IPL DC vs PBKs : పంజాబ్‌కు ఝలక్‌

ABN , First Publish Date - 2023-05-18T03:47:42+05:30 IST

నాకౌట్‌ రేసు నుంచి ఈపాటికే అవుటైనా ఢిల్లీ క్యాపిటల్స్‌ పోతూపోతూ పంజాబ్‌ కింగ్స్‌కు ఝలక్‌ ఇచ్చింది. ఐపీఎల్‌లో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 15 పరుగుల తేడాతో పంజాబ్‌పై గెలిచింది.

IPL DC vs PBKs : పంజాబ్‌కు ఝలక్‌

  • నాకౌట్‌ ఆశలకు దెబ్బ

• 15 పరుగులతో ఢిల్లీ గెలుపు

• లివింగ్‌స్టోన్‌ పోరాటం వృథా

• రొసో, పృథ్వీ అర్ధ శతకాలు

  • లివింగ్‌స్టోన్‌ (94)

ధర్మశాల: నాకౌట్‌ రేసు నుంచి ఈపాటికే అవుటైనా ఢిల్లీ క్యాపిటల్స్‌ పోతూపోతూ పంజాబ్‌ కింగ్స్‌కు ఝలక్‌ ఇచ్చింది. ఐపీఎల్‌లో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 15 పరుగుల తేడాతో పంజాబ్‌పై గెలిచింది. కీలకమైన మ్యాచ్‌లో ఓడడంతో పంజాబ్‌ ప్లేఆఫ్స్‌ ఆశలకు గట్టిదెబ్బ తగిలింది. తొలుత ఢిల్లీ 20 ఓవర్లలో 2 వికెట్లకు 213 పరుగులు చేసింది. రిలీ రొసో (37 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 82 నాటౌట్‌), పృథ్వీ షా (38 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్‌తో 54) హాఫ్‌ సెంచరీలు సాధించగా.. వార్నర్‌ (46) మెరిశాడు. ఛేదనలో పంజాబ్‌ ఓవర్లన్నీ ఆడి 198/8 స్కోరు మాత్రమే చేసింది. లివింగ్‌స్టోన్‌ (48 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్స్‌లతో 94), అథర్వ (55) శ్రమ వృథా అయింది. ఇషాంత్‌, నోకియా చెరో 2 వికెట్లు తీశారు. రొసోకు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ దక్కింది.

పట్టువదలని లివింగ్‌స్టోన్‌: లివింగ్‌స్టోన్‌ తుది వరకు పోరాడినా.. అతడికి తగిన సహకారం లభించకపోవడంతో పంజాబ్‌కు ఓటమి తప్పలేదు. అథర్వ, లివింగ్‌స్టోన్‌ మూడో వికెట్‌కు 78 పరుగులతో జట్టును మ్యాచ్‌లోనే ఉంచినా.. కీలక సమయంలో మిగతా బ్యాటర్లు చేతులెత్తేశారు. భారీ ఛేదనలో ఓపెనర్‌ ధవన్‌ (0)ను ఇషాంత్‌ డకౌట్‌ చేశాడు. కానీ, మరో ఓపెనర్‌ ప్రభ్‌సిమ్రన్‌ (22), అథర్వ రెండో వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యంతో జట్టును ఆదుకొనే ప్రయత్నం చేశారు. నాలుగో ఓవర్‌లో ఇషాంత్‌ బౌలింగ్‌లో సిమ్రన్‌ హ్యాట్రిక్‌ ఫోర్లతో బ్యాట్‌ ఝుళిపించగా.. ఆ తర్వాత అథర్వ రెండు ఫోర్లు, రెండు సిక్స్‌లు బాదడంతో పవర్‌ప్లే ముగిసేసరికి పంజాబ్‌ 47/1తో నిలిచింది. అయితే, అక్షర్‌ బౌలింగ్‌లో భారీషాట్‌ ఆడే క్రమంలో ప్రభ్‌సిమ్రన్‌ క్యాచవుటయ్యాడు. ఈ దశలో స్పిన్నర్లు అక్షర్‌, కుల్దీప్‌ కట్టుదిట్టంగా బంతులేయడంతో స్కోరు వేగం మందగించింది. 3 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కుల్దీప్‌ బౌలింగ్‌లో లివింగ్‌స్టోన్‌ ఇచ్చిన క్యాచ్‌ను నోకియా చేజార్చగా.. అథర్వకు యష్‌ లైఫ్‌ ఇచ్చాడు. కాగా, అక్షర్‌ వేసిన 12వ ఓవర్‌లో అథర్వ రెండు బౌండ్రీలు కొట్టగా.. లివింగ్‌స్టోన్‌ మరో ఫోర్‌తో జట్టు స్కోరును సెంచరీ మార్క్‌ చేర్చాడు. డబుల్‌తో అథర్వ అర్ధ శతకం పూర్తి చేసుకున్నా.. 14వ ఓవర్‌లో కుల్దీప్‌ 5 పరుగులు మాత్రమే ఇచ్చి ఒత్తిడి పెంచాడు. చివరి 5 ఓవర్లలో 86 పరుగులు కావాల్సి ఉండగా.. అథర్వ రిటైర్డ్‌ అవుట్‌గా వెనుదిరిగాడు. కానీ, ఆ తర్వాత వచ్చిన జితేష్‌ (0), షారుక్‌ ఖాన్‌ (6) వేగంగా పెవిలియన్‌ చేరారు. అయితే, పట్టువదలని లివింగ్‌స్టోన్‌ శివాలెత్తడంతో సమీకరణం 12 బంతుల్లో 38 పరుగులకు దిగి వచ్చింది. దీంతో గెలుపుపై ఆశలు రేకెత్తిన సమయంలో కర్రాన్‌ (11), హర్‌ప్రీత్‌ బ్రార్‌ (0) వరుసగా అవుట్‌కాగా.. చివరి ఓవర్‌లో జట్టు విజయానికి 33 రన్స్‌ అవసరమయ్యాయి. ఉత్కంఠ మధ్య ఇషాంత్‌ బౌలింగ్‌లో 17 రన్స్‌ మాత్రమే సాధించిన లివింగ్‌స్టోన్‌ ఆఖరి బంతికి అవుటయ్యాడు.

చెలరేగిన రొసో: రిలీ రొసో ధనాధన్‌ అర్ధ శతకంతో ఢిల్లీ సవాల్‌ విసరగలిగే స్కోరు చేసింది. ఓపెనర్‌ షాతో కలసి రెండో వికెట్‌కు 54 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన రొసో.. డెత్‌ ఓవర్లలో సాల్ట్‌ (26 నాటౌట్‌)తో కలసి మూడో వికెట్‌కు 30 బంతుల్లో 65 పరుగులు జోడించడంతో క్యాపిటల్స్‌ భారీ స్కోరు చేసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకి వార్నర్‌, షా శుభారంభాన్ని అందించారు. 4వ ఓవర్‌లో రబాడ బౌలింగ్‌లో వార్నర్‌ 4,6,6తో 17 పరుగులు రాబట్టగా.. ఆ తర్వాతి ఓవర్‌లో అర్ష్‌దీప్‌ బౌలింగ్‌లో షా 4,4,6తో జోరు పెంచాడు. దీంతో పవర్‌ప్లేను ఢిల్లీ 61/0తో మెరుగ్గానే ముగించింది. మధ్య ఓవర్లలో స్పిన్నర్‌ చాహర్‌ పెద్దగా ప్రభావం చూపకపోవడంతో ధవన్‌ పేసర్లనే కొనసాగించాడు. ఎట్టకేలకు 11వ ఓవర్‌లో వార్నర్‌ను అవుట్‌ చేసిన కర్రాన్‌.. జట్టుకు బ్రేక్‌ అందించాడు. వార్నర్‌ కొట్టిన క్యాచ్‌ను ధవన్‌ అద్భుత రీతిలో అందుకోవడంతో.. తొలి వికెట్‌కు 94 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అయితే, రొసో రావడంతోనే స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. రబాడ వేసిన 13వ ఓవర్‌లో రొసో 2 సిక్స్‌లు, ఫోర్‌ సాధించడంతో జట్టు స్కోరు 125 పరుగులకు చేరుకొంది. అర్ధ శతకం పూర్తి చేసుకొన్న షాను కర్రాన్‌ వెనక్కిపంపాడు. ఈ దశలో హర్‌ప్రీత్‌ పరుగులను కట్టడి చేసినా.. ఆఖర్లో రొసో, సాల్ట్‌ భారీషాట్లతో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో రొసో లీగ్‌లో తొలి ఫిఫ్టీ పూర్తి చేసుకొన్నాడు. 19వ ఓవర్‌లో సాల్ట్‌ రెండు సిక్స్‌లు, ఫోర్‌తో 18 పరుగులు రాబట్టగా.. హర్‌ప్రీత్‌ వేసిన ఆఖరి ఓవర్‌లో రొసో రెండు సిక్స్‌లు, ఫోర్‌ బాదడంతో ఏకంగా 23 రన్స్‌ లభించాయి. దీంతో చివరి 5 ఓవర్లలో ఢిల్లీ 65 పరుగులు పిండుకొంది.

స్కోరుబోర్డు

ఢిల్లీ: వార్నర్‌ (సి) ధవన్‌ (బి) కర్రాన్‌ 46, పృథ్వీ షా (సి) అథర్వ (బి) కర్రాన్‌ 54, రిలీ రోసౌ (నాటౌట్‌) 82, ఫిల్‌ సాల్ట్‌ (నాటౌట్‌) 26, ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 20 ఓవర్లలో 213/2; వికెట్ల పతనం: 1–94, 2–148; బౌలింగ్‌: కర్రాన్‌ 4–0–36–2, రబాడ 3–0–36–0, అర్ష్‌దీప్‌ 2–0–21–0, ఎలిస్‌ 4–0–46–0, రాహుల్‌ చాహర్‌ 4–0–35–0, హర్‌ప్రీత్‌ బ్రార్‌ 3–0–39–0.

పంజాబ్‌: ప్రభ్‌సిమ్రన్‌ (సి) యష్‌ ధుల్‌ (బి) అక్షర్‌ 22, ధవన్‌ (సి) అమన్‌ (బి) ఇషాంత్‌ 0, అథర్వ (రిటైర్డ్‌హర్ట్‌) 55, లివింగ్‌స్టోన్‌ (సి) అక్షర్‌ (బి) ఇషాంత్‌ 94, జితేష్‌ (సి) ఖలీల్‌ (బి) నోకియా 0, షారుక్‌ (సి) అక్షర్‌ (బి) ఖలీల్‌ 6, కర్రాన్‌ (బి) నోకియా 11, హర్‌ప్రీత్‌ (రనౌట్‌) 0, రాహుల్‌ చాహర్‌ (నాటౌట్‌) 0, ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: 20 ఓవర్లలో 198/8; వికెట్ల పతనం: 1–0, 2–50, 3–128, 4–129, 5–147, 6–180, 7–180, 8–198; బౌలింగ్‌: ఖలీల్‌ అహ్మద్‌ 3–1–20–1, ఇషాంత్‌ శర్మ 3–0–36–2, నోకియా 4–0–36–2, ముకేశ్‌ 4–0–52–0, అక్షర్‌ పటేల్‌ 3–0–27–1, కుల్దీప్‌ 3–0–21–0.

Updated Date - 2023-05-18T11:33:23+05:30 IST