YCP Dirty Politics: ఉండవల్లి శ్రీదేవీనే వదల్లేదు.. ఇక సామాన్య మహిళలు ఓ లెక్కా.. మంత్రి అనేసిన మాట తెలిస్తే ఆవేశం పక్కా..!
ABN , First Publish Date - 2023-04-05T17:35:53+05:30 IST
ఏపీలో అధికార వైసీపీ నేతలను (YCP Leaders) ఓటమి భయం వెంటాడుతోందా..? ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు (AP MLC Election Results) ఇచ్చిన షాక్‌కు..
ఏపీలో అధికార వైసీపీ నేతలను (YCP Leaders) ఓటమి భయం వెంటాడుతోందా..? ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు (AP MLC Election Results) ఇచ్చిన షాక్‌కు ఫ్రస్ట్రేషన్ పీక్స్‌కు వెళ్లిపోయిందా..? ఓటేసిన ఓటర్లను, మహిళలను కించపరిచేలా వైసీపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు (YCP Minister Dharmana Prasada Rao) మాట్లాడటం వైసీపీ అసహనానికి అద్దం పడుతోందా..? శ్రీకాకుళం జిల్లాలో తాజాగా మంత్రి ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలు అధికార వైసీపీ నేతల అసహనం ఏ స్థాయిలో ఉందో స్పష్టం చేసింది.
‘ప్రభుత్వం డబ్బులు పంచుతుంటే.. జగన్ (CM Jagan) ఇంట్లో నుంచి ఏమైనా ఇస్తున్నారా? అని కొంతమంది మహిళలు అంటున్నారని, ఎవరైనా ఇంట్లోది ఇస్తామంటే.. వారి ఇంటికే వెళదాం. పథకాల ద్వారా డబ్బులు తీసుకుని కూడా సంస్కారవంతమైన మాట రాకపోతే ఎలా? పద్దుకుమాలిన (ఉత్తరాంధ్ర యాసలో పనికిమాలినవాళ్లు అని అర్ధం) ఆడవాళ్లే ఇలా మాట్లాడతారు’ అని మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు. మహిళలను శక్తిమంతులుగా మారుస్తున్న ప్రభుత్వానికి మరోసారి అధికారాన్ని అప్పగించాలని కోరారు. పథకాలు తీసుకుని ఓటు వేయకపోతే మీ చేతిని మీరు నరుక్కున్నట్లే అన్నారు.
శ్రీకాకుళంలోని పీఎస్ఎన్‌ఎం స్కూల్, రాగోలులో నిర్వహించిన ‘ఆసరా పంపిణీ’ కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలివి. మహిళలను పనికిమాలిన వాళ్లు అని ముందూవెనుకా ఆలోచించకుండా తూలనాడటం, ఓటేసిన ఓటర్లను బెదిరించే రీతిలో వైసీపీకి ఓటేయకపోతే పుట్టగతులు ఉండవన్నట్టుగా మంత్రి ధర్మాన బ్లాక్‌మెయిల్ చేయడం ఆయన ఫ్రస్ట్రేషన్ స్థాయిని సూచించిన పరిణామాలు. ధర్మాన ఇటీవల పదేపదే ఈ తరహా చౌకబారు వ్యాఖ్యలు చేస్తూ విమర్శల పాలవుతుండటం గమనార్హం. మహిళలనే కాదు ధర్మాన ప్రసాదరావు ఈ మధ్య మగవాళ్లను ఉద్దేశించి కూడా కించపరిచే రీతిలో మాట్లాడటం కొసమెరుపు. ‘‘మగవాళ్లు పోరంబోకులు.. తినేసి వెళ్లిపోతారు. వారికి బాధ్యతలు పట్టవు’’ అని మంత్రి ధర్మాన ప్రసాదరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
‘వైఎస్సార్ ఆసరా’ నిధుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళంలోని కిల్లిపాలెం, హడ్కోకాలనీల్లో ఆయన పర్యటించిన సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా రెండు చోట్ల మహిళలతో సమావేశం నిర్వహించారు. కిల్లిపాలెంలో మంత్రి ధర్మాన మాట్లాడుతూ.. ‘‘మగవాళ్లు పోరంబోకులు. ఇంటిని నడిపేది ఇల్లాలు. ఆమె పేరుతో ప్రభుత్వం పథకాలు అందిస్తోంది. ఈ ప్రభుత్వానికి మరోసారి అధికారం అప్పగించే అధికారం మీ చేతుల్లోనే ఉంది.’’ అని ధర్మాన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు విని అక్కడున్న వారు అవాక్కయ్యారు. మగవాళ్లను పోరంబోకులని అనడం ఏంటో అని విస్మయం వ్యక్తం చేశారు. జగన్ మహిళలకు అంత చేస్తున్నాడు, ఇంత చేస్తున్నాడని డప్పు కొట్టుకునే మైకంలో పడి.. మగాళ్లను పోరంబోకులన్న మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆయన కూడా మగాళ్లలో ఒకడన్న విషయాన్ని మర్చిపోవడం కొసమెరుపు.
అదేవిధంగా.. ఇటీవల గార మండలంలోని ఓ గ్రామానికి వెళ్లినట్టు మంత్రి చెప్పారు. అక్కడ ఓ మహిళను..ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా..?ఎవరిస్తున్నారు..? అని ప్రశ్నించినట్టు తెలిపారు. దానికి ఆమె.. ‘‘అన్ని పథకాలూ అందుతున్నాయి. జగన్ ఇస్తున్నారు’’ అని చెప్పిందన్నారు. దీంతో ‘‘మరి ఓటు ఎవరికి వేస్తావు.. అని అడగ్గా.. సైకిల్‌కు వేస్తాను అని చెప్పింది. ఆమెకు జగన్ ఇస్తున్న పథకాలు తెలుసు కానీ.. పార్టీ గుర్తు తెలియలేదు. చాలామంది ఇలానే ఉన్నారు. వీరికి పూర్తిగా అవగాహన కల్పించాలి’’ అని ధర్మాన కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. కానీ.. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఫలితాలతో ధర్మానలో ఓటర్లపై అసహనం కట్టలు తెంచుకోవడం గమనార్హం. మహిళలనే కనీస ఆలోచన లేకుండా మాట్లాడటం, ఓటర్లకు శాపనార్థాలతో బ్లాక్‌మెయిల్ చేయడం మంత్రి ధర్మానకే చెల్లిందని ప్రతిపక్ష టీడీపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది.
ఒక్క ధర్మాన మాత్రమే కాదు.. వైసీపీ ప్రజాప్రతినిధుల్లో మహిళలంటే కనీస గౌరవం లేనివాళ్లు చాలామందే ఉన్నారని తాజాగా వైసీపీ అనర్హత వేటు వేసిన ఉండవల్లి శ్రీదేవికి ఎదురైన చేదు అనుభవాలు స్పష్టం చేశాయి. ఈ తాడికొండ ఎమ్మెల్యేపై వైసీపీ అధిష్టానం వేటేసిన మరుక్షణం నుంచి ఆమెను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడమే వైసీపీ నేతలకు పనైపోయింది. అటు నీలి మీడియాలో, ఇటు సోషల్ మీడియాలో ఉండవల్లి శ్రీదేవిని అవమానించడమే పనిగా పెట్టుకుని పనిచేయడం శోచనీయం. వైసీపీ నేతలు ఆమెపై ఏ స్థాయిలో విషం కక్కారంటే.. ఆమె దాంపత్య జీవితంపై కూడా అవాకులుచవాకులు పేలారు.
ఉండవల్లి శ్రీదేవికి, ఆమె భర్త కమ్మెల శ్రీధర్‌కు గొడవలున్నాయని, ఇద్దరూ కలిసి ఉన్నట్టు మీడియా ముందు కలరింగ్ ఇస్తున్నారని రకరకాలుగా దిగజారిపోయి వైసీపీ సోషల్ మీడియాలో పనిగట్టుకుని ప్రచారం చేసింది. గతంలో పవన్ కల్యాణ్ పెళ్లిళ్ల అంశాన్ని ప్రస్తావిస్తూ.. రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని ఆయన మాజీ మొదటి భార్య పేరును, మాజీ రెండో భార్య గురించి సానుభూతి ముసుగులో అనవసరంగా ఎలా మహిళల జీవితాలను రోడ్డుకీడ్చారో ప్రత్యేకంగా చెప్పనక్కనర్లేదు. ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉందని వైసీపీ అధినేత జగన్ చెబుతున్నప్పటికీ వైసీపీ ఎమ్మెల్యేల, మంత్రుల అసహనం చూస్తుంటే ఈలోపు ఆ పార్టీ ఇమేజ్ మరింత డ్యామేజ్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.