Brahmanandam: నారాయణమూర్తిపై ప్రశంసల వర్షం.. చలన చిత్రం అనే సముద్రం వంక అందరు చూస్తే..
ABN , First Publish Date - 2023-02-06T18:52:17+05:30 IST
ప్రజా సమస్యలపై సినిమాలు తీసే నటుడు ఆర్. నారాయణ మూర్తి (R Narayana Murthy). తాజాగా ఆయన దర్శకత్వం వహించిన సినిమా ‘యూనివర్శిటీ’. స్నేహా చిత్ర పిక్చర్ బ్యానర్‌పై ఆయనే నిర్మించారు.
ప్రజా సమస్యలపై సినిమాలు తీసే నటుడు ఆర్. నారాయణ మూర్తి (R Narayana Murthy). తాజాగా ఆయన దర్శకత్వం వహించిన సినిమా ‘యూనివర్శిటీ’. స్నేహా చిత్ర పిక్చర్ బ్యానర్‌పై ఆయనే నిర్మించారు. ఈ సినిమా ప్రెస్‌మీట్‌ను హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్‌కు బ్రహ్మానందం (Brahmanandam) ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా నారాయణ మూర్తిపై ప్రశంసల వర్షం కురిపించారు. సమస్యలు ఉన్నంత కాలం, పేద ప్రజలు ఉన్నంత కాలం, వారి కష్టాలు ఉన్నంత కాలం నారాయణ మూర్తి ఉంటాడని చెప్పారు.
ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ.. ‘‘నారాయణమూర్తిపై నాకున్న ఇష్టం ఇవాళ్టిది కాదు. 35 సంవత్సరాల క్రితం నుంచి ఆయనతో నాకు మంచి పరిచయం ఉంది. మూడున్నర దశాబ్దాలుగా ఒక వ్యక్తి అప్పుడు ఎలా ఉన్నాడో.. ఇప్పుడూ అలానే ఉండటం ఒక అసాధారణమైన విషయం. స్నేహచిత్ర బ్యానర్ పెట్టి ఎన్నో సినిమాలను నిర్మించి, దర్శకత్వం వహించి అఖండ విజయాలను అందుకున్న వ్యక్తి నారాయణమూర్తి. ఎల్లప్పుడు ఆయన పని, ప్రజలు, పేద ప్రజలు అని ఆలోచిస్తుంటాడు. ఆయనకు ఇష్టమైన సబ్జెక్ట్ సమస్యలు. సమస్యలు ఉన్నంతకాలం, పేద ప్రజలు ఉన్నంతకాలం, వాళ్ల కష్టాలు ఉన్నంతకాలం నారాయణమూర్తి సినిమాలు ఉంటాయి. ఎప్పుడు ఆలోచిస్తాడో, సినిమాను ఎప్పుడు పూర్తి చేస్తాడో అనేది నాకేం అర్థం కాదు. సినిమా ఇండస్ట్రీలో కళాత్మకమైన దర్శకులు, వ్యాపారాత్మకమైన దర్శకులు, మహానుభావులైన దర్శకులు, అద్భుతమైన దర్శకులు ఉన్నారు. కానీ, ప్రజాదర్శకులు మాత్రం లేరు. ప్రజలనే ఆయుధంగా పెట్టి సినిమాలు తీసే వారు నారాయణమూర్తి. నేను చాలా సార్లు ఆయన సినిమాలో నటిస్తానని అడిగాను. కానీ, ఛాన్స్ మాత్రం ఇవ్వలేదు. మళ్లీ కనిపిస్తేనే మాట్లాడుతారు’’ అని బ్రహ్మానందం తెలిపారు.
‘‘చలన చిత్రం అనే సముద్రం వంక అందరు చూస్తే.. ఆ సముద్రం నారాయణ మూర్తి వైపు చూస్తుంది. నేను చెప్పే మాటల్లో ఏమైనా అతిశయోక్తి ఉంటే ఇక్కడే ఎవరైనా నా కాలర్ పట్టుకుని నన్ను అడగండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నల్లజుట్టు ఉన్నప్పటి నుంచీ నారాయణమూర్తి నాకు తెలుసు. ఇదే నారాయణమూర్తి, ఇదే ప్రవాహం, ఇవే చెప్పులు, ఇదే డ్రెస్సు, ఇదే తిరుగుడు, ఇదే మాట, ఇదే మంచి. ఎవరిని చూసినా వాళ్లలో మంచిని పట్టుకోవడానికి ప్రయత్నం చేసే మంచి వ్యక్తి నారాయణమూర్తి. ఆయనకు సినిమా మాత్రమే తెలుసు. నమ్ముకున్న సిద్దాంతాన్ని కళ్లకు గంతలు కట్టి.. గుర్రం ఎలాగైతే పరిగెత్తి గమ్యాన్ని చేరుకుంటుందో.. పుట్టినప్పుడు బిడ్డ ఎలా ఉన్నాడో పెరుగుతున్నప్పుడు కూడా నారాయణమూర్తి అలానే ఉన్నారు’’ అని బ్రహ్మానందం పేర్కొన్నారు.