BRS MLA Tickets : ప్చ్.. అభ్యర్థుల ప్రకటనకు మళ్లీ టైమ్ మార్చేసిన కేసీఆర్..!
ABN , First Publish Date - 2023-08-21T12:53:45+05:30 IST
అవును.. అదిగో ఇదిగో బీఆర్ఎస్ తొలి జాబితా (BRS First List) వచ్చేస్తోంది.. మరికొన్ని గంటల్లో రిలీజ్ కానుంది.. నేడే విడుదల.. అని ప్రగతి భవన్‌లో (Pragathi Bhavan) జరిగిన హడావుడి అంతా ఇంతా కాదు. మరోవైపు.. సరిగ్గా 12.03 నుంచి 12:50 నిమిషాల మధ్యలో ప్రకటన ఉంటుందని బీఆర్ఎస్ వర్గాలు (BRS) చెప్పుకున్నప్పటికీ ఇంతవరకూ చలీచప్పుడు లేదు..
అవును.. అదిగో ఇదిగో బీఆర్ఎస్ తొలి జాబితా (BRS First List) వచ్చేస్తోంది.. మరికొన్ని గంటల్లో రిలీజ్ కానుంది.. నేడే విడుదల.. అని ప్రగతి భవన్‌లో (Pragathi Bhavan) జరిగిన హడావుడి అంతా ఇంతా కాదు. మరోవైపు.. సరిగ్గా 12.03 నుంచి 12:50 నిమిషాల మధ్యలో ప్రకటన ఉంటుందని బీఆర్ఎస్ వర్గాలు (BRS) చెప్పుకున్నప్పటికీ ఇంతవరకూ చలీచప్పుడు లేదు. ఆలస్యమయ్యే కొద్దీ ఆశావహులు, సిట్టింగుల్లో టెన్షన్ కాస్త హై టెన్షన్ అయ్యింది. ఆఖరి నిమిషం వరకూ ఆశావహులు మాత్రం తాము చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తూనే ఉన్నారు. తాజాగా అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మధ్యాహ్నం 01:30 గంటల తర్వాత అభ్యర్థుల ప్రకటన ఉంటుందని తెలియవచ్చింది. మరోవైపు.. 02:30 గంటలకు సీఎం కేసీఆర్ ప్రకటన చేస్తారని కూడా కొందరు మంత్రులు చెబుతున్నారు. పంచమి తిథి కావడం, పైగా శుభ ముహూర్తం కూడా ఉండటంతో ఎంత మంది సిట్టింగులు అసంతృప్తి చెందినా.. ఆశావహులకు భంగం కలిగినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో ప్రకటన చేయాల్సిందేనని కేసీఆర్ సర్వం సిద్ధం చేసుకున్నారట.
నేడే విడుదల కానీ..?
పక్కాగా నేడే జాబితా విడుదల కానీ సమయం మాత్రమే మారింది. మొదటి జాబితాలో 80 నుంచి 87 మంది అభ్యర్థుల పేర్లు ఉంటాయని తెలియవచ్చింది. ఇందులో 20 నుంచి 25 మంది సిట్టింగులకు టికెట్లు ఇవ్వట్లేదని తేలిపోయింది. అయితే ఇవాళ రిలీజ్ అయ్యే జాబితాలో మాత్రం 10 మంది సిట్టింగుల పేర్లు ఉండవట. అయితే ముగ్గురు మాత్రం కొత్త ముఖాలు ఈ జాబితాలో ఉంటాయట. ఇక రెండో జాబితా మాత్రం ఈనెల 25న విడుదలయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. మరోవైపు గులాబీ రాజకీయం మాత్రం రచ్చ కెక్కుతూనే ఉంది. అసంతృప్తులు, ఆశావహులు, ఇంకొందరు సిట్టింగులు ఏకంగా మంత్రి హరీష్ రావుకే వార్నింగ్ ఇస్తున్న పరిస్థితి. టికెట్ వస్తే సరే లేకుంటే అంతు చూస్తామని.. సిద్ధిపేటలో మంత్రిని ఓడిస్తామని కూడా శపథాలు చేస్తున్నారు. మరికొందరైతే సార్‌కు అన్నీ తెలుసని.. కచ్చితంగా టికెట్ ఇచ్చి తీరుతారని జాబితాలో తమ పేరు ఉంటుందని వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. అభ్యర్థుల ప్రకటన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందనేది ఎవరికీ ఊహకందట్లేదు.
ప్రగతి భవన్ చుట్టూ..!
సిట్టింగులు, ఆశావహులు మాత్రం ప్రగతి భవన్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ప్రకటన ఎప్పుడెప్పుడు వస్తుందా అని వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. ఇక మంత్రి కేటీఆర్ హైదరాబాద్‌లో అందుబాటులో లేకపోవడంతో ఎమ్మెల్సీ కవిత, మంత్రి హరీష్ రావుల ఇంటికి సిట్టింగులు, ఆశావహులు క్యూ కట్టారు. ‘ఎలాగైనా సరే బాపుకు చెప్పి ఈ ఒక్కసారికి టికెట్ ఇప్పించండి మేడమ్’ అని విన్నపాలు చేస్తున్నారు. రేఖా నాయక్, ఎన్.సంజయ్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎల్.రమణ, సునీతా లక్ష్మారెడ్డి, బొంతు రామ్మోహన్, చంద్రావతి, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్‌లు కవితను కలిసిన వారిలో ఉన్నారు. మరోవైపు.. ముత్తిరెడ్డి, మధుసూధనాచారి ఇద్దరూ సీఎం కేసీఆర్‌ను కూడా ప్రగతి భవన్‌లో కలిశారు. దీంతో ఈ ఇద్దరికీ చాన్స్ ఇచ్చే అవకాశం ఉందని ప్రగతి భవన్ వర్గాలు చెబుతున్నాయి. మొదటి జాబితాలో ఎవరెవరి పేర్లు ఉంటాయి..? సిట్టింగుల్లో ఎవరెవరు ఉంటారు..? ఆశావహుల్లో ఎంత మందికి టికెట్లు దక్కుతాయి..? మొదటి జాబితాలో ఉండే.. ఉండని నియోజకవర్గాలు ఏంటి..? అనేదానిపై సిట్టింగులు, ఆశావహులు, వారి అభిమానులు, అనుచరుల్లో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. 01:30 తర్వాత ఏం జరుగుతుందో చూడాలి మరి.