Pawan kalyan: అన్నయ్య నుంచి నేర్చుకున్నవి.. వద్దనుకున్నవి ఇవే!
ABN , First Publish Date - 2023-02-10T00:51:28+05:30 IST
‘సినిమాల (Pawankalyan) వల్ల ఓవర్‌నైట్ స్టార్ కావచ్చేమో... అనుకోగానే అద్భుతాలు జరగవు. రాత్రికి రాత్రి అసలు జరగవు. ఏ రంగంలోనైనా అలా జరగాలంటే దశాబ్ధాల కష్టం ఉండాలి. ప్రజల నమ్మకం కలగాలంటే చాలా సమయం పడుతుంది’’ అని అన్నారు జనసేన అధ్యక్షుడు, నటుడు పవన్‌కల్యాణ్.
‘‘సినిమాల (Pawankalyan) వల్ల ఓవర్‌నైట్ స్టార్ కావచ్చేమో... అనుకోగానే అద్భుతాలు జరగవు. రాత్రికి రాత్రి అసలు జరగవు. ఏ రంగంలోనైనా అలా జరగాలంటే దశాబ్ధాల కష్టం ఉండాలి. ప్రజల నమ్మకం కలగాలంటే చాలా సమయం పడుతుంది’’ అని అన్నారు జనసేన అధ్యక్షుడు, నటుడు పవన్‌కల్యాణ్. ఆహా ఓటీటీలో (aha show)జరుగుతున్న సెలబ్రిటీ టాక్ షో ‘అన్‌స్టాపబుల్’ సీజన్ 2(unstoppable 2)కు ఆయన అతిథిగా హాజరయ్యారు. బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షోకు సంబంధించిన రెండో ఎపిసోడ్ గురువారం రాత్రి స్ర్టీమింగ్ అయింది. ఈ షోలో పవన్‌కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నమ్మకాన్ని సంపాదించుకునే పనిలో ఉన్నా... (pawan kalyan About Chiranjeevi)
ఒళ్లు దాచుకోకుండా కష్టపడేతత్వాన్ని అన్నయ్య చిరంజీవి నుంచి నేర్చుకున్నా. చిన్నతనంలో ఆయన పడిన కష్టాన్ని ప్రతి క్షణం కళ్లారా చూశాను. అందుకే ఆయనలా కష్టపడటం నేర్చుకున్నా. రాజకీయాల్లో విమర్శలను కచ్చితంగా స్వీకరించాలి. ఏ విమర్శనైనా భరించాలనే విషయాన్ని ఆయన నుంచే నేర్చుకున్నా. సద్విమర్శ వల్ల మనలోని లోపాలు తెలుస్తాయి. మనల్ని మనం సరి చేసుకునే అవకాశం ఉంటుంది. మొహమాటం అన్నది అన్నయ్య నుంచి తీసుకోలేదు. ఆయనకు మొహమాటం ఎక్కువ. దాంతో విమర్శించిన వారిని కూడా ఆయన ఏమీ అనలేరు. అది మాత్రం వద్దనుకున్నా. నటుడిగా అభిమానించడం వేరు.. అది ఓటుగా మారడం వేరు. సినిమా రంగంలో ఎవరైనా ఎక్కువ మంది అభిమానుల్ని సంపాదించుకుని, ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే దాని వెనుక దశాబ్దాల కృషి ఉంటుంది. సినీ పరిశ్రమలో పేరున్న వ్యక్తి రాజకీయ రంగంలోకి ప్రవేశించి, అంతటి నమ్మకం పొందాలంటే సమయం పడుతుంది. రాత్రికి రాత్రే అద్భుతాలు జరగవు. ప్రస్తుతానికి నేను నమ్మకాన్ని సంపాదించుకునే పరిస్థితిలోనే ఉన్నా.
అధికార యంత్రాంగం హద్దు దాటింది... (Paw an about ap politics)
విశాఖపట్నం పర్యటన సమయంలో జరిగిన ఘటన గురించి పవన్ మాట్లాడారు. ‘‘నేను ఓ అడుగు వేసినా, మాట్లాడిన ఏపీ ప్రభుత్వానికి ఇబ్బందిగా ఉంది. నేను మామూలుగా చూసిన చూపునకు కూడా వారు వేరే అర్థం తీసుకుంటున్నారు. నేను వైజాగ్ వెళ్లకూడదని ఎన్నో కుట్రలు చేశారు. కానీ, వాళ్లతో పోటీ పెట్టుకోలేదు. వారి ఆలోచన ఏంటో తెలియదుగాని సభ జరుగుతుంటే లైట్ ఆపేయడం లాంటివి చేశారు. అవన్నీ సహజమేగానీ అధికార యంత్రాంగం కూడా హద్దులు దాటింది. అమాయకులను ఇబ్బంది పెట్టారు. ఓ ఆడపడుచుపై హత్యాయత్నం కేసులు పెట్టారు. ఆదిపత్య ధోరణి అది. ఎవరూ నోరెత్తకూడదంటే ఎలా? నేను నోరెత్తుతా.. అది ప్రజలకు చేరుతుందన్న ఇబ్బంది వారికి ఉందనుకుంటా. అయితే, నేను దాన్ని రాజకీయంలో భాగంగానే చూస్తా’’ అని పవన్ అన్నారు.
చాలా కాలం తర్వాత కొంచెం తిక్క రేగింది
‘‘ఇప్పటం గ్రామం వెళ్లేటపుడూ అలానే చేశారు. ‘మీరు అక్కడికి వెళ్లకూడదు. వెళ్తే గొడవ చేస్తారు’ అంటూ పోలీసులు నన్ను అడ్డుకున్నారు. బాధితులను పరామర్శించడం నా ప్రాథమిక హక్కు’ అని చెప్పా. రోడ్డుపై నడవకూడదు, కారులోంచి బయటకు రాకూడదు, రూమ్‌లో నుంచి బయటకు రాకూడదు. కిటికీ లోంచి చూడకూడదు ఇలాంటి రూల్స్ పెట్టారు. దాంతో చాలాకాలం తర్వాత నాకు కొంచెం తిక్క రేగింది. అందుకే ఎవరు ఆపుతారో చూద్దాం అంటూ కారుపైకి ఎక్కి కూర్చొన్నా. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేను నడుస్తా. ఎన్ని కేసులైనా పెట్టుకోండి నేను వెళ్తా అన్న విధానంలో అక్కడికి వెళ్లా.
అలా అందరి విషయంలో జరగదు.. (NTR MGR)
‘‘నల్గొండ జిల్లాలో ఒకప్పుడు ఫ్లోరోసిస్ సమస్య తీవ్రంగా ఉండేది. అక్కడ ఓ గ్రామాన్ని దత్తత తీసుకుని, రక్షిత మంచి నీటిని అందించాలనుకున్నా. దాని కోసం కొంతమందిని అక్కడికి పంపితే స్థానిక రాజకీయ గ్రూపులు అడ్డుకున్నాయి. మంచి చేయడానికి కూడా అడ్డంకులు ఉంటాయా? అనిపించింది. ఎన్జీవో ప్రారంభించాలనుకున్నా. తర్వాత నా ఆలోచనా పరిధికి ఎన్జీవో సరిపోదనిపించింది. ఇంకా పెద్దగా ఏదో చేయాలనుకున్నా. అలా రాజకీయ పార్టీ పెట్టాం. నేను ఓ ఆలోచనతో ఉన్నా. అదే సమయంలో.. ఓసారి కలవాలంటూ నరేంద్ర మోదీ గారి నుంచి నాకు కబురు వచ్చింది. మార్చిలో పార్టీ పెట్టాం. ఎన్నికలు ఏప్రిల్‌లో వచ్చాయి. ఫిల్మ్ ఇండస్ర్టీలో ఉండే స్టార్‌డమ్ పాలిటిక్స్‌లో వచ్చేస్తుందని చాలామంది అనుకుంటారు. అలా ఎన్టీఆర్, ఎంజీఆర్ గారి విషయంలోనే జరిగింది.అలందరికీ అలా జరుగుతుందని లేదు. ఆ స్పష్టత నాకుంది. ఓ స్థాయిలో ఉండి కిందకు పడిపోయినా మళ్లీ అక్కడ నుంచి మొదలు పెట్టేందుకు నేను సిద్థంగా ఉన్నా. నాకు పాలిటిక్స్ నేర్చుకోవాలనుంది.