Karnataka: జీవించి ఉన్న మాజీ సీఎంలలో కర్ణాటక రికార్డ్ !
ABN , First Publish Date - 2023-05-10T17:24:07+05:30 IST
బెంగళూరు: అప్పటి మైసూరు రాష్ట్రానికి పనిచేసిన సీఎంలను పక్కనబెడితే, కర్ణాటకగా పేరు మార్పు జరిగిన అనంతరం సీఎం పదవిని చేపట్టి వారిలో 8 మంది మాజీ సీఎంలు నేటికీ జీవించి ఉండి ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఒక ప్రత్యేకమైన రికార్డుని కలిగి ఉంది... ఈ మాజీ సీఎంలలో ఇద్దరు మరోసారి సీఎం పదవి కోసం పోటీ పడుతున్నారు.
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు (Karnataka Elections) ఈసారి గతంలో ఎన్నడూ లేనంత ఉత్కంఠ కలిగిస్తున్నాయి. రాష్ట్రానికి 18వ సీఎంగా ఎవరు పగ్గాలు చేపట్టబోతున్నారనే ఉత్సుకత నెలకొంది. బీజేపీ వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందా? ఆనవాయితీగా రెండుసార్లు వరుసగా ఏ పార్టీకి అధికారం కట్టబెట్టని కర్ణాటక ఓటర్లు ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించున్నారా? అనే ప్రశ్నలకు ఓటింగ్ పూర్తయి, బ్యాలెట్ బాక్సులు తెరుచుకున్న తరువాతే సమాధానం దొరకనుంది. 1973 వరకూ మైసూరు రాష్ట్రంగానే అందరికీ సుపరిచితమైన కర్ణాటక ఆ తర్వాత పేరు మార్చుకుంది. అప్పటి మైసూరు రాష్ట్రానికి పనిచేసిన సీఎంలను పక్కనబెడితే, కర్ణాటకగా పేరు మార్పు జరిగిన అనంతరం సీఎం పదవిని చేపట్టి వారిలో 8 మంది మాజీ సీఎంలు నేటికీ జీవించి ఉండి ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఒక ప్రత్యేకమైన రికార్డుని కలిగి ఉంది... ఈ మాజీ సీఎంలలో ఇద్దరు మరోసారి సీఎం పదవి కోసం పోటీ పడుతున్నారు. ఆ విషయాల్లోకి ఓసారి వెళ్తే...
జీవించి ఉన్న మాజీ సీఎంలు ఎవరంటే...
1. బీఎస్ యడియూరప్ప
బీజేపీ సీఎంగా బీఎస్ యడియూరప్ప 2019 జూలై 26 నుంచి 2021 జూలై 28 వరకూ 2 సంవత్సరాల 2 రోజులు పనిచేశారు. అనంతరం ప్రస్తుత సీఎం బసవరాజ్ బొమ్మై (ఒక ఏడాది 263 రోజుల పదవీ కాలం) పగ్గాలు చేపట్టారు. యడియూరప్ప రాజీనామా అనంతరం ఆయన ఇక ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉండనున్నట్టు ప్రకటించారు. పార్టీ కోసం పనిచేస్తామని చెప్పారు. అంతకు ముందు 2018 మే 17 నుంచి మే 23 వరకూ 6 రోజుల పాటు ఆయన సీఎంగా పనిచేశారు. ఆ పైన 2008 మే 30 నుంచి 2011 ఆగస్టు 5 వరకూ బీజేపీ ముఖ్యమంత్రిగా 3 సంవత్సరాల 67 రోజులు ఆయన పనిచేశారు. 2007 నవంబర్ 12 నుంచి 19 వరకూ 7 రోజుల పాటు కూడా ఆయన సీఎంగా పనిచేశారు.
2.హెచ్‌డీ కుమారస్వామి
జనతాదళ్ సెక్యులర్ పార్టీ ముఖ్యనేత, మాజీ ప్రధాని దేవెగౌడ కుమారుడైన హెచ్‌డీ కుమారస్వామి 2018 మే 23 నుంచి 2019 జూలై 26 వరకూ ఏడాది 64 రోజుల పాటు సీఎంగా పనిచేశారు. 2006 ఫిబ్రవరి 3 నుంచి 2007 అక్టోబర్ 8 వరకూ ఏడాది 253 రోజులు జనతాదళ్ పార్టీ సీఎంగా కూడా ఆయన గతంలో పనిచేశారు. 2023 ఎన్నికల్లో ఆయన పార్టీ విజయం సాధిస్తే ఆయనే సీఎం అవుతారు.
3.సిద్ధరామయ్య
కాంగ్రెస్ దిగ్గజ నేతగా సిద్ధరామయ్యకి పేరుంది. 2013 మే 13 నుంచి 2018 మే 17 వరకూ ఆయన 5 సంవత్సరాల 4 రోజుల పాటు పూర్తికాలం సీఎంగా పనిచేశారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు సాధిస్తే మరోసారి సీఎం పదవిని ఆయన ఆశిస్తున్నారు.
4. జగదీష్ షెట్టార్
బీజేపీ నుంచి 2012 జూలై 12 నుంచి 2013 మే 13 వరకూ 305 రోజుల పాటు జగదీష్ షెట్టార్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. కర్ణాటక 15వ సీఎంగా పనిచేసిన జగదీష్ షెట్టార్ ఇటీవల బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. హుబ్బళ్ళి నుంచి ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా ఈసారి పోటీలో ఉన్నారు.
5.సదానంద గౌడ
కర్ణాటక 14వ సీఎంగా బీజేపీ నుంచి 2011 ఆగస్టు 5 నుంచి 2012 జూలై 12 వరకూ 342 రోజుల పాటు ఆయన పనిచేశారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వంలో కూడా కేబినెట్ మంత్రిగా పనిచేశారు.
6.ఎస్.ఎం.కృష్ణ
కర్ణాటక 10వ సీఎంగా కాంగ్రెస్‌కు చెందిన ఎస్.ఎం.కృష్ణ 1999 అక్టోబర్ 11 నుంచి 2004 మే 28 వరకూ 4 సంవత్సరాల 230 రోజులు పనిచేశారు. 2014 వరకూ లోక్‌సభ, రాజ్యసభ సభ్యుడిగా పలుమార్లు సేవలందించారు. ఒక పర్యాయం మహారాష్ట్ర గవర్నర్‌గానూ పనిచేశారు. 2023లో పద్మవిభూషణ్ అందుకున్నారు.
7.హెచ్‌డీ దేవెగౌడ
జనతాదళ్ సెక్యులర్ అధినేత, మాజీ ప్రధానమంత్రి అయిన హెచ్‌డీ దేవెగౌడ 1994 డిసెంబర్ 11 నుంచి 1996 మే 31 వరకూ ఒక ఏడాది 172 రోజుల పాటు కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేశారు. అనంతరం దేశ 11వ ప్రధానిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన కర్ణాటక నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.
8.ఎం.వీరప్ప మొయిలీ
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌కు చెందిన సీనియర్ నేత ఎం.వీరప్ప మొయిలీ 1992 నవంబర్ 19 నుంచి 1994 డిసెంబర్ 11 వరకూ 2 సంవత్సరాల 22 రోజులు కర్ణాటక సీఎంగా పనిచేశారు. కేంద్రంలోనూ మంత్రి పదవులు నిర్వహించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ఇన్‌చార్జిగా ఉన్నారు.