CP Ranganath: సీపీ హెచ్చరిక.. తల్వార్‌లు తిప్పితే కటకటాలకే..
ABN , First Publish Date - 2023-08-30T12:33:49+05:30 IST
బహిరంగంగా తల్వార్‌లను చూపించినా, విందు వినోదాల్లో ప్రదర్శనలు చేసినా ఇకపై జైలుకు వెళ్లడం ఖాయమని
- వరంగల్ సీపీ రంగనాథ్ హెచ్చరిక
హనుమకొండ(వరంగల్): బహిరంగంగా తల్వార్‌లను చూపించినా, విందు వినోదాల్లో ప్రదర్శనలు చేసినా ఇకపై జైలుకు వెళ్లడం ఖాయమని వరంగల్ సీపీ రంగనాథ్(Warangal CP Ranganath) ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఇటీవల కమిషనరేట్ పరిధిలో తల్వార్ల సంస్కృతి పెరిగిపోయిందని, ఎవరైనా తల్వార్లు ఉపయోగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. కత్తులు, తల్వార్లతో ఫొటోలకు ఫోజులు ఇస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, వారిపై ప్రత్యేక ఫోకస్ పెట్టామని తెలిపారు. పుట్టిన రోజు వేడుకలు, పెళ్లి బరాత్‌లలో కత్తులు, తల్వార్లతో విన్యాసాలు చేస్తున్నవారు, చేసిన వారిపై దృష్టి సారించామని పేర్కొన్నారు. బర్త్‌డే వేడుకల్లో కత్తులు, తల్వార్లతో దిగిన ఫొటోలను జంక్షన్లలో కట్టిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. రాత్రి సమయాల్లో ప్రధాన కూడళ్లలో తల్వార్లతో కేక్‌కకు కట్ చేసి ప్రజలను భయాందోళనకు గురి చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ రంగనాథ్ హెచ్చరించారు.