IND vs AUS: చరిత్ర సృష్టించిన మ్యాక్స్‌వెల్.. టీ20 క్రికెట్ హిస్టరీలో ఒకే ఒక్కడిగా..
ABN , First Publish Date - 2023-11-29T08:14:03+05:30 IST
Glenn Maxwell: భారత్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ విశ్వరూపం చూపించాడు. 223 పరుగుల భారీ లక్ష్య చేధనలో మెరుపు సెంచరీతో జట్టును గెలిపించాడు. ఒకానొక దశలో 68/3తో కష్టాల్లో ఉన్న ఆసీస్‌ను మ్యాక్సీ తన అధ్బుత ఆటతో గెలుపుబాట పట్టించాడు.
గువాహటి: భారత్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ విశ్వరూపం చూపించాడు. 223 పరుగుల భారీ లక్ష్య చేధనలో మెరుపు సెంచరీతో జట్టును గెలిపించాడు. ఒకానొక దశలో 68/3తో కష్టాల్లో ఉన్న ఆసీస్‌ను మ్యాక్సీ తన అధ్బుత ఆటతో గెలుపుబాట పట్టించాడు. ప్రసిద్ధ్ కృష్ణ వేసిన చివరి ఓవర్‌లో విజయానికి కావాల్సిన 21 పరుగుల పిండుకుని టీమిండియాకు షాక్ ఇచ్చాడు. తన బ్యాటింగ్‌తో ఊచకోత కోసిన మ్యాక్స్‌వేల్ ఏకంగా 216 స్ట్రైక్ రేటుతో బ్యాటింగ్ చేశాడు. మొత్తంగా 48 బంతులు ఎదుర్కొని 104 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో ఏకంగా 8 సిక్సులు, 8 ఫోర్లు ఉన్నాయి. ఈ క్రమంలో టీ20 క్రికెట్‌లో మ్యాక్స్‌వెల్ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో మ్యాక్స్‌వెల్‌కు ఇది 100వ టీ20 మ్యాచ్. దీంతో పొట్టి ఫార్మాట్‌లో 100వ మ్యాచ్‌లో సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. గతంలో ఏ ఆటగాడు ఈ రికార్డును అందుకోలేదు. అలాగే అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో మ్యాక్స్‌వెల్‌కు ఇది నాలుగో సెంచరీ కావడం గమనార్హం. దీంతో అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో టీమిండియా ఆటగాడు రోహిత్ శర్మతో కలిసి మొదటి స్థానంలో ఉన్నాడు. వీరిద్దరు ఇప్పటివరకు నాలుగేసి సెంచరీల చొప్పున చేశారు. అలాగే లక్ష్య చేధనలో మ్యాక్స్‌వెల్‌కు ఇది మూడో సెంచరీ. దీంతో టీ20 క్రికెట్‌లో లక్ష్య చేధనలో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌గా మాక్సీ చరిత్ర సృష్టించాడు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే హ్యాట్రిక్ విజయాలతో ఐదు టీ20ల సిరీస్‌ను ఖాతాలో వేసుకోవాలనుకున్న యువ భారత్ ఆశలపై గ్లెన్ మ్యాక్స్‌వెల్ (48 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్సర్లతో 104 నాటౌట్) నీళ్లు జల్లాడు. నరాలు తెగే ఉత్కంఠభరిత మ్యాచ్‌లో.. తనకు మాత్రమే సాధ్యమయ్యే ఆటతీరుతో చెలరేగి విజయాన్ని లాగేసుకున్నాడు. రుతురాజ్ గైక్వాడ్ (57 బంతుల్లో 13 ఫోర్లు, 7 సిక్సర్లతో 123 నాటౌట్) వీరోచిత శతకంతో భారత్ భారీ స్కోరు సాధించినప్పటికీ.. మ్యాక్స్ బాదుడుకు ఆఖరి బంతి వరకు ఉత్కంఠ తప్పలేదు. భారత్ ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో 30 పరుగులిచ్చుకున్న అతనే.. తమ ఛేదనలో 6 బంతుల్లో 21 పరుగులను అలవోకగా సాధించి లెక్క సరిచేశాడు. దీంతో ఆసీస్ 5 వికెట్లతో గెలిచి సిరీస్‌లో భారత్ ఆధిక్యాన్ని 2-1కి తగ్గించింది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా భారత్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 222 పరుగులు చేసింది. సూర్యకుమార్ (29 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 39), తిలక్ వర్మ (24 బంతుల్లో 4 ఫోర్లతో 31 నాటౌట్) రాణించారు. ఛేదనలో ఆసీస్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 225 పరుగులు చేసి గెలిచింది. హెడ్ (18 బంతుల్లో 8 ఫోర్లతో 35), మాథ్యూ వేడ్ (16 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 28 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. బిష్ణోయ్‌కు రెండు వికెట్లు దక్కాయి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా మ్యాక్స్‌వెల్ నిలిచాడు.