SRIKAKULAM: వైసీపీ నేతల తీరు మారకపోతే 2024 ఎన్నికల్లో..ఆ ఫలితాలే పునరావృతం అవుతాయంటూ హెచ్చరికలు
ABN , First Publish Date - 2023-03-24T12:14:50+05:30 IST
ఏ పార్టీకైనా కార్యకర్తలే కీలకం.. కార్యకర్తను విస్మరించే పార్టీలకు మనుగడ కష్టమన్నది నగ్న సత్యం. అధికారం వచ్చిన తర్వాత భోగాలు అనుభవించే నేతల కన్నా ఆది నుంచీ పార్టీ జెంఢా మోసే కార్యకర్తకు
ఆ జిల్లా అధికార పార్టీలో క్యాడర్, లీడర్ మధ్య గ్యాప్ ఎందుకు పెరుగుతోంది? పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డ కార్యకర్తలు కీలక నేతల తీరుపై ఎందుకు మండిపడుతున్నారు? అసలు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల నేపధ్యంలో ఆ జిల్లా అధికార పార్టీలో బయటపడుతున్న లుకలుకలు ఏంటి? ఇంతకీ ఆ జిల్లా ఏది? అక్కడ అధికార పార్టీలో జరుగుతున్న కీలక పరిణామాలేంటి? అనే మరిన్ని విషయాలను ఏబీఎన్ ఇన్సైడ్లో తెలుసుకుందాం..
ఆ పార్టీకి ప్రతికూల ఫలితాలు తప్పవు..
ఏ పార్టీకైనా కార్యకర్తలే కీలకం.. కార్యకర్తను విస్మరించే పార్టీలకు మనుగడ కష్టమన్నది నగ్న సత్యం. అధికారం వచ్చిన తర్వాత భోగాలు అనుభవించే నేతల కన్నా ఆది నుంచీ పార్టీ జెంఢా మోసే కార్యకర్తకు గుర్తింపు ఇవ్వకపోతే ఆ పార్టీకి ప్రతికూల ఫలితాలు తప్పవు..శ్రీకాకుళం జిల్లా అధికార వైకాపాలో ఇపుడు ఇదే చర్చ జరుగుతోందట. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత ఏ ఇద్దరు అధికార పార్టీ నేతలు కలిసినా జిల్లా పార్టీలో జరుగుతున్న పరిణామాలపైనే మట్లాడుకోవటం హాట్ టాపిక్ గా మారింది.
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 2019 ఎన్నికల్లో పదింట ఎనిమిది స్ధానాల్లో వైకాపాకు ప్రజలు పట్టం కట్టారు. ఒక్క ఛాన్స్ పేరుతో జగన్ పడిన ఆరాటం.. రాజశేఖర్ రెడ్డిపై ఉన్న అభిమానం ఇలా ఏది ఏమైనా ఆ పార్టీ గెలుపుకు అనేక అంశాలు కలిసివచ్చాయి. అయితే అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడుస్తున్నా జిల్లాలో నిజమైన కార్యకర్తలకు సరైన గుర్తింపు లభించటంలేదనే ఆవేదన ఎక్కువగా కనిపిస్తోందట. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి.. నిత్యం ఎమ్మెల్యేలు, మంత్రులు ఇళ్ల వద్ద రాజరాజ..రాజ మార్తాంఢ అంటూ బాకాలూదే నేతలకే పదవులు కట్టబెడుతున్నారనే చర్చ సిక్కోలు వైకాపాలో సాగుతోందట.
అయ్యా ఇపుడైనా కార్యకర్తల మాట వినండి
శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన ప్రసాధరావు, సిదిరి అప్పలరాజులు మంత్రులుగా ఉన్నారు.తమ్మినేని సీతారాం సభాపతిగా వ్యవహరిస్తున్నారు. అయితే ముఖ్య నేతలంతా తమతమ పదవులను కాపాడుకోవటానికి ఆరటమే తప్పా కార్యకర్తలను పట్టించుకోవటం లేదనే విమర్శలు ఇటీవల ఎక్కువయ్యాయి. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత కార్యకర్తలు తమ ఆవేదనను సోషల్ మీడియా వేధికల్లో బయటపెడుతున్నారట. అయ్యా ఇపుడైనా కార్యకర్తల మాట వినండి అంటూ అభ్యర్ధిస్తున్నారట. కొంతమంది అయితే ఓ అడుగు ముందుకేసి నేతల తీరు మారకపోతే 2024 ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే పునరావృతం అవుతాయంటూ హెచ్చరికలు సైతం చేస్తున్నారట...ప్రతి విషయానికీ వాలంటీర్ వ్యవస్ధపైనే ఆధారపడి గ్రామ స్ధాయి కార్యకర్తను ప్రక్కన పెట్టేస్తున్నారంటూ క్యాడర్ రగిలిపోతున్నారు.
క్యాడర్ లీడర్ మధ్య గ్యాప్ రోజురోజుకూ పెరిగిపోతోంది
శ్రీకాకుళం అధికార పార్టీలో క్యాడర్ లీడర్ మధ్య గ్యాప్ రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇటీవల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల నమోధులో మొత్తం బాధ్యతలు వాలంటీర్లకు అప్పగించి నేతలు చేతులు దులుపుకున్నారు. అధికారంలో ఉన్నాం కధా.. గెలుపు మనదే అని భావించిన జిల్లా ముఖ్య నేతలంతా తడి బట్ట వేసుకుని మరీ పడుకున్నారట. అయితే కందకు లేని దురద కత్తికి మాత్రం దేనికి అన్నట్టు ద్వితీయ శ్రేణి నేతలు సైతం పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలను లైట్ తీసుకున్నారు. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు నేతలకు చుక్కులు చూపించాయి.మరోవైపు గ్రామ స్ధాయిలో ఎం.పి.టి.సిలు, సర్పంచ్ ల ఉనికి ప్రశ్నార్ధకంగా మారుతోంది. గ్రామాల్లో వాలంటీర్లే కీలకంగా మారటంతో పదవులు ఉండి కూడా నేతలు రబ్బరు స్టాంపులుగా మారుతున్నారనే చర్చ జరుగుతోంది. ఇలాంటి పరిస్ధితుల నేపథ్యంల సిక్కోలు అధికార పార్టీ పరిణామాలు ఎలాంటి పరిస్ధితులకు దారి తీస్తాయో చూడాలి మరి.