GGT vs MI: గుజరాత్‌ను భయపెట్టేసిన ముంబై.. ఇది అట్టాంటి ఇట్టాంటి గెలుపు కాదు..
ABN , First Publish Date - 2023-03-05T00:18:45+05:30 IST
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యుపీఎల్) తొలి మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ జట్టు సత్తా చాటింది. శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడగా..
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యుపీఎల్) (WPL 2023) తొలి మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ (HarmanpreetKaur) సారథ్యంలోని ముంబై ఇండియన్స్ (Mumbai Indians Women Win) జట్టు సత్తా చాటింది. శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ (Gujarat Gaints), ముంబై ఇండియన్స్ (Mumbai Indians Women) జట్లు తలపడగా ముంబై జట్టు ఆల్‌రౌండ్ షోతో గుజరాత్ జట్టును మట్టి కరిపించింది. 143 పరుగుల తేడాతో భారీ విజయాన్ని ముంబై ఇండియన్స్ మహిళల జట్టు నమోదు చేసి సంచలనం సృష్టించింది.
గుజరాత్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు ఐదు వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోర్ చేసింది. 208 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ జెయింట్స్ జట్టు 15.1 ఓవర్లు మాత్రమే ఆడి 64 పరుగుల స్వల్ప స్కోర్‌కే ఆలౌట్ అయింది. గుజరాత్ జెయింట్స్ జట్టు కెప్టెన్ బెత్ మూనీతో సహా మరో ముగ్గురు డకౌట్‌గా వెనుదిరిగారంటే గుజరాత్ జట్టు బ్యాటింగ్ ఎంత పేలవంగా సాగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముంబై జట్టు ఆల్‌రౌండ్ జట్టుతో అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు 15 పరుగుల స్కోర్‌కే యస్తికా భాటియా వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత మ్యాథ్యూస్ 47 పరుగులు, నాట్ స్కివర్ బ్రంట్ 23 పరుగులతో నిలకడగా ఆడారు.
ముంబై జట్టు స్కోర్ 69 పరుగుల వద్ద ఉండగా నాట్ స్కివర్ బ్రంట్, 77 పరుగుల వద్ద మ్యాథ్యూస్ ఔట్ కావడంతో 77 పరుగులకు ముంబై 3 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత అసలైన పరుగుల వరద మొదలైంది. ముంబై ఇండియన్స్ ఉమెన్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ బ్యాటింగ్‌కు దిగి 14 ఫోర్లతో ప్రత్యర్థి జట్టు బౌలర్లకు చుక్కలు చూపించింది. వరుసగా 7 ఫోర్లు కొట్టి హర్మన్ అంటే ఏంటో నిరూపించింది. 30 బంతుల్లోనే 65 పరుగులు చేసి కెరీర్లోనే గుర్తుండిపోయే హాఫ్ సెంచరీని నమోదు చేసింది.
హర్మన్ దూకుడుకు గుజరాత్ బౌలర్లు బెదిరిపోయిన పరిస్థితి. స్నేహ్ రానా బౌలింగ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ హేమలతకు క్యాచ్‌గా దొరికిపోవడంతో ఆమె అద్భుత ఇన్నింగ్స్ ముగిసింది. పూజా వస్త్రాకర్ 8 బంతుల్లో 3 ఫోర్లతో 15 పరుగులు చేసి ఔట్ అయినప్పటికీ కివీస్ ఉమెన్ క్రికెటర్ అమేలియా కెర్ దుమ్మురేపింది. 24 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్స్ బాది 45 పరుగులతో నాటౌట్‌గా నిలిచి అదరగొట్టింది.
ఇక.. బౌలింగ్ విభాగంలోనూ ముంబై జట్టు ఇదే స్థాయి ప్రతిభను కనబర్చింది. 1-1 (హర్లీన్ డియోల్, 0.6), 3-2 (గార్డ్నర్, 1.2), 5-3 (సబ్బినేని మేఘన, 2.3), 12-4 (సూతర్ల్యాండ్, 4.4), 22-5 (జార్జియా వేర్హమ్, 6.5), 23-6 (స్నేహ్ రానా, 7.1), 23-7 (తనూజా కన్వర్, 7.4), 49-8 (మాన్సి జోషి, 12.4), 64-9 (మోనికా పటేల్, 15.1).. ఇదీ గుజరాత్ జట్టు వికెట్లు కోల్పోయిన పరిస్థితి. ముంబై బౌలర్ సైకా ఇషాక్ అద్భుతంగా బౌలింగ్ చేసి నాలుగు వికెట్లతో రాణించింది. 3.1 ఓవర్లు బౌలింగ్ చేసి 11 పరుగులు మాత్రమే ఇచ్చింది. అమేలియా కెర్ 2 వికెట్లు తీసి ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. గుజరాత్ బౌలర్లలో స్నేహ్ రానా రెండు వికెట్లతో రాణించగా, తనూజ కన్వర్, వేర్హమ్, గార్డ్నర్కు చెరో వికెట్ దక్కింది.