Kishan Reddy: తెలంగాణలో 210 లక్షల క్వింటాళ్ల పత్తి సేకరణ
ABN , Publish Date - Mar 27 , 2025 | 04:44 AM
దేశీయంగా పత్తి దిగుబడిలో మూడో స్థానంలో ఉన్న తెలంగాణలో 2014-15 నుంచి 2024-25 వరకూ సీసీఐ ద్వారా రూ.58 వేల కోట్లపై చిలుకు విలువ గల పత్తి సేకరించినట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు.

కేంద్ర బొగ్గు, గనుల మంత్రి కిషన్‌రెడ్డి
న్యూఢిల్లీ, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం (2024-25)లో 110 పత్తి సేకరణ కేంద్రాల ద్వారా 210.19 లక్షల క్వింటాళ్ల పత్తిని సేకరించిందని కేంద్ర బొగ్గుగనులశాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి తెలిపారు. దీని విలువ రూ. 15,556 కోట్లు ఉంటుందని బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బహిరంగ మార్కెట్‌లో పత్తికి సరైన ధరలు లభించకపోవడంతో 2024-25లో కనీస మద్దతుధరకే పత్తిని కొనుగోలు చేయడంతో తొమ్మిది లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి చేకూరిందన్నారు. దేశీయంగా పత్తి దిగుబడిలో మూడో స్థానంలో ఉన్న తెలంగాణలో 2014-15 నుంచి 2024-25 వరకూ సీసీఐ ద్వారా రూ.58 వేల కోట్లపై చిలుకు విలువ గల పత్తి సేకరించినట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. 2014-15లో క్వింటాల్ పత్తికి కనీస మద్దతు ధర రూ.3,750 కాగా, 2024-25లో దాదాపు రెండు రెట్లు పెరిగి రూ.7,121కి చేరిందన్నారు.