IPL MI vs DC : ‘సూర్య’ తీవ్రత పెరిగింది..
ABN , First Publish Date - 2023-05-13T04:59:19+05:30 IST
తొలి ఐదు మ్యాచ్‌ల్లో మబ్బులు కమ్మిన ‘సూర్య’ ప్రతాపం ఇప్పుడు సెగలు గక్కుతోంది. ప్లేఆఫ్స్ దగ్గర పడిన కొద్దీ ఈ ముంబై స్టార్ ప్లేయర్ బ్యాట్ నుంచి పరుగుల వరద

49 బంతుల్లో అజేయ శతకం
గుజరాత్‌ను చిత్తు చేసిన ముంబై
రషీద్ ఆల్‌రౌండ్ షో వృధా
ముంబై: తొలి ఐదు మ్యాచ్‌ల్లో మబ్బులు కమ్మిన ‘సూర్య’ ప్రతాపం ఇప్పుడు సెగలు గక్కుతోంది. ప్లేఆఫ్స్ దగ్గర పడిన కొద్దీ ఈ ముంబై స్టార్ ప్లేయర్ బ్యాట్ నుంచి పరుగుల వరద పారుతోంది. 17వ ఓవర్ వరకు 53 పరుగులతోనే ఉన్న సూర్యకుమార్ యాదవ్ ఆఖరి ఓవర్ పూర్తయ్యే సరికి అజేయ శతకం పూర్తి చేయడం విశేషం. అంటే ఈ సమయంలో తానెదుర్కొన్న 15 బంతుల్లోనే మిగతా ఫిఫ్టీ పూర్తి చేశాడు. ఇతడి వైవిధ్యభరిత షాట్ల బాదుడుకు భారీ స్కోరు సాధించిన ముంబై ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్‌ను 27 రన్స్ తేడాతో ఓడించింది. ప్రస్తుతం 14 పాయింట్లతో ఈ జట్టు మూడో స్థానానికి చేరింది. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 5 వికెట్లకు 218 పరుగులు చేసింది. ఇషాన్ (31), విష్ణు వినోద్ (30), రోహిత్ (29) రాణించారు. రషీద్ ఖాన్‌కు నాలుగు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో గుజరాత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 191 పరుగులు చేసి ఓడింది. రషీద్ (32 బంతుల్లో 3 ఫోర్లు, 10 సిక్సర్లతో 79 నాటౌట్) అద్వితీయంగా పోరాడినా ఫలితం లేకపోయింది. డేవిడ్ మిల్లర్ (41), విజయ్ శంకర్ (29) ఫర్వాలేదనిపించారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా సూర్యకుమార్ నిలిచాడు.
వహ్వా.. రషీద్: వాంఖడేలో చేజింగ్ జట్టుకే అవకాశాలున్నా గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ మాత్రం మరోలా సాగింది. చివర్లో రషీద్ ఖాన్ మాత్రం అనూహ్య ఆటతీరుతో చెలరేగాడు. తను కాస్త ముందే వచ్చి ఉంటే ఫలితం మరోలా ఉండేదేమో. కానీ అప్పటికే జట్టు కోలుకోలేని స్థితిలో ఉండడంతో ఎలాంటి ఆశలు లేకపోయాయి. అయితే ఓటమి అంతరం మాత్రం గణనీయంగా తగ్గింది. తొలి నాలుగు ఓవర్లలోనే సాహా (2), గిల్ (6), హార్దిక్ (4) వికెట్లను కోల్పోవడంతో మ్యాచ్ ఫలితంపై అంచనా ఏర్పడింది. విజయ్ శంకర్ మాత్రం వరుస ఫోర్లతో చెలరేగి స్కోరును పెంచే ప్రయత్నం చేశాడు. కానీ పీయూష్ అద్భుత బంతికి తను బౌల్డ్ కాగా.. స్వల్ప వ్యవధిలోనే అభినవ్ (2) కూడా అవుటయ్యాడు. దీంతో 55/5 స్కోరుతో టైటాన్స్ పరిస్థితి దయనీయంగా కనిపించింది. ఈ క్లిష్ట దశలో మిల్లర్ బ్యాట్ ఝళిపిస్తూ ఎదురుదాడికి దిగాడు. కానీ అదీ కాసేపే అయ్యింది. వరుస ఓవర్లలో మిల్లర్, తెవాటియా (14) నిష్క్రమించడంతో టైటాన్స్‌కు ఆశలు లేకపోయాయి. రషీద్ మాత్రం 17వ ఓవర్‌లో 4,6,4.. 18వ ఓవర్‌లో 6,6తో లీగ్‌లో తొలి అర్ధసెంచరీ పూర్తి చేశాడు. ఇక ఆఖరి ఓవర్‌లో 3 సిక్సర్లు బాదడంతో 20 పరుగులు రాగా 200 రన్స్‌కు సమీపంలో రాగలిగింది. రషీద్, అల్జారి (7 నాటౌట్) మధ్య తొమ్మిదో వికెట్‌కు అజేయంగా 88 పరుగులు జత చేరాయి.
బాదుడే బాదుడు..: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇన్నింగ్స్ ధాటిగా ఆరంభమైంది. ఓపెనర్లు ఇషాన్, రోహిత్ క్రీజులో ఉన్నంతసేపు ఎదురుదాడికి దిగారు. ఇక ఆరో ఓవర్‌లో ఇషాన్ రెండు ఫోర్లు బాదడంతో పవర్‌ప్లేలో జట్టు 61 పరుగులకు చేరింది. అయితే జోరు మీదున్న ముంబైకి ఒకే ఓవర్‌లో ఓపెనర్లను పెవిలియన్‌కు చేర్చడంద్వారా రషీద్ ఖాన్ ఝలక్ ఇచ్చాడు. నేహల్ (15) 4,6తో మురిపించినా స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. ఈ దశలో జట్టును సూర్య, వినోద్ ఆదుకున్నారు. దీంతో జట్టు స్కోరు 15వ ఓవర్‌లోనే 150కి చేరింది. నాలుగో వికెట్‌కు 65 పరుగులు జత చేరాక వినోద్ 16వ ఓవర్‌లో వెనుదిరిగాడు. డేవిడ్ (5)ను కూడా రషీద్ అవుట్ చేసినా.. చివ రి 3 ఓవర్లలో సూర్య విశ్వరూపం చూపి ఏకంగా శతకమే పూర్తి చేసుకున్నాడు. ముందుగా 18వ ఓవర్‌లో 4,4,6,2,4తో 20 రన్స్.. తర్వాతి ఓవర్‌లో 6,4,4తో 17.. చివరి ఓవర్‌లో రెండు సిక్సర్లతో 17 రన్స్ సాధించడంతో ముంబై భారీ స్కోరు చేసింది.
స్కోరుబోర్డు
ముంబై : ఇషాన్ (ఎల్బీ) రషీద్ 31, రోహిత్ (సి) తెవాటియా (బి) రషీద్ 29, సూర్యకుమార్ (నాటౌట్) 103, నేహల్ (బి) రషీద్ 15, విష్ణు వినోద్ (సి) అభినవ్ (బి) మోహిత్ 30, డేవిడ్ (సి) అండ్ (బి) రషీద్ 5, గ్రీన్ (నాటౌట్) 3, ఎక్స్‌ట్రాలు 2, మొత్తం (20 ఓవర్లలో) 218/5; వికెట్లపతనం : 1/61, 2/66, 3/88, 4/153, 5/164 ; బౌలింగ్ : షమి 4–0–53–0, మోహిత్ 4–0–43–1, రషీద్ 4–0–30–4, నూర్ అహ్మద్ 4–0–38–0, జోసెఫ్ 4–0–52–0.
గుజరాత్ : సాహా (ఎల్బీ) మధ్వల్ 2, గిల్ (బి) మధ్వల్ 6, హార్దిక్ (సి) ఇషాన్ (బి) బెహ్రన్‌డార్ఫ్ 4, విజయ్ శంకర్ (బి) పీయూష్ 29, మిల్లర్ (ఎల్బీ) మధ్వల్ 41, అభినవ్ మనోహర్ (బి) కార్తికేయ 2, తెవాటియా (సి) గ్రీన్ (బి) పీయూష్ 14, రషీద్ (నాటౌట్) 79, నూర్ అహ్మద్ (బి) కార్తికేయ 1, జోసెఫ్ (నాటౌట్) 7, ఎక్స్‌ట్రాలు 6 ; మొత్తం (20 ఓవర్లలో) 191/8; వికెట్లపతనం : 1/7, 2/12, 3/26, 4/48, 5/55, 6/100, 7/100, 8/103 ; బౌలింగ్ : బెహ్రన్‌డార్ఫ్ 4–0–37–1, ఆకాశ్ మధ్వల్ 4–0–31 –3, జొర్డాన్ 4–0–34–0, పీయూష్ 4–0–36–2, కార్తికేయ 3–0–37–2, గ్రీన్ 1–0–13–0.
సూర్యకుమార్ (49 బంతుల్లో103 నాటౌట్)
రషీద్ ఖాన్ (32 బంతుల్లో 79 నాటౌట్)
1 ఒకే సీజన్‌లో ఐదుసార్లు 200+ స్కోర్లు సాధించిన జట్టుగా ముంబై
2 ఐపీఎల్‌లో ఎక్కువ సిక్సర్లు (252) బాదిన రెండో బ్యాటర్‌గా రోహిత్. గేల్ (357) ముందున్నాడు.