Kolkata Knight Riders: గెలుపు ముంగిట బోల్తా
ABN , First Publish Date - 2023-05-05T02:30:47+05:30 IST
ఐదు ఓవర్లలో 38 పరుగులు.. చేతిలో ఐదు వికెట్లున్నాయి.. ఈ దశలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓడుతుందని ఊహించగలరా? కానీ కోల్‌కతా నైట్‌రైడర్స్ బౌలర్లు మాత్రం పట్టు వదల్లేదు.

రైజర్స్‌ను కట్టడి చేసిన స్పిన్నర్ వరుణ్
5 రన్స్‌తో కోల్‌కతా విజయం
వరుణ్ (1/20)
హైదరాబాద్: ఐదు ఓవర్లలో 38 పరుగులు.. చేతిలో ఐదు వికెట్లున్నాయి.. ఈ దశలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓడుతుందని ఊహించగలరా? కానీ కోల్‌కతా నైట్‌రైడర్స్ బౌలర్లు మాత్రం పట్టు వదల్లేదు. ఆఖరి ఓవర్‌లోనూ రైజర్స్ విజయానికి కేవలం 9 పరుగులే అవసరం. కానీ ఈ దశలో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అద్భుతమే చేశాడు. సమద్ వికెట్ తీయడంతో పాటు మూడు పరుగులే ఇచ్చి షాక్ ఇచ్చాడు. దీంతో గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో విజయం అంచుల వరకు వచ్చిన సన్‌రైజర్స్ 5 పరుగుల తేడాతో కేకేఆర్ చేతిలో ఓడింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 9 వికెట్లకు 171 పరుగులు చేసింది. రింకూ సింగ్ (46), రాణా (42) రాణించారు. జాన్సెన్, నటరాజన్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో రైజర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 166 పరుగులు చేసి ఓడింది. మార్‌క్రమ్ (41), క్లాసెన్ (36) మాత్రమే రాణించారు. వైభవ్, శార్దూల్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా వరుణ్ చక్రవర్తి నిలిచాడు.
వరుణ్ మాయ:
తడబాటుతో ఆరంభమైన రైజర్స్ ఇన్నింగ్స్ హెన్రిచ్ క్లాసెన్ దూకుడుతో తేరుకుంది. అతడికి కెప్టెన్ మార్‌క్రమ్ జత కలవడంతో స్కోరు దూసుకెళ్లింది. కానీ ఈ ఇద్దరి నిష్క్రమణతో ఒత్తిడికి లోనైన జట్టు చిత్తయింది. ఎంతలా అంటే.. చివరి 30 బంతుల్లో 38 పరుగులు కూడా చేయలేకపోయింది. ఈ ఐదులో మూడు ఓవర్లు వేసిన స్పిన్నర్ వరుణ్ 8 పరుగులే ఇచ్చి దూకుడు మీదున్న సమద్ వికెట్ తీసి కేకేఆర్‌కు విజయాన్నందించాడు. ఆరంభంలో రైజర్స్ పవర్‌ప్లేలోనే మయాంక్ (18), అభిషేక్ (9), త్రిపాఠి (20) వికెట్లను కోల్పోయింది. ఆరో ఓవర్‌లో త్రిపాఠి వరుసగా 4,6,4 బాదగా తర్వాతి బంతికే మరో భారీ షాట్‌కు వెళ్లి మూల్యం చెల్లించుకున్నాడు. ఇక బ్రూక్ (0) ఖాతా తెరవలేకపోయాడు. మిగతా బ్యాటర్లు ఇబ్బందిపడిన చోట క్లాసెన్–మార్‌క్రమ్ జోడీ భారీ షాట్లకు వెళ్లింది. అయితే ఐదో వికెట్‌కు 47 బంతుల్లోనే 70 పరుగుల కీలక భాగస్వామ్యం జత చేశాక క్లాసెన్‌ను శార్దూల్ అవుట్ చేశాడు. ఓవర్ వ్యవధిలోనే మార్‌క్రమ్‌ను వైభవ్ దెబ్బతీయడంతో రైజర్స్ ఒత్తిడిలో పడింది. 19వ ఓవర్‌లో రెండు ఫోర్లతో మొత్తం 12 రన్స్ రావడంతో సమీకరణం 6 బంతులు.. 9 పరుగులకు మారింది. ఈ స్థితిలో వరుణ్ చేతికి బంతి ఇచ్చిన రాణా వ్యూహం ఫలించింది. అతడు సమద్ వికెట్ తీసి 3 పరుగులే ఇవ్వడంతో కోల్‌కతా సంబరాలు చేసుకుంది.
ఆదుకున్న రింకూ, రాణా:
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కేకేఆర్.. ఆరంభంలోనే టపటపా వికెట్లను కోల్పోయింది. కెప్టెన్ నితీశ్ రాణా, రింకూ సింగ్ పుణ్యమాని జట్టు గౌరవప్రదమైన స్కోరును సాధించగలిగింది. పేసర్ మార్కో జాన్సెన్ ఒకే ఓవర్‌లో గుర్బాజ్ (0), వెంకటేశ్ అయ్యర్ (7)ల పనిపట్టగా.. నాలుగు ఫోర్లతో ఊపు మీదున్న ఓపెనర్ జేసన్ రాయ్‌ను ఐదో ఓవర్‌లో కార్తికేయ దెబ్బతీశాడు. దీంతో 35/3 స్కోరుతో టీమ్ ఇబ్బందుల్లో పడింది. అప్పటికి పవర్‌ప్లే కూడా పూర్తి కాలేదు. ఈ దశలో రాణా–రింకూ జోడీ నాలుగో వికెట్‌కు 61 పరుగులతో జట్టును ఆదుకుంది. ఇక రాణా పదో ఓవర్‌లో విజృంభించి 4,6,6తో 17 రన్స్ సాధించడంతో జట్టు గాడిన పడినట్టు కనిపించింది. కానీ మార్‌క్రమ్ రిటర్న్ క్యాచ్‌తో రాణా అవుట్ కావడంతో కేకేఆర్ ఉసూరుమంది. రెండు సిక్సర్లు బాదిన రస్సెల్ (24), నరైన్ (1), శార్దూల్ (8) స్వల్ప వ్యవధిలోనే అవుటవడం కూడా భారీ స్కోరుపై ప్రభావం పడింది. అయినా రింకూ తన సహజశైలిలో ఆడుతూ స్కోరును పెంచే ప్రయత్నం చేశాడు. జేసన్ రాయ్ స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన అనుకుల్ రాయ్ (13 నాటౌట్) 19వ ఓవర్‌లో రెండు వరుస ఫోర్లతో ఫర్వాలేదనిపించాడు. అయితే ఆఖరి ఓవర్‌లో నటరాజన్ అద్భుత బౌలింగ్‌తో మూడు పరుగులే ఇచ్చి రింకూ వికెట్ తీయగా.. హర్షిత్ (0) రనౌట్ అయ్యాడు.
పాయింట్ల పట్టిక
జట్టు ఆ గె ఓ ఫ.తే పా నె.రరే
గుజరాత్ 9 6 3 0 12 0.532
లఖ్‌నవూ 10 5 4 1 11 0.639
చెన్నై 10 5 4 1 11 0.329
రాజస్థాన్ 9 5 4 0 10 0.800
బెంగళూరు 9 5 4 0 10 –0.030
ముంబై 9 5 4 0 10 –0.373
పంజాబ్ 10 5 5 0 10 –0.472
కోల్‌కతా 10 4 6 0 8 –0.103
హైదరాబాద్ 9 3 6 0 6 –0.540
ఢిల్లీ 9 3 6 0 6 –0.768
కోల్‌కతా: జేసన్ రాయ్ (సి) మయాంక్ (బి) త్యాగి 20, గుర్బాజ్ (సి) బ్రూక్ (బి) జాన్సెన్ 0, అయ్యర్ (సి) క్లాసెన్ (బి) జాన్సెన్ 7, నితీష్ (సి) అండ్ (బి) మార్‌క్రమ్ 42, రింకూ సింగ్ (సి) సమద్ (బి) నటరాజన్ 46, రస్సెల్ (సి) నటరాజన్ (బి) మార్కండే 24, నరైన్ (సి) మయాంక్ (బి) భువనేశ్వర్ 1, శార్దూల్ (సి) సమద్ (బి) నటరాజన్ 8, అనుకూల్ రాయ్ (నాటౌట్) 13, హర్షిత్ రాణా (రనౌట్) 0, వైభవ్ అరోరా (నాటౌట్) 2, ఎక్స్‌ట్రాలు 8 (మొత్తం 20 ఓవర్లలో) 171/9 : వికెట్లపతనం: 1/8, 2/16, 3/35, 4/96, 5/127, 6/130, 7/151, 8/168, 9/168: బౌలింగ్ : భువనేశ్వర్ 4–0–33–1, జాన్సెన్ 3–0–24–2, కార్తీక్ త్యాగి 2–0–30–1, మార్‌క్రమ్ 3–0–24–1, నటరాజన్ 4–0–30–2, మయాంక్ మార్కండే 4–0–29–1
హైదరాబాద్: మయాంక్ (సి) గుర్బాజ్ (బి) హర్షిత్ 18, అభిషేక్ (సి) రస్సెల్ (బి) శార్దూల్ 9, రాహుల్ త్రిపాఠి (సి) వైభవ్ (బి) రస్సెల్ 20, మార్‌క్రమ్ (సి) రింకు (బి) వైభవ్ 41, బ్రూక్ (ఎల్బీ) అనుకూల్ 0, క్లాసెన్ (సి) రస్సెల్ (బి) శార్దూల్ 36, సమద్ (సి) అనుకూల్ (బి) వరుణ్ 21, జాన్సెన్ (సి) గుర్బాజ్ (బి) వైభవ్ 1, భువనేశ్వర్ (నాటౌట్) 5, మార్కండే (నాటౌట్) 1, ఎక్స్‌ట్రాలు 14, మొత్తం(20 ఓవర్లలో) 166/8: వికెట్లపతనం : 1/29, 2/37, 3/53, 4/54, 5/124, 6/145, 7/152, 8/165: బౌలింగ్ : హర్షిత్ 4–0–27–1, వైభవ్ 3–0–32–2, శార్దూల్ 3–0–23–2, రస్సెల్ 1–0–15–1, అనుకూల్ 3–0–26–1, నరైన్ 2–0–16–0, వరుణ్ చక్రవర్తి 4–0–20–1.
గమనిక: ఆ: ఆడినవి; గె: గెల్చినవి; ఓ: ఓడినవి;
ఫ.తే: ఫలితం తేలనివి; పా: పాయింట్లు; నె.రరే: నెట్ రన్‌రేట్