Suryakumar Yadav: ‘‘కొంచెం సమయం పడుతుంది’’ వరల్డ్ కప్ ఫైనల్‌లో టీమిండియా ఓటమిపై సూర్య ఏమన్నాడంటే..?
ABN , First Publish Date - 2023-11-23T14:21:21+05:30 IST
Suryakumar yadav Comments: గురువారం నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభంకానుంది. తొలి మ్యాచ్ విశాఖపట్నం వేదికగా జరగనుంది. చాలా రోజలు తర్వాత విశాఖలో అంతర్జాతీయ మ్యాచ్ జరగబోతుండడం గమనార్హం. ఈ సిరీస్‌లో టీమిండియాకు కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ వ్యవహరిస్తున్నాడు.
విశాఖపట్నం: గురువారం నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభంకానుంది. తొలి మ్యాచ్ విశాఖపట్నం వేదికగా జరగనుంది. చాలా రోజలు తర్వాత విశాఖలో అంతర్జాతీయ మ్యాచ్ జరగబోతుండడం గమనార్హం. ఈ సిరీస్‌లో టీమిండియాకు కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో సూర్య మాట్లాడుతూ.. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించడం పట్ల ఆనందం వ్యక్తం చేశాడు. అందుకోసం ఉత్సాహంగా ఉన్నట్టు చెప్పాడు. అయితే మూడు రోజుల క్రితం జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. దీంతో దాని నుంచి కోలుకోవడానికి సమయం పడుతుందని సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు. ఫైనల్ మ్యాచ్ ముగిసిన 96 గంటల తర్వాతే టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు మరో సిరీస్‌లో తలపడనుండడం గమనార్హం. ఈ క్రమంలోనే మ్యాచ్‌కు ముందు నిర్వహించిన ప్రెస్ మీట్‌లో సూర్యకుమార్ యాదవ్ మాట్లాడాడు. దీంతో ఫైనల్ మ్యాచ్ ఓటమి గురించి సూర్యకు ప్రశ్న ఎదురైంది.
" ప్రపంచకప్ ఫైనల్ ఓటమి నుంచి కోలుకోవడానికి కొంచెం సమయం పడుతుంది. మరుసటి రోజు ఉదయం నిద్రలేచి, జరిగిందంతా మర్చిపోవడం వీలు కాదు. ఎందుకంటే ఇది చాలా సుదీర్ఘమైన టోర్నమెంట్. మేము కప్‌ను గెలవాలని అనుకున్నాం." అని సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు. ఈ క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మపై సూర్య ప్రశంసలు కురిపించాడు. ’’మీరు ఉదయం లేవగానే సూర్యుడు మళ్లీ ఉదయిస్తాడు. చివరన కాంతి ఉంటుంది. మీరు ముందుకు సాగాల్సి ఉంటుంది. ఇది తాజా జట్టు(టీ20 స్క్వాడ్). ఈ జట్టు సవాల్ కోసం ఎదురుచూస్తోంది. అభిమానులు, కుటుంబసభ్యుల మద్దతు తనకు, మిగిలిన ఆటగాళ్లకు నిరాశ నుంచి బయటపడి ముందుకు సాగడానికి సహాయపడతుంది. ఫైనల్ ఓటమి సహజంగానే కాస్త నిరాశపరిచింది. కానీ మా ప్రయాణంలో వెనక్కి తిరిగి చూసుకుంటే గొప్పగా ఆడాం. మైదానంలో ప్రతి ఒక్కరూ ఆడిన విధానం, వారి ప్రదర్శన గురించి భారతదేశం, మా కుటుంబాలు గర్వించాయి. మేము టోర్నీ అంతటా సానుకూల క్రికెట్ ఆడాము. దాని గురించి మేము చాలా గర్వపడతున్నాం. కెప్టెన్ రోహిత్ శర్మ ప్రపంచకప్‌లో బ్యాట్‌తో టీమిండియాకు గేమ్ ఛేంజర్‌గా నిలిచాడు. అతని అద్భుత ఆరంభాలు జట్టు వరుసగా 10 మ్యాచ్‌లను గెలవడంలో సహాయపడ్డాయి. టోర్నీలో రోహిత్ శర్మ పూర్తిగా భిన్నంగా కనిపించాడు. మేము జట్టు సమావేశాల్లో ఏం మాట్లాడామో అతను గ్రౌండ్‌లో అదే పని చేశాడు. మేము అతనిని చూసి గర్విస్తున్నాం. మేము దానిని టీ20ల్లోనూ పునరావృతం చేయాలని ఆశిస్తున్నాం.’’ అని సూర్యకుమార్ యాదవ్ అన్నాడు.