valentine week 2023 : మతానికి అతీతంగా, స్వేచ్ఛగా జీవించాలని చూస్తే..!

ABN , First Publish Date - 2023-02-14T19:03:22+05:30 IST

ఒకచోట ప్రేమించలేదని యాసిడ్ దాడి జరిగిందంటే అది పిల్లల పెంపకం సరిగా లేకపోవడమే..

 valentine week 2023 : మతానికి అతీతంగా, స్వేచ్ఛగా జీవించాలని చూస్తే..!
valentine week 2023

అవి 1992 సరిగ్గా బాబ్రీ మసీదు సంఘట జరుగుతున్నప్పటి రోజులు. అదే సమయంలో పెర్క కొండారం మండలం, శాలి గౌరారం జిల్లా, నల్లగొండలో ఈ ప్రేమ ముదిరి పాకానపడింది. స్నేహం ప్రేమగా మారినంత సులువైతే కాలేదు‌ పెద్దల్ని ఒప్పించడం. కులాంతర వివాహమే ఎరుగని ఊరివాళ్ళకు మతాంతర వివాహం అనేసరికి ఆశ్చర్యం, విస్మయం రెండూ కలిగాయి. ఊరి రచ్చబండల మీద కొన్నాళ్ళు ఈ ప్రేమ అట్టుడికి పోయింది. మతాలు వేరనే కారణంగా పెద్దవాళ్లు పెళ్ళికి ససేమిరా అనేసరికి, ఈ ప్రేమ, పెళ్ళి వరకూ వెళ్ళడానికి స్నేహితులే సాయం చేశారు. మూడుసార్లు పెళ్ళి ప్రయత్నాలు వాయిదా పడ్డాయి. ఇన్ని నాటకీయ పరిణామాల మధ్య పెళ్ళితో కథ సుఖాంతం అయిందనుకుంటే పొరపాటే..

రెడ్డి కుటుంబం అమ్మాయి, ముస్లిం అబ్బాయి ఈకథలో మతమే విలన్ అయింది. ఇంటి పరువు పోయిందని పద్నాలుగేళ్ళపాటు అల్లుణ్ణి దూరం పెట్టింది అమ్మాయి కుటుంబం. ముఫ్ఫై ఏళ్ళ వివాహ బంధాన్నిఆనందంగా, అడుగులో అడుగై దాటేసిన ఈ ఆదర్శ దంపతులు, తమలా మతాంతరం, కులాంతర వివాహాలు చేసుకునేవారికి అండగా నిలుస్తున్నారు. వారే వహీద్, జ్యోతి కులనిర్మూలన సంఘనికి అధ్యక్షలుగా ఉంటూ, ఎందరో ప్రేమ జంటలకు పెళ్ళనే బంధాన్ని ఏర్పరుచునేందుకు తోడవుతున్నారు. ఆంధ్రజ్యోతి వెబ్ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా అందిస్తున్న ఈ ప్రేమకథ మీకోసం...

1. ఇద్దరికీ పరిచయం ఎక్కడ జరిగింది? పెళ్ళి వరకూ సాగిన మీ ప్రేమ ప్రయాణం గురించి చెప్పండి?

మా ఇద్దరిదీ ఒకే గ్రామం, మా కుటుంబాల మధ్య కూడా తరతరాల నుంచి స్నేహం ఉంది. చదువుకునే రోజుల్లో నేను PDSC లో యాక్టివ్ గా ఉండేవాడిని. కులం, మతం లేకుండా మనుషులు ఉండలేరా? పేర్లకు ముందు కులం తగిలించుకోవడం, మతానికి ప్రాముఖ్యత ఇవ్వడం అనేది ఎందుకో నచ్చేది కాదు. ఈ పద్ధతి మారితే బావుండును అనే ఆలోచన వచ్చేది. నా ఆలోచనలన్నీ జ్యోతితో పంచుకునేవాడిని, నెమ్మదిగా ఈ పరిచయమే జ్యోతి మీద ప్రేమగా మారింది. నా అభిప్రాయాన్ని ఆమెకు చెప్పాను. ఆమె కూడా తనకు నేనంటే ఇష్టమని చెప్పింది. ఇదే విషయాన్ని మా ఇళ్ళల్లో చెప్పినప్పుడు చాలా గందరగోళం ఏర్పడింది. వాళ్ళు మా పెళ్ళితో సమాజంలో ఎదురయ్యే పరిస్థితుల గురించి చాలా ఆలోచించారు. మొత్తానికి మతం కారణంగా మా ప్రేమను అంగీకరించలేమని తేల్చేసారు. అనేక మలుపులతో ఇంటిలో మనశ్శాంతి లేకుండా పోతున్నప్పుడు ఇక ఈ సంగతి తేలేలా లేదని చెప్పి ఇంటి నుంచి బయటకు వచ్చేసి కులనిర్మూలన సంఘం సహాయంతో వివాహం చేసుకున్నాం. అక్కడ మాకు సహకరించింది మా స్నేహితులు డాక్టర్ బండి సాయన్న, గండమల్ల వినోదారావు, గాజుల శ్రీధర్, అక్కిరాజు దుర్గా ప్రసాద్ వీళ్ళ సమక్షంలోనే మా వివాహం జరిగింది.

67.gif

2. మీ మతం కాదు, అందులోని సాంప్రదాయాలు, తీరుతెన్నులు వేరు, ఆ ఇంట్లో కోడలిగా మనగలగాలంటే వాటిని పాటించి తీరాలనే ఆంక్షలేమైనా విధించారా?

మగవాళ్ళకన్నా ప్రేమ విషయంలో స్త్రీ ఎక్కువ నలిగిపోతుంది. అలా నేను మా ఇంట్లో పరిస్థితులతో చాలా పోరాడాను. మా నాన్నగారు కుటుంబంలో పెద్ద, నాన్న చిన్నతనంలో తల్లిని పోగొట్టుకోవడం వల్ల తమ్ముళ్ళ బాధ్యతంతా మా నాన్న మీదనే ఉండేది. ఇక కులపరంగా కూడా పెద్దరికంగా ఊరి వ్యవహారాల్లో తిరిగేవారు. అందులోనూ ఇద్దరం ఒకే గ్రామానికి చెందినవాళ్ళం కావడం, ఇంకో విషయం ఏంటంటే మాది ఆధిపత్య కులం కావడం కూడా ఒక కారణం అయింది. వ్యక్తిగా ఆయనను (వహీద్) ఒప్పుకున్నారు, మంచిమనిషని అభిమానించారు కానీ మతం పరంగా ఒప్పుకోలేదు. అయితే నేను వాళ్ళను తప్పు బట్టను, తల్లిదండ్రుల ఆలోచనలు అలా ఉన్నాయంటే చుట్టూ ఉన్న సమాజం అలా ఉంది. కాకపోతే జీవితంలో నిలబడడానికి చాలా ఫైట్ చేశాం. ఇలాంటి మతాంతర పెళ్ళిలో పెళ్ళికి ముందు పెళ్ళి తరువాత కూడా సమస్యలుంటాయి. అదే సినిమాల్లో తీసుకుంటే పెళ్ళి కాగానే శుభం కార్డ్ పడుతుంది. నిజజీవితంలో ఒక ఇద్దరు ఇష్టపడి వేరు వేరు కులాలు, మతాలకు చెందిన వారు బ్రతకాలనుకుంటే ప్రతిదానికీ తప్పుబడుతూ ఉంటారు, మీరు ఇలా ఉంటే ఎట్లా, అలా ఉంటే ఎట్లా అని, అంతేకాదు నాకు చిన్నతనం నుంచి సాంప్రదాయమైన పెళ్ళిళ్ళ మీద కొంత వ్యతిరేకత ఉండేది. నా కుటుంబం అదే మూసలో వెళిపోయేది. ఇక అత్తింటి కుటుంబం నిఖా చేసుకోవాలి, మతం మారాలని చాలా ఆశించారు. కానీ నేను ఎప్పుడూ ఒప్పుకోలేదు. "నువ్వు మా ఇస్లాంలోకి మారలేదు, నువ్వు మా ఇస్లాం మత ప్రకారం పెళ్ళి చేసుకోలేదు కాబట్టి.."తెరె బచ్ఛే హారామ్" అన్నారు. అంటే నీ పిల్లలు పాపులవుతారనే అర్థం వచ్చేలా మాట్లాడారు. ఆ మాటలను కూడా మేం ధైర్యంగానే ఎదిరించాం. పిల్లలకి కావలసింది మతం కాదు, సంస్కారం.

ఒక్క ముస్లిం మతమనే కాదు అన్ని మతాల్లోనూ ఇలాగే ఉంది. ప్రతి మనిషీ, ఏదో ఒక మతం అవలంబించాలి. మతానికి అతీతంగా, కట్టుబాట్లను ధిక్కరించి, స్వేచ్ఛగా జీవించాలని చూస్తే అది నేరమే అవుతుంది. అలా ధిక్కరించి బ్రతకకూడదనే ధోరణి అందరిలోనూ ఉంది.

ఇదికూడా చదవండి: ఇప్పుడంతా మ్యాగీ చేసినంత ఫాస్ట్‌గా జరిగిపోవాలి...!

మా విషయంలోనూ అంతే, మతమే మా వాళ్ళను మమ్మల్ని చేరదీయకుండా అడ్డుపడింది. కాకపోతే కాలం సరైన సమాధానం చెపుతుంది దేనికైనా. దాని కోసం వేచి ఉండాలి. మమ్మల్ని మావాళ్ళు దగ్గరచేసుకోవడానికి చాలా ఏళ్ళు పట్టింది. ఇన్నాళ్ళకు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మా ఇంటికి తన తరపువాళ్ళు, నా తరపువాళ్ళు అందరూ వస్తారు. మా అమ్మాయిని తమ వాళ్ళకు ఇవ్వమని అడిగిన వారూ ఉన్నారు. కాకపోతే తనకు నచ్చిన వ్యక్తిని ఇచ్చి మాలాగే ప్రేమ వివాహం చేశాం. అల్లుడు కర్ణాటక అబ్బాయి, వాళ్ళ ఫేమలీ కూడా అంతా ఒప్పుకుని సంతోషంగా వివాహం చేశారు. మేం చేసుకున్నట్టే ఆమెకు కూడా దండలు, ఉంగరాలు మార్పించి, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద పెళ్ళి రిజిస్టర్ చేసి ఆదర్శ వివాహం చేశాం.

3. మీరు ఇద్దరికీ పెళ్ళి తరువాత ఎదురైన సవాళ్ళను ఎదిరించి, నిలబడ్డారు. అలాగే కులాంతర, మతాంతర వివాహాలు చేసుకోవాలనుకునే వారికి మీ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది?

దాదాపు ఎనభై పైనే ప్రేమ వివాహాలు మా సంఘం ద్వారా మా ఆధ్వర్యంలో చేసి ఉంటాం. కొన్ని వివాహాలైతే మా ఇంటి పైనే జరిపించాం. వారంతా మా సొంత బంధువుల్లా కలిసిపోయారు. చిన్న చిన్న సమస్యలతో నెలకు ఇద్దరో ముగ్గురురో కౌన్సిలింగ్‌కు మాదగ్గరకు వస్తూ ఉంటారు. ‌ఇక పెళ్ళికోసం ఎవరైనా మా దగ్గరకు వస్తే వాళ్లల్లో ఒక్కరికన్నా ఆర్థిక స్థోమత బావుందా, ఉపాధి ఉందా అని చూసి అప్పుడు మాత్రమే పెళ్ళి చేసేందుకు ముందుకు వస్తాం. పెళ్ళయ్యాకా ఆజంటకు మేము పెద్ద దిక్కులా అయిపోతాం. వాళ్ళూ మాతో కుటుంబంలాగా కలిసిపోతారు. ఇలా వివాహం చేసుకున్న జంటలు ఎప్పుడన్నా ఏదైనా సలహాలు, సందేహాలుంటే వచ్చి కలిసివెళతారు. చెప్పిన సలహాలు తీసుకుంటారు, వాళ్లకి పిల్లలు పుట్టినా కూడా.. మీకే మొదటిగా చేస్తున్నామని ఫోన్ చేసి చెపుతారు.

4. ఆదర్శ వివాహం చేసుకున్న జంటల పిల్లలకు తల్లిదండ్రుల నుంచి ఏ మతం, ఎవరి కులం వస్తుంది?

ఈ ఆదర్శ వివాహం చేసుకుంటున్నవారి కులాన్ని గానీ, మతాన్ని గానీ వదులుకోవద్దనే సలహా మాత్రం మా నుంచి ఉంటుంది. ఇలా వేరే వేరే కులాల వారు, మతాలవారు వివాహం చేసుకుంటే ఓ కొత్త జనరేషన్ ఏర్పడుతుంది. అయితే మరి వాళ్ళకు రిజర్వేషన్ కూడా అవసరమే. అలాగే వారి పిల్లలకు ఎటువంటి సపోర్ట్ ఉండదు కాబట్టి వాళ్ళ పిల్లల్ని ఆదర్శ భారతీయిలుగా గుర్తించమని కోరుతున్నాం. ఒక ప్రత్యేకమైన కేటగిరీ కనుక ఇవ్వగలిగితే కులరహితమైన సమాజం అనేది చిన్న స్థాయిలోనైనా మొదలవుతుంది. ఇది మంచి పరిణామం. ఇలానే ప్రతి ఒక్కరూ ఆలోచిస్తే రాబోవు తరాల్లో ప్రేమించుకోవడం నేరం అనే భావన నశిస్తుంది. అంతరం భారతీయులమనే భావనే మిగులుతుంది.

5. కుల నిర్మూలన సంఘం ద్వారా ఎటువంటి కార్యక్రమాలు జరుగుతాయి?

మేం ప్రధానంగా వివాహాలను జరిపిస్తున్నప్పటికీ కాలేజ్, సెమినార్స్, మహానుభావుల పుట్టినరోజుల సందర్భంగా ప్రజల్లో కుల భావనను తొలగించే విధంగా అవగాహనా సదస్సులను కూడా జరుపుతూ ఉంటాం. ఈ విధంగానైనా మార్పు రావాలనేది మా ప్రధాన ఉద్దేశ్యం.

6. ప్రేమికులరోజు సందర్భంగా కులనిర్మూలన సంఘం తరపున ఏవైనా కార్యక్రమాలు చేస్తారా?

ప్రతిరోజూ ప్రేమికుల రోజే.. ఈ ప్రపంచం మొత్తంలో ప్రేమలేనిదే ఏదీ లేదు అసలు, దానికి మాత్రమే ప్రత్యేకించి ఒకరోజంటూ లేదు. అయితే కులాంతర, మతాంతర వివాహం చేసుకున్న జంటలను మా సంస్థ ద్వారా ప్రేమికులరోజున సత్కరిస్తాము. చక్కగా అందరూ కలిసి కాసేపు సమయాన్ని గడుపుతాం.

90.gif

7. మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు?

ప్రేమ ఒకపువ్వుతోనో, గిఫ్ట్ తోనో ఇచ్చి తెలిపేసేది కాదు. ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకం, బాధ్యతకు అవి ఇస్తే సరిపోవు. మేం ఇప్పటివరకూ అలాంటివి ఏం ఇచ్చిపుచ్చుకోలేదు. అంటే మామధ్య ప్రేమలేదని కాదు. ఒక మనిషిని ఒకరు ప్రేమిస్తున్నారు అంటే మనసు తెలిస్తే చాలు. మేం ఇప్పటికీ ఒకరికొకరం ఐ లవ్ యూ చెప్పుకోలేదు. ప్రేమ తెలుస్తుంది. తను నన్ను ప్రేమిస్తున్నాడని, ప్రతి అడుగులోనూ తెలుస్తుంది. నేను తనని ప్రేమిస్తున్నానని నాప్రతి అడుగులోనూ తెలుస్తుంది. దానిని గిఫ్ట్‌ల ద్వారా తెలుపుకోవాల్సిన అవసరం లేదు. మేం ఇద్దరం ఈ పద్దతిని పెద్దగా ఇష్టపడం. అలా బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. అరే తను రోజా ఇచ్చాడే.. నేనేం ఇవ్వాలనే ఆలోచన ఉంటుంది తప్ప అందులో ప్రేమ ఉండదు.

8. ఇప్పటి ప్రేమ ఏలా ఉంది? ప్రేమ పేరుతో జరుగుతున్న హింస, పరువు హత్యలతో జరుగుతున్న మారణకాండ దీనిమీద మీరేమంటారు?

మారుతున్న టెక్నాలజీ స్పీడ్, చదువులు, ఫాస్ట్ కల్చర్ వల్ల పిల్లల పెంపకంలోని లోపాలతో, అటువంటి హింసాత్మక ధోరణులకు పాల్పడుతున్నారు. ఒకచోట ప్రేమించలేదని యాసిడ్ దాడి జరిగిందంటే అది పిల్లల పెంపకం సరిగా లేకకానీ, మరేం కాదు.దీనికి పెరిగిన వాతావరణం ప్రభావం కూడా ఉంటుంది. నిజంగా ప్రేమిస్తే, ఇష్టపడిన వారి జీవితం బావుండాలని కోరుకోవాలి. నిజమైన ప్రేమ త్యాగాన్ని కోరుతుంది. కానీ చంపేయాలని, ఇబ్బంది పెట్టాలనే ధోరణి ఉండదు. మగపిల్లాడైనా, ఆడపిల్ల అయినా తల్లిదండ్రులు పెంచే తీరులోనే వాళ్ళ వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటుంది. ఇది గమనించుకుంటే ఇలాంటి హింసలు జరగవు.

-శ్రీశాంతి మెహెర్.

Updated Date - 2023-02-14T19:06:46+05:30 IST