Share News

World Cup 2023: డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌కు చావో రేవో.. నేడు ఓడితే ఇక ఇంటికే!..

ABN , First Publish Date - 2023-10-26T11:09:35+05:30 IST

భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. టోర్నీ ప్రారంభానికి ముందు హాట్ ఫెవరేట్‌గా బరిలోకి దిగిన ఇంగ్లీష్ జట్టు ప్రస్తుతం లీగ్ స్టేజ్‌లో విజయాలు సాధిండానికే అపసోపాలు పడుతోంది.

World Cup 2023: డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌కు చావో రేవో.. నేడు ఓడితే ఇక ఇంటికే!..

బెంగళూరు: భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. టోర్నీ ప్రారంభానికి ముందు హాట్ ఫెవరేట్‌గా బరిలోకి దిగిన ఇంగ్లీష్ జట్టు ప్రస్తుతం లీగ్ స్టేజ్‌లో విజయాలు సాధిండానికే అపసోపాలు పడుతోంది. జట్టు నిండా మ్యాచ్ విన్నర్లే ఉన్నప్పటికీ విజయాలు మాత్రం దరిచేరడం లేదు. భారీ అంచనాలతో ప్రపంచకప్‌లో అడుగుపెట్టిన డిఫెండింగ్ చాంపియన్ స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోతోంది. జట్టులోని ఆటగాళ్లంతా అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోవడం ఇంగ్లండ్‌కు మైనస్‌గా మారింది. ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో ఒకే ఒక విజయం సాధించి 8వ స్థానంలో కొనసాగుతోంది. పసికూన అఫ్ఘానిస్థాన్ చేతిలో కూడా ఓడిపోవడం ఆ జట్టు సత్తాను ప్రశ్నించేందిగా మారింది. ఈ క్రమంలో ఇంగ్లండ్ నాకౌట్ అవకాశాలు కూడా సంక్లిష్టంలో పడ్డాయి. నిజానికి టోర్నీ ప్రారంభానికి ముందు ఆడిన సిరీస్‌ల్లో ఇంగ్లండ్ జట్టు అదరగొట్టింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో బలంగా కనిపించింది. గతేడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌ను కూడా గెలిచింది. దీంతో ఈ ప్రపంచకప్‌లో హాట్ ఫెవరేట్‌గా బరిలోకి దిగింది. పలువురు క్రికెట్ విశ్లేషకులు కూడా ఇంగ్లండ్ ప్రపంచకప్ గెలుస్తుందని అంచనా వేశారు. మరికొందరైతే ఈ సారి ఫైనల్‌లో భారత్, ఇంగ్లండ్ తలపడతాయని అభిప్రాయపడ్డారు. భారత్ వారి అంచనాలను అనుగుణంగానే రాణిస్తున్నప్పటికీ, ఇంగ్లండ్ మాత్రం చేతులెత్తేస్తోంది.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

ఈ క్రమంలో ఇంగ్లీష్ జట్టు గురువారం నాడు కీలక పోరుకు సిద్ధమైంది. గురువారం ఆ జట్టు శ్రీలంకతో తలపడనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లోనూ ఇంగ్లండ్ ఓడితే ఆ జట్టు నాకౌట్ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించే అవకాశాలున్నాయి. దీంతో శ్రీలంకతో పోరు ఇంగ్లండ్‌కు చావో రేవో అన్నట్టుగా తయారైంది. ఆ జట్టు నాకౌట్ అవకాశాలు సజీవంగా ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలిచి తీరాల్సిందే. దీంతో ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని ఇంగ్లండ్ భావిస్తోంది. గాయం నుంచి కోలుకుని జట్టులో చేరిన ఆల్ రౌండర్ స్టోక్స్ ఇంకా తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. దీంతో అతడి నుంచి ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ మేనేజ్‌మెంట్ మంచి ప్రదర్శనను ఆశిస్తోంది. ప్రత్యర్థి శ్రీలంక జట్టు ప్రస్తుతం బలహీనంగా ఉండడం కూడా ఇంగ్లండ్‌కు సానుకూలంశంగా చెప్పవచ్చు. ఆ జట్టును గాయాలు వేధిస్తున్నాయి. గాయాల కారణంగా కీలక ఆటగాళ్లు జట్టుకు దూరమయ్యారు. అలాగే శ్రీలంకకు కూడా ఈ మ్యాచ్ చావో రేవో లాంటిదే. ఆ జట్టు కూడా 4 మ్యాచ్‌ల్లో ఒకటే గెలిచింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. దీంతో నాకౌట్ ఆశలు సజీవంగా ఉండాలంటే లంక కూడా ఈ మ్యాచ్ కచ్చితంగా గెలవాల్సిందే. దీంతో శ్రీలంక కూడా గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. మొత్తంగా ఈ మ్యాచ్ రెండు జట్లకు ఎంతో కీలకమైనదిగా చెప్పుకోవచ్చు.

Updated Date - 2023-10-26T11:09:35+05:30 IST