EMset : మే 7 నుంచి ఎంసెట్
ABN , First Publish Date - 2023-02-08T03:30:47+05:30 IST
రాష్ట్రంలో నిర్వహించే వివిధ ప్రవేశ పరీక్షల తేదీలను ప్రభుత్వం ప్రకటించింది.

7-11 వరకు ఇంజనీరింగ్
12-14 వరకు అగ్రికల్చర్ ఫార్మసీ
మే 18న ఎడ్‌సెట్.. 20న ఈసెట్
పలు సెట్ల తేదీలను ప్రకటించిన విద్యాశాఖ
హైదరాబాద్, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నిర్వహించే వివిధ ప్రవేశ పరీక్షల తేదీలను ప్రభుత్వం ప్రకటించింది. మే 7 నుంచి 14 వరకు ఎంసెట్ పరీక్షలను నిర్వహించనున్నారు. ఎంసెట్ తర్వాత వరసగా ఎడ్‌సెట్, ఈసెట్, లాసెట్, ఐసెట్, పీజీఈసెట్‌లను నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం తన కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమావేశమై ఈ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేశారు. పరీక్షలకు సంబంధించిన పూర్తి స్థాయి షెడ్యూల్‌ను త్వరలోనే ఆయా సెట్ల కన్వీనర్లు ప్రకటించనున్నారు. ఈ ప్రవేశ పరీక్షల నిర్వహణలో భాగంగా మొదట ఎంసెట్‌ను నిర్వహించాలని నిర్ణయించారు. మే 7 నుంచి 11 వరకు ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగం పరీక్షలను నిర్వహించనున్నారు. మే 12 నుంచి 14 వరకు ఎంసెట్ అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తారు. మే 18న ఎడ్‌సెట్, 20నఈసెట్, 25న లాసెట్, 26, 27వ తేదీల్లో ఐసెట్, మే 29 నుంచి జూన్ 1 వరకు పీజీఈసెట్‌లను నిర్వహించాలని నిర్ణయించారు.
ఇంటర్ మార్కుల వెయిటేజీ లేనట్లే!
ఎంసెట్‌లో ఇంటర్ మార్కుల వెయిటేజీని పూర్తి స్థాయిలో రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ అంశంపై ఇప్పటికే అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. కరోనా కంటే ముందు ఎంసెట్‌లో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీని అమలు చేసేవారు. కరోనా నేపథ్యంలో మూడేళ్లుగా ఈ వెయిటేజీ పద్ధతిని తొలగించారు. ఎంసెట్‌లో వచ్చే మార్కులతోనే ర్యాంకులను ప్రకటించారు. జేఈఈ వంటి వాటిల్లో మార్కుల వెయిటేజీ పద్ధతి లేదు. దీంతో ఎంసెట్‌లో కూడా దీన్ని రద్దు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. కాగా, వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో చేరడానికి ఇంటర్‌లో కనీస మార్కుల అర్హతపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది..
వివిధ ప్రవేశ పరీక్షల తేదీల వివరాలు..
సెట్ పేరు యూనివర్సిటీ తేదీలు
ఎంసెట్ జేఎన్‌టీయూ 07-05-2023
నుంచి 14-05-2023
ఎడ్‌సెట్ మహాత్మాగాంధీ 18-05-2023
ఈసెట్ ఉస్మానియా 20-05-2023
లాసెట్ ఉస్మానియా 25-05-2023
ఐసెట్ కాకతీయ 26-05-2023
నుంచి 27-05-2023
పీజీఈసెట్ జేఎన్‌టీయూ 29-5-2023
నుంచి 01-06-2023