IPL 2023: ‘బెంగళూరు’ కోసం చిన్నారి భీష్మ ప్రతిజ్ఞ!
ABN , First Publish Date - 2023-04-27T18:59:32+05:30 IST
అదేంటో.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB)కు ఐపీఎల్(IPL)లో కలిసి రావడం
బెంగళూరు: అదేంటో.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB)కు ఐపీఎల్(IPL)లో కలిసి రావడం లేదు. ఆ జట్టులో అద్భుతమైన బ్యాటర్లు ఉన్నారు. అంతకుమించిన బౌలర్లు ఉన్నారు. ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లందరూ ఆ జట్టులోనే ఉన్నారు. విరాట్ కోహ్లీ, డుప్లెసిస్, మహిపాల్ లోమ్రోర్, మ్యాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేశ్ కార్తీక్, వనిందు హసరంగ, హర్షల్ పటేల్, వేన్ పార్నెల్, విజయ్ కుమార్ వైశాఖ్, మహమ్మద్ సిరాజ్ వంటి ఆటగాళ్లు ఉన్నప్పటికీ అదృష్టం కలిసి రావడం లేదు. ఇంతమంది ఉండి కూడా జట్టుకు ట్రోఫీ అందించలేకపోయారు.
ఈసారి కూడా ఆ జట్టు పడుతూ లేస్తూ ముందుకు సాగుతోంది. ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడి నాలుగింటిలో మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది. జట్టుకు ట్రోఫీ అందించిపెట్టాలన్న కల తీరకుండానే కోహ్లీ (Virat Kohli) కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ప్రస్తుతం ఫా డుప్లెసిస్ (Faf du Plessis) జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. ఈ సీజన్‌లో ఆ జట్టు ట్రోఫీ అందుకోవాలంటే పెద్ద పోరాటమే చేయాల్సి ఉంటుంది.
ఈ నేపథ్యంలో తాజాగా ఆర్సీబీ-కేకేఆర్ జట్ట మధ్య మ్యాచ్ జరుగుతున్నప్పుడు స్టేడియంలో కూర్చుని మ్యాచ్ చూస్తున్న ఓ చిన్నారి పట్టుకున్న ప్లకార్డు అందరినీ ఆకర్షించింది. ఆ తర్వాత అది సోషల్ మీడియాకెక్కి వైరల్ అయింది. ఆ ప్లకార్డుపై ‘‘ఆర్సీబీ ఐపీఎల్ ట్రోఫీ గెలిచే వరకు స్కూలుకు వెళ్లను’’ అని రాసి ఉంది. దీనిని బట్టి బెంగళూరు కప్పు కొడితే చూడాలని ఎంతమంది అభిమానులు వేచి చూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. మరి ఇక నుంచైనా రెట్టించిన ఉత్సాహంతో ఆడి రేసులోకొస్తుందేమో చూడాలి.