Bandi Sanjay: మారిన ‘బండి’ రూట్.. పవన్ కళ్యాణ్‌పై అప్పుడలా.. ఇప్పుడిలా..!!
ABN , First Publish Date - 2023-08-22T19:11:37+05:30 IST
గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్‌ను తక్కువ చేసి మాట్లాడిన బండి సంజయ్ ఇప్పుడు పవన్‌పై ప్రశంసలు కురిపించడంతో పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాభిమానం ఉన్న పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్రను వైసీపీ అడ్డుకోవడం హేయమైన చర్యగా బండి సంజయ్ అభివర్ణించారు.
తెలంగాణ మాజీ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రాజకీయం ఇప్పుడు ఏపీపై కేంద్రీకృతమైంది. సోమవారం నాడు ఆయన విజయవాడకు వచ్చి బీజేపీ ఓటర్ చేతన్ మహాభియాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. పనిలో పనిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను మచ్చిక చేసుకునేందుకు తనదైన స్టైలులో ప్రశంసల వర్షం కురిపించారు. దీంతో గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్‌ను తక్కువ చేసి మాట్లాడిన బండి సంజయ్ ఇప్పుడు పవన్‌పై ప్రశంసలు కురిపించడంతో పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్‌పై ఏమన్నారంటే..?
గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో తమకు పవన్ కళ్యాణ్ అవసరం లేదని అప్పటి తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అన్నారు. జనసేన రాజకీయాలు ఏపీలోనే చూసుకోవాలని హితవు పలికారు. ఏపీలోనే బీజేపీతో జనసేన పొత్తు అని.. తెలంగాణలో అసలు పొత్తు విషయమే ప్రతిపాదనకు రాలేదని మాట్లాడారు. దీంతో బండి సంజయ్ వ్యాఖ్యలపై జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నాయకుడిని అవమానించేలా మాట్లాడారని మండిపడ్డారు. కానీ ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. బండి సంజయ్ తెలంగాణలో పదవిని పోగొట్టుకుని పార్టీ ఆదేశాల మేరకు ఏపీ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. పూర్తిగా కాకపోయినా బీజేపీ ఓట్ల నమోదు కార్యక్రమం బాధ్యతలను తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తన ఉనికిని చాటుకునేందుకు పవన్ కళ్యాణ్‌పై ప్రశంసలు కురిపించారు. ఏపీలో పవన్‌కు చాలా ఫాలోయింగ్ ఉందని చెప్పుకొచ్చారు. అలాగే ప్రజాభిమానం ఉన్న పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్రను వైసీపీ అడ్డుకోవడం హేయమైన చర్యగా బండి సంజయ్ అభివర్ణించారు.
బండి మార్పులో కారణమేంటి?
మూడేళ్ల కిందట జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో బండి సంజయ్ తెలంగాణ బీజేపీకి అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ సమయంలో బండి సంజయ్ ఏది చెప్తే అదే ఫైనల్. ఆయన మాటే శాసనం. కానీ ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అయిన తరహాలో ప్రస్తుతం బండి సంజయ్‌కు బీజేపీలో ప్రాధాన్యం తగ్గింది. తెలంగాణ అధ్యక్షుడిగా ఆయన స్థానంలో కిషన్‌రెడ్డిని అధిష్టానం నియమించింది. దీంతో బండి పరిస్థితి అయోమయంగా తయారైంది. ఇప్పుడు అధిష్టానం ఆదేశాల మేరకు ఏపీ రాజకీయాల్లోకి రంగప్రవేశం చేశారు. దీంతో అధికార పార్టీ వైసీపీపై విమర్శలు చేశారు. తాగుబోతులను తాకట్టు పెట్టి అప్పు చేస్తున్న ఏకైక సర్కార్ జగన్ సర్కార్ అంటూ విమర్శించారు. మద్యాన్ని నిషేధిస్తామని హామీలు ఇచ్చి మద్యం బాండ్లు రిలీజ్ చేస్తారా అని ప్రశ్నించారు .డ్రగ్స్, గంజాయి, మద్యం, భూకబ్జాల దందాలతో జగన్ రాష్ట్రాన్ని దోచుకుతింటున్నారని ఘాటు విమర్శలు చేశారు. ఎలాగైనా మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 10 వేల ఓట్లకుపైగా నకిలీ ఓట్లను నమోదు చేసే పనిలో నిమగ్నమైందంటూ బండి సంజయ్ ఎద్దేవా చేశారు. జగన్ ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిందని.. వడ్డీ రూపంలోనే ఏటా రూ.50 వేల కోట్లు చెల్లిస్తున్నారని మండిపడ్డారు.
భూమనకు పుష్ప సినిమా చూపించాలి
తిరుమలలో జరుగుతున్న పరిణామాలపైనా బీజేపీ ఎంపీ, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ స్పందించారు. భక్తుల్లో అడుగడుగునా భయాందోళనలు సృష్టిస్తూ వాళ్లు తిరుమలకు రాకుండా చేస్తున్నారంటూ వైసీపీ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ మతంపై పెద్ద ఎత్తున దాడి జరుగుతోందని ఆరోపించారు. భక్తులను కాపాడలేక కర్రలిస్తారా అంటూ నిలదీశారు. వెంకటేశ్వర స్వామిని అవమానిస్తే పుట్టగతులుండవనే సంగతి గుర్తుంచుకోవాలని హితవు పలికారు. పనిలో పనిగా కొత్తగా నియమితులైన టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డిపైనా విమర్శలు చేశారు. అసలు కొత్త టీటీడీ ఛైర్మన్ ఎవరండీ... ఆయన బిడ్డ పెళ్లి క్రైసవ ఆచార పద్దతిలో చేసిన మాట నిజం కాదా అంటూ ప్రశ్నించారు. తాను నాస్తికుడని ఆయన గతంలో చెప్పలేదా? ఆయన రాడికల్ కాదా? అంటూ నిలదీశారు. సిగ్గు లేకుండా గతంలో తిరుమలలో అడవులే లేవంటూ టీటీడీ ఛైర్మన్ చెప్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి ఆయనకు ‘పుష్ప’ సినిమా చూపించాలని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
Kodali Nani: కొడాలి నాని యూటర్న్.. కాలమే గట్టి సమాధానం చెప్పిందంటున్న ఫ్యాన్స్
**************************************************************************************************