అలవోకగా కొటే్టశారు
ABN , First Publish Date - 2023-05-04T03:46:44+05:30 IST
బ్యాటర్లు సమష్టిగా చెలరేగడంతో ముంబై ఇండియన్స్ వరుసగా రెండో విజయం సాధించింది...

మొహాలీ: బ్యాటర్లు సమష్టిగా చెలరేగడంతో ముంబై ఇండియన్స్ వరుసగా రెండో విజయం సాధించింది. సూర్యకుమార్ (31 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 66), ఇషాన్ కిషన్ (41 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 75) దుమ్మురేపడంతో.. ఐపీఎల్‌లో బుధవారం జరిగిన హైస్కోరింగ్ మ్యాచ్‌లో ముంబై 6 వికెట్లతో పంజాబ్ కింగ్స్‌ను చిత్తు చేసింది. తొలుత పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 214 పరుగులు చేసింది. లివింగ్‌స్టోన్ (42 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 82 నాటౌట్), జితేష్ శర్మ (27 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 49 నాటౌట్) శ్రమ వృథా అయింది. పీయూష్ చావ్లా 2 వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో ముంబై 18.5 ఓవర్లలో 216/4 స్కోరు చేసి గెలిచింది. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ ఇషాన్ కిషన్ అర్ధ శతకంతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
దంచి కొట్టిన బ్యాటర్లు: సూర్యకుమార్ సుడిగాలి బ్యాటింగ్‌తో భారీలక్ష్యాన్ని ముంబై అలవోకగా ఛేదించింది. సూర్య ఎడాపెడా షాట్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించగా.. ఓపెనర్ కిషన్ అతడికి చక్కని సహకారం అందించాడు. 23 బంతుల్లోనే అర్థ శతకం సాధించిన సూర్య.. ఓపెనర్ కిషన్‌తో కలసి మూడో వికెట్‌కు 116 పరుగుల భాగస్వామ్యంతో జట్టును గెలుపు బాట నిలిపాడు. కర్రాన్ వేసిన 13వ ఓవర్‌లో సూర్య రెండు సిక్స్‌లు, రెండు ఫోర్లతో 23 పరుగులు రాబట్టాడు. ఇక, చివరి 30 బంతుల్లో విజయానికి 45 పరుగులు కావల్సి ఉండగా.. సూర్యను ఎలిస్ క్యాచ్ అవుట్ చేశాడు. 178 పరుగుల స్కోరు వద్ద ఇషాన్‌ను అర్ష్‌దీప్ పెవిలియన్ చేర్చాడు. కానీ, డేవిడ్ (19 నాటౌట్), తిలక్ వర్మ (26 నాటౌట్) మరో 7 బంతులు మిగిలుండగానే మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. అంతకుముందు ఇన్నింగ్స్ మూడో బంతికే రోహిత్ శర్మ (0) డకౌటైనా.. ఇషాన్, గ్రీన్ (23) పవర్‌ప్లేలో రెండో వికెట్‌కు 54 పరుగులతో ఆదుకొన్నారు. గ్రీన్‌ను ఎలిస్ క్యాచవుట్ చేసినా.. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన సూర్య యథేచ్ఛగా షాట్లు ఆడుతూ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు.
చెలరేగిన లివింగ్‌స్టోన్, జితేష్: పవర్ హిట్టర్లు లివింగ్‌స్టోన్, జితేష్ భారీషాట్లతో విరుచుకుపడడంతో పంజాబ్ సవాల్ విసరగలిగే లక్ష్యాన్ని నిర్దేశించింది. పసలేని ముంబై బౌలర్లను ఉతికారేసిన వీరు.. నాలుగో వికెట్‌కు 53 బంతుల్లో 119 పరుగుల అభేద్యమైన భాగస్వామ్యంతో జట్టుకు భారీస్కోరు అందించారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ స్వల్ప స్కోరుకే ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ (9) వికెట్‌ను కోల్పోయింది. కానీ, మరో ఓపెనర్ ధవన్ (30), షార్ట్ (27) నిలకడైన ఆటతో పవర్‌ప్లే ముగిసేసరికి 50/1తో నిలిచింది. అయితే, ఎనిమిదో ఓవర్‌లో చావ్లా బౌలింగ్‌లో భారీషాట్ ఆడే క్రమంలో ధవన్ స్టంపౌట్ కావడంతో.. రెండో వికెట్‌కు 49 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అయితే, లివింగ్‌స్టోన్ రాకతో స్కోరుబోర్డు ఊపందుకొంది. ఆకాష్ వేసిన 11వ ఓవర్‌లో లివింగ్‌స్టోన్ 4,6తో 16 పరుగులతో గేర్ మార్చే ప్రయత్నం చేశాడు. కానీ, ఆ తర్వాతి ఓవర్‌లో షార్ట్‌ను చావ్లా బౌల్డ్ చేసే సరికి పంజాబ్ 95/3 స్కోరు చేసింది. ఈ దశలో లివింగ్‌స్టోన్‌కు జితేష్ కలవడంతో స్కోరుబోర్డు రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. ఆర్చర్ వేసిన 13వ ఓవర్‌లో నాలుగు బౌండ్రీలతో 21 పరుగులు రాబట్టిన జితేష్.. ఆ తర్వాతి ఓవర్‌లో మరో సిక్స్ బాదాడు. మరోవైపు ఫోర్‌తో అర్ధ శతకం పూర్తి చేసుకొన్న లివింగ్‌స్టోన్.. 19వ ఓవర్‌లో ఆర్చర్ బౌలింగ్‌లో హ్యాట్రిక్ సిక్స్‌లతో 27 పరుగులు పిండుకొన్నాడు. దీంతో టీమ్ స్కోరు 200 పరుగుల మార్క్ దాటింది. వీరిద్దరి దెబ్బకు చివరి 5 ఓవర్లలో ముంబై బౌలర్లు 69 పరుగులు సమర్పించుకొన్నారు.
స్కోరుబోర్డు
పంజాబ్: ప్రభ్‌సిమ్రన్ (సి) ఇషాన్ (బి) అర్షద్ 9, ధవన్ (స్టంప్డ్) ఇషాన్ (బి) చావ్లా 30, షార్ట్ (బి) చావ్లా 27, లివింగ్‌స్టోన్ (నాటౌట్) 82, జితేష్ (నాటౌట్) 49, ఎక్స్‌ట్రాలు: 17; మొత్తం: 20 ఓవర్లలో 214/3; వికెట్ల పతనం: 1–13, 2–62, 3–95; బౌలింగ్: గ్రీన్ 2–0–15–0, అర్షద్ 4–0–48–1, ఆర్చర్ 4–0–56–0, పీయూష్ చావ్లా 4–0–29–2, కార్తికేయ 3–0–24–0, ఆకాశ్ 3–0–37–0.
ముంబై: రోహిత్ (సి) షార్ట్ (బి) రిషి 0, ఇషాన్ (సి) రిషి (బి) అర్ష్‌దీప్ 75, గ్రీన్ (సి) చాహర్ (బి) ఎలిస్ 23, సూర్యకుమార్ (సి) అర్ష్‌దీప్ (బి) ఎలిస్ 66, టిమ్ డేవిడ్ (నాటౌట్) 19, తిలక్ వర్మ (నాటౌట్) 26, ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 18.5 ఓవర్లలో 216/4; వికెట్ల పతనం: 1–0, 2–54, 3–170, 4–178; బౌలింగ్: రిషి ధవన్ 3–0–20–1, అర్ష్‌దీప్ 3.5–0–66–1, కర్రాన్ 3–0–41–0, ఎలిస్ 4–0–34–2, రాహుల్ చాహర్ 3–0–30–0, హర్‌ప్రీత్ 2–0–21–0.
పాయింట్ల పట్టిక
జట్టు ఆ గె ఓ ఫ.తే పా నె.రరే
గుజరాత్ 9 6 3 0 12 0.532
లఖ్‌నవూ 10 5 4 1 11 0.639
చెన్నై 10 5 4 1 11 0.329
రాజస్థాన్ 9 5 4 0 10 0.800
బెంగళూరు 9 5 4 0 10 –0.030
ముంబై 9 5 4 0 10 –0.373
పంజాబ్ 10 5 5 0 10 –0.472
కోల్‌కతా 9 3 6 0 6 –0.147
హైదరాబాద్ 8 3 5 0 6 –0.577
ఢిల్లీ 9 3 6 0 6 –0.768
గమనిక: ఆ: ఆడినవి; గె: గెల్చినవి; ఓ: ఓడినవి;
ఫ.తే: ఫలితం తేలనివి; పా: పాయింట్లు; నె.రరే: నెట్ రన్‌రేట్