాజా కసుకుర్తి ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్ళి అక్కడే స్థిరపడ్డారు.
తెలుగు రాష్ట్రాల్లో 'తానా' (TANA) ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను ఆయన నిర్వహించారు. అమెరికాలో కమ్యూనిటీ కో ఆర్డినేటర్‌గా తెలుగు స్టూడెంట్లకు ఉపయోగపడేలా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. గత డిసెంబర్, జనవరి నెలలో తానా చైతన్య స్రవంతి కార్యక్రమం ద్వారా ఎంతోమందికి ఉచిత కంటి చికిత్స, విద్యార్థులకు స్కాలర్ షిప్స్, వృద్ధులకు రగ్గులు, రైతులకు అవసరమైన పరికరాలను ఆయన అందించారు. 'తానా' ట్రెజరర్‌గా తానా నిధుల వ్యవహారాల్లో పారదర్శకంగా వ్యవహరిస్తానని ఈ సందర్భంగా రాజా కసుకుర్తి తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోని మనవాళ్ళకు అవసరమైన సేవ, సహాయ కార్యక్రమాలను నిరంతరం చేస్తూనే ఉంటానని అన్నారు. కాగా, కృష్ణాజిల్లాకు చెందిన పలువురు ప్రముఖులు, ఇతరులు, వీరవల్లి గ్రామస్థులు రాజా కసుకుర్తికి అత్యున్నత పదవి లభించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అమెరికాలోని పలువురు మిత్రులు, తానా నాయకులు ఆయనకు అభినందనలు తెలియజేశారు.